ముంబై: భారత్‌లో రుతువవనాలు ఆలస్యం అవ్వడం రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేస్తుందని జర్మనీకి చెందని డాయిష్ బ్యాంక్ అంచనా వేసింది. మే నెల ద్రవ్యోల్బణం డేటా శాంతించినట్టు అధికారిక గణాంకాలు చూపించినా కానీ, ఈ విషయంలో సంతృప్తి చెందడానికి లేదని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (202324)లో సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 5.2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.
ఇది ఆర్‌బీఐ అంచనా 5.1 శాతానికి దగ్గరగానే ఉంది. విశ్లేషకులు అయితే 5 శాతంగా ఉండొచ్చని భావిస్తున్నారు. ‘‘రుతుపవన వర్షాలు ప్రస్తుతం సాధారణ స్థాయికి 53 శాతం తక్కువగా ఉన్నాయి. వర్షపాతం బలహీనంగా ఉన్నప్పుడు ఆహారం ధరలు పెరిగిపోతాయని చారిత్రక గణాంకాలు చెబుతున్నాయి. అందుకని, భారత్‌కు సంబంధించి ద్రవ్యోల్బణం రిస్క్‌ల విషయంలో ఇప్పటి వరకైతే సంతృప్తికి అవకాశం లేదు’’అని డాయిష్ బ్యాంక్ తెలిపింది.
జూలై, ఆగస్ట్‌లో ఆహార ధరలు పెరగకుండా, అదృష్టం తోడయితేనే రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతం, అంతకంటే తక్కువలో ఉండొచ్చని పేర్కొంది. వర్షాకాలంలో జూలై నెల కీలకమని, సాధారణంగా ఆహార ధరలు ఈ నెలలోనే ఎక్కువగా పెరుగుతాయని వివరించింది. చివరిగా 2009, 2014 సంవత్సరాల్లో వర్షాలు తక్కువగా ఉన్న సందర్భాల్లో జూలైలోనే ధరలు అధికంగా పెరిగినట్టు గుర్తు చేసింది.
ఇప్పటి వరకు నైరుతి రుతుపవన సీజన్‌లో 53 శాతం వర్షపాతం తక్కువగా ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించడం గమనార్హం. కూరగాయాల్లో ఎక్కువగా డిమాండ్ ఉండే ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, టమాటోల ధరలు రానున్న నెలల్లో గణనీయంగా పెరగొచ్చని డాయిష్ బ్యాంక్ అంచనా వేసింది. 2023లో ఎల్‌నినో రిస్క్ ఉన్నందున వర్షాలు ఆలస్యంగా రావడం ద్రవ్యోల్బణం పరంగా ఆందోళన కలిగించే అంశమని అభిప్రాయపడింది.
వృద్ధిపైనా ప్రభావం
రుతుపవనాలు బలహీనంగా ఉంటే అది దేశ జీడీపీ వృద్ధిపైనా ప్రభావం చూపించొచ్చని డాయిష్ బ్యాంక్ తెలిపింది. వర్షాలు నిరాశపరిచి, వ్యవసాయ వృద్ధి 2004, 2009, 2014 కరువు సంవత్సాల్లో మాదిరే 1 శాతం స్థాయిలో ఉంటే, జీడీపీ వృద్ధి 0.30 శాతం తగ్గిపోవచ్చని అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment