అమెరికా మలిదఫా ఆర్థిక సంక్షోభంలోకి వేగంగా జారిపోతోంది. ఒక పక్క ద్రవ్యోల్బణం, మరో పక్క వృద్ధిరేటును కాపాడుకునేందుకు ఉద్దీపనల అవసరం అడకత్తెరలో పోకచెక్క పరిస్థితికి దిగజార్చాయి. ద్రవ్యోల్బణాన్ని అరికట్టే పేరిట పెంచుతూ పోయిన బ్యాంకు వడ్డీ రేట్లు, ఆర్థిక మందగమనం దిశగా నెడుతున్నాయి.
ఈ నేపథ్యంలో జో బైడెన్ ప్రతిపాదిస్తోన్న ‘బైడెనామిక్స్’ నయా ఉదారవాద విధానాలకు ముగింపు కానున్నాయా? 1930లలో శారీరక శ్రమ ఆధారిత కాలంలో ఆనాటి అమెరికా అధ్యక్షుడు రూజ్‌వెల్ట్ ‘ప్రజాహిత కార్యక్రమాలు’ పట్టాలు తప్పిన పెట్టుబడిదారీ వ్యవస్థలో తిరిగి ప్రజలకు ఉపాధిని కల్పించగలిగాయి. కానీ నేటి కృత్రిమ మేధ యుగంలో బైడెనామిక్స్ అటువంటి సానుకూల ఫలితాలను తిరిగి ఆవిష్కరించలేదు.
అమెరికాలో 1980ల వరకూ ఉన్న సంక్షేమ రాజ్య స్థానంలో మొదలైన ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలు తెచ్చిపెట్టిన మోచేతినీళ్ల (ట్రికిల్ డౌన్) ఆర్థిక శాస్త్రం దారుణంగా విఫలమైందనేది స్పష్టం. దీనినే, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా అంగీకరిస్తున్నారు. ఆయన ‘సరికొత్త’గా బైడెనామిక్స్ పేరిట ప్రతిపాదిస్తోన్న ఆర్థిక విధానాలు పాత రోత ట్రికిల్ డౌన్‌కూ, అది ప్రతిపాదించే కార్పొరేట్ అనుకూల నయా ఉదారవాద విధానాలకూ ముగింపు కానున్నాయనేది అంచనా.
అంటే 1930ల ఆర్థిక పెనుమాంద్య కాలంలో, నాటి అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డిలానో రూజ్‌వెల్ట్ నేతృత్వంలో ఆవిష్కరించిన సంక్షేమ రాజ్యం దిశగా తిరిగి అమెరికా ప్రయాణం కడుతోందని అనిపించక మానదు. బైడెన్ 2024లో మరోసారి అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కి, కార్మిక, ఉద్యోగ, సామాన్య జనాల అనుకూల ఆర్థిక విధానాలను విజయవంతంగా ‘కొనసాగించ’గలరా? ఒకవేళ బైడెన్ 2024లో మళ్లీ గెలవడం తథ్యం అనుకుంటే, ఆయన సరికొత్త కల అయిన పాత సంక్షేమ రాజ్యాన్ని తిరిగి పునరుద్ధరించగలరా?
దీనికి జవాబు సులువు. 1930లలో రూజ్‌వెల్ట్ అమలు జరిపిన ‘ప్రజాహిత కార్యక్రమాలు’ లేదా పబ్లిక్ వర్క్స్ నాడు పట్టాలు తప్పిన పెట్టుబడిదారీ వ్యవస్థలో, మరలా తిరిగి ప్రజలకు ఉపాధిని కల్పించ గలిగాయి. నాటి మాంద్యంలో, నిరుద్యోగం విపరీతంగా పెరిగి పోయిన దశలో – ప్రైవేట్ పెట్టుబడిదారులు, ఇక ఎంతమాత్రమూ కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు లేదా మూతబడిన తమ పరిశ్ర మలను తిరిగి తెరిచేందుకు సిద్ధంకాని స్థితిలో, నాటి అమెరికా ప్రభుత్వమే స్వయంగా పూనుకుని తన పెట్టుబడుల ద్వారా ప్రజలకు తిరిగి ఉపాధి కల్పించింది.
ఈ విధంగా ప్రభుత్వం కల్పించిన ఉపాధి ద్వారా కాస్తంత పుంజుకున్న ప్రజల కొనుగోలు శక్తి – మార్కెట్లో ప్రైవేట్ ఉత్పత్తిదారులకు తిరిగి తమ సరుకును అమ్ముకునే అవ కాశాన్ని కల్పించింది. తద్వారా వారు, తిరిగి తమ పరిశ్రమలను తెరవగలిగారు. ఫలితంగా, మాంద్యంతో పట్టాలు తప్పిన ప్రైవేటు కార్పొరేట్ వ్యవస్థ తిరిగి కోలుకోగలిగింది. ఈ క్రమంలోనే ప్రజలకు మరలా ఉద్యోగ అవకాశాలు తిరిగి వచ్చాయి.
నేటి బైడెనామిక్స్ కూడా దరిదాపుగా ఇదే ఆర్థిక సూత్రీకరణ ప్రాతిపదికన అమెరికాలో మాంద్యం స్థితిని అధిగమించే ప్రయత్నం చేయజూస్తోంది. గతంలోని సంక్షేమరాజ్యాన్ని కూలదోసి 1980లలో వచ్చిన నయా ఉదారవాద ఆర్థిక విధానాలకు చరమగీతం పాడటం, దాని స్థానంలో సరికొత్త రూపంలో మరలా తిరిగి సంక్షేమ రాజ్యాన్ని ఆవిష్కరించడం ప్రస్తుతం బైడెన్ యత్నంగా ఉంది. 1930లు, 2023లలో ఒకే తరహా విధానాల అమలు సాధ్యమేనా?
1930లలోని సాంకేతిక పరిజ్ఞాన స్థాయి రూజ్‌వెల్ట్ అమలు జరిపిన పబ్లిక్ వర్క్స్ కార్యక్రమాలకు అనుకూలంగా ఉంది. ప్రభుత్వం పూనుకుని పెట్టుబడులు పెడితే, తద్వారా పెరిగిన ప్రజల కొనుగోలు శక్తి వల్ల... ప్రైవేటు రంగం కోలుకునేందుకు, ఉపాధి కల్పనకు నాడు అవకాశాలున్నాయి. ఎందుచేతనంటే, నాటి సాంకేతిక పరిజ్ఞానం యావత్తూ కేవలం శారీరక శ్రమను అనుకరించేది లేదా దానికి ప్రత్యా మ్నాయంగా ఉండేది మాత్రమే. నేటికిలా మేధోశ్రమను అనుకరించే లేదా దానికి ప్రత్యామ్నాయం కాగల సాఫ్ట్‌వేర్ రంగం, ఇంటర్నెట్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలు లేవు.
కాబట్టే నాడు మానవ మేధస్సుకు, దాని నుంచి ఉద్భవించే నిపుణతలకు ప్రత్యామ్నాయం లేదు. కేవలం, మానవుడి శారీరక శ్రమను తగ్గించగల... ఉత్పత్తిని మరిన్ని రెట్లు పెంచగల తరహా సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే నాడు అందుబాటులో ఉంది. కాబట్టి, నాడు ఇంకా మనిషికి వ్యవస్థలో పని కల్పించే అవకాశం ఉంది. ఫలితంగానే, నాడు ప్రభుత్వ పెట్టుబడులు ప్రైవేటు రంగం కోలుకుని అది తిరిగి ఉపాధి కల్పనను చేయగలిగేటందుకు పనికొచ్చాయి.
కానీ, నేడు ప్రభుత్వ ‘పెట్టుబడులు’ ఉపాధి కల్పించే విగా కాక, కేవలం ఆర్థిక వ్యవస్థకు ఉత్ప్రేరకాలుగా లేదా ఉద్దీపనలుగా మాత్రమే ఉంటున్నాయి. ఈ కారణం చేతనే, భారతదేశంలో కూడా గ్రామీణ పేద ప్రజానీకానికి ఉపాధి కల్పించే – జాతీయ ఉపాధి హామీ పథకంలో, యంత్రాల వినియోగంపై పరిమితులు పెడుతూ 2005 –06 కాలంలోనే నిబంధనలు ఏర్పరచవలసి వచ్చింది.
కాబట్టి, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, రోబోలు, ఆటోమేషన్ల యుగంలో బైడెనామిక్స్... నాటి రూజ్వెల్ట్ విధానాల వంటి సానుకూల ఫలితాలను తిరిగి ఆవిష్కరించలేదు. అలా జరగాలంటే ప్రస్తుతం మేధో శ్రమకు కూడా ప్రత్యామ్నాయంగా వచ్చిన అధునాతన సాంకే తికతలు అన్నింటినీ స్వచ్ఛందంగా పరిత్యజించుకోగలగాలి. ఒక రకంగా పాత పలుగు, పార దశకో లేకుంటే మర యంత్రాల దిశకో తిరిగి మళ్లగలగాలి. ఇది సాధ్యమా? అసాధ్యమనేదే ఇంగితం మనకు ఇచ్చే జవాబు. కాబట్టి, నేటి బైడెనామిక్స్ ఆచరణలో కేవలం ఆదర్శ వాదంగానే మిగిలిపోగలదు.
మరి ఏది దారి? మానవ జాతికి భవిష్యత్తు ఎలా? కోటానుకోట్ల మందికి ఉపాధి కల్పన నేటి సాంకేతికతల కాలంలో సాధ్యం కానట్టేనా? దీనికి జవాబు – సాధ్యమే! కానీ ఎలా? సాధారణంగా, విధానాల రూపకల్పన, మేనేజ్మెంట్ రంగాలలోని వారు వాడే పద జాలంలో ‘అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్’ అనే మాట ఉంది. మామూలు రోజువారీ అలవాటుపడి పోయిన మూసపోత ఆలోచనా విధానాన్ని దాటుకుని ఆలోచించగలగడం.
ఇక్కడ ఈ వ్యవస్థలో రోజువారీ మనం అలవాటుపడిపోయిన ఆలోచనా విధానం – పెట్టుబడిదారులు ఉండడం, వారు సరుకు ఉత్పత్తి రంగంలోనో లేదా సేవా రంగంలోనో పరిశ్రమలు పెట్టడం, తద్వారా మెజారిటీ ప్రజలకు ఉపాధి అవకాశాలు లభించడం... అనేది. కానీ, నేడిది వర్కవుట్ కాని ఆలోచనా విధానం. ఎందుకంటే, ఏ పెట్టుబడిదారుడైనా, పెట్టు బడులు పెట్టేది లాభాల కోసమే.
దాని ఫలితంగా అంటే, మరో రకంగా చెప్పాలంటే, ఈ క్రమంలో ఉపాధి కల్పన అనేది ద్వితీయ ప్రాధాన్యతా అంశం. మరి ఈ లాభాలను పెట్టుబడిదారుడు – మను షుల స్థానంలో యంత్రాలను వినియోగించడం ద్వారా పొంద గలిగితేనో? నేడు జరుగుతోంది అదే. నిజానికి, సాంకేతిక పురో గమన క్రమంలో జరుగుతూ వచ్చిందంతా అదే. కానీ, నేడు ఈ సాంకేతిక పరిజ్ఞాన ఎదుగుదల – ఉత్పత్తిలో మనిషికి ఏ ప్రాధాన్యతా లేదా అవ సరం లేని స్థితికి చేరుకుంటోంది. అదీ విషయం!
ఈ క్రమంలో... వ్యవస్థాగత పరిమితులలో, బైడెన్ ముందుకు తెస్తోన్న బైడెనామిక్స్ ఆశిస్తోన్న సానుకూల ఫలితాలను తెచ్చి పెట్టలేదు. కాబట్టి నేడు ప్రపంచవ్యాప్తంగా మానవ కల్యాణం కోసం, ప్రజలందరి బాగుకోసం కావాల్సింది – మరో సరికొత్త వ్యవస్థాగత నిర్మాణం. ఎక్కడైతే కేవలం లాభాలే పరమావధి కావో... పెట్టుబడి అంతిమ లక్ష్యం ఆ లాభాల పెరుగుదల మాత్రమే కాదో అటువంటి సరికొత్త సామాజిక, ఆర్థిక నిర్మాణం మాత్రమే ప్రస్తుత నిరుద్యోగం, మాంద్యాలకు పరిష్కారం చూపగలదు.
కాబట్టి, నేటి బైడెన్ యత్నం... కేవలం వ్యవస్థను కాపాడుకునే చిట్టచివరి దింపుడు కళ్లం ఆశగా మాత్రమే మిగిలిపోగలదు. కానీ అంతిమంగా అటు అమెరికా ప్రజానీకం, ఇటు మొత్తంగా ప్రపంచ ప్రజానీకం కూడా ఈ పరి ష్కారం దిశగా కదిలి తీరుతారు. వారలా కదిలే దిశగా కాలం, పరిస్థితులే వారిని ప్రేరేపిస్తాయి. మానవ జాతి ఇప్పటివరకూ తన పరిణామ క్రమంలో అధిగమించలేక పోయిన చిక్కుముడి అంటూ ఏదీ లేదు. నేడు కూడా అంతే. మనిషి జయించి తీరుతాడు. దారి ముందుకే, విజయానికే.
డి. పాపారావు
వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు ‘ 98661 79615
Comments
Please login to add a commentAdd a comment