దూత లేని దౌత్యమా? | Sakshi Guest Column On Joe Biden American Ambassador | Sakshi
Sakshi News home page

దూత లేని దౌత్యమా?

Published Wed, Jan 18 2023 12:29 AM | Last Updated on Wed, Jan 18 2023 12:29 AM

Sakshi Guest Column On Joe Biden American Ambassador

రెండేళ్ల క్రితం జో బైడెన్‌ అమెరికా అధ్యక్షుడిగా అధికారం స్వీకరించినప్పటి నుంచీ న్యూఢిల్లీలో అమెరికా రాయబారి లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. అమెరికా – భారత్‌ భాగస్వామ్యం తమ అత్యంత ముఖ్యమైన సంబంధాల్లో ఒకటని బైడెన్‌ అన్నారు. భారత్‌లో శాశ్వత రాయబారి లేకపోవడానికి సెనేట్‌ నిర్ధారణ ప్రక్రియే కారణమంటూ శ్వేత సౌధ అధికారులు భుజాలు ఎగరేస్తారు. కానీ అమెరికా బహిరంగంగా పేర్కొంటున్నట్లుగా భారత్‌ తనకు అంత విలువైన దేశమే అయినట్లయితే, భారత రాయబారిగా తన నామినీ ఎరిక్‌ గార్‌సెటీని నిర్ధారింప జేసుకోవడంలో అధ్యక్ష పాలనా యంత్రాంగం మరింత శక్తిని ఎందుకు ప్రదర్శించడం లేదనే ప్రశ్న ఇప్పటికీ మిగిలే ఉంది.

భారత్‌లో అమెరికా రాయబారిగా లాస్‌ ఏంజెల్స్‌ మాజీ మేయర్‌ ఎరిక్‌ గార్‌సెటీని తిరిగి నామినేట్‌ చేయడానికి జో బైడెన్‌ యంత్రాంగం తీసుకున్న తాజా నిర్ణయం ఇరుదేశాల ద్వైపాక్షిక బాంధవ్యపు విచిత్ర పరిస్థితిని ఎత్తి చూపింది.  రెండేళ్ల క్రితం బైడెన్‌ అధికారం స్వీకరించినప్పటి నుంచీ న్యూఢిల్లీలో అమెరికా రాయబారి లేరు. ఇండో–పసిఫిక్‌లో చైనాకు శక్తిమంతమైన ప్రతిజోడిగా భారత్‌ మీద అమెరికా ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్న సమయంలో ఇలా జరగడం గమనార్హం.

క్వాడ్‌ సభ్యులైన ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాతో కలిసి పనిచేస్తున్న భారత్‌ ఈ ప్రాంతంలో అధికార సమతౌల్యాన్ని కొనసాగించడానికి కీలకంగా ఉంటోంది. ఇజ్రాయెల్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, అమెరికాతో ఉన్న ఐ2యూ2 భాగస్వామ్య కూటమి సభ్యురాలిగా కూడా భారత్‌ మొత్తం మధ్యప్రాచ్యంలో చైనా ప్రభావాన్ని నిలువరించడంలో కీలక పాత్రను కలిగి ఉంటోంది.

వ్యూహాత్మకంగా ఇంత ప్రాధాన్యం కలిగినది అయినప్పటికీ, శ్వేత సౌధం రెండేళ్లుగా భారత్‌లో అమెరికా రాయబారి పదవిని ఖాళీగా ఎందుకు ఉంచినట్లు? అయితే, భారత్‌కు దీంతో ఏమాత్రం సంబంధం లేదు. 2021 జూలైలో గార్‌సెటీ అమెరికా ప్రభుత్వ నూతన యంత్రాంగంలోకి నామినేట్‌ అయ్యారు. కానీ సెనేట్‌లో తన నియామక నిర్ధారణ సమస్యల్లో చిక్కుకుంది. మేయర్‌గా గార్‌సెటీ తన సహాయకుల్లో ఒకరిపై వచ్చిన లైంగిక వేధింపు ఫిర్యాదులను పట్టించుకోలేదన్న ఆరోపణలు తలెత్తాయి.

ఈ నేపథ్యంలో గార్‌సెటీ నియామకాన్ని సమర్థిస్తూ ఓటు వేయాలని పార్టీ ఇచ్చిన పిలుపును వ్యతిరేకిస్తూ కొంతమంది డెమోక్రాట్లు తమ ప్రత్యర్థులైన రిపబ్లికన్లతో చేతులు కలిపారు. ఏప్రిల్‌ నెలలో అంటే నామినేషన్ ను ప్రకటించిన తొమ్మిది నెలల తర్వాత, గార్‌సెటీని రాయబారిగా నిర్ధారించేందుకు తగిన ఓట్లు తన వద్ద ఉండకపోవచ్చని సెనేట్‌ మెజారిటీ లీడర్‌ చక్‌ షుమెర్‌ అంగీకరించారు. దీంతో భారత్‌లో అమెరికా రాయబారి పదవి అనిశ్చితిలో ఉండిపోయింది.

దీనిపట్ల ప్రారంభంలో ఎలా స్పందించాలో తెలియని భారతీయ అధికారులు తర్వాత చీకాకుపడ్డారు. గత 20 నెలల కాలంలో పలువురు అమెరికన్‌ దౌత్యవేత్తలు తాత్కాలిక బాధ్యతలు స్వీకరించారు. కానీ తమ విజయానికి అతి ముఖ్యమైన స్థానిక సంబంధాలను నెలకొల్పుకోవడానికి ముందే వారంతా బదిలీ అవుతూ వచ్చారు. ఇటీవల, రాయబార పదవికి కెరీర్‌ డిప్లొమాట్‌ అయిన ఎలిజిబెత్‌ జోన్్స పేరు ప్రకటించారు. కానీ ఆమె నియామకం కూడా తాత్కాలికమే. పూర్తి కాలం రాయబారిని నిర్ధారించగానే ఆమె వైదొలుగుతారని భావిస్తున్నారు.

భారత్‌లో అమెరికా రాయబారి లేకపోవడమన్నది భారత్‌తో పొత్తును విస్తృతపర్చుకోవడంలో అమెరికా నిబద్ధత పైనే ప్రశ్నలు లేవనెత్తింది. అమెరికా–భారత్‌ భాగస్వామ్యం తమ అత్యంత ముఖ్య మైన సంబంధాల్లో ఒకటని అమెరికా అధ్యక్షుడు అన్నారు. భారత్‌ తమకు ఒక విస్మరించలేని భాగస్వామి అని కూడా ఆయన కొని యాడారు. కానీ న్యూఢిల్లీలో అమెరికా రాయబారిని నియమించడంలో బైడెన్‌ ప్రభుత్వ అసమర్థత కొందరు భారతీయులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. లండన్, ప్యారిస్‌ నగరాల్లో కూడా ఇంత సుదీర్ఘ కాలంపాటు ఈ పదవిని అమెరికా ఖాళీగా ఉంచగలిగేదా అనేది వారి ఆశ్చర్యానికి కారణం.

ఇదే సమయంలో అమెరికా, భారత్‌ మధ్య వ్యూహాత్మక భాగ స్వామ్యం ఇంత కీలకంగా ఇదివరకెన్నడూ లేదని చెప్పాలి. చైనాతో పెరుగుతున్న తమ శత్రుత్వం నేపథ్యంలో అమెరికా పక్షాన నిలబడా లంటూ సంవత్సరాలుగా తెస్తున్న ఒత్తిడులను భారత్‌ ప్రతిఘటిస్తూ వచ్చింది. కానీ హిమాలయాల్లో భారత్‌ భూభాగంలోకి చైనా ఇటీవలి ఆక్రమణలు చైనా విస్తరణవాదాన్ని భారత్‌ సవాలు చేసేలా చేశాయి. ఈ ఉమ్మడి అవసరానికి తోడుగా, భద్రత, సాంకేతికత, పర్యావరణ మార్పు అంశాల్లో అమెరికా సాయం భారత్‌ కోరుతోంది.

భారత్‌ ఒక ముఖ్యమైన ఆర్థిక భాగస్వామి కూడా. అలాగే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించినంతవరకూ భారత ఉపఖండానికి అమెరికా అతిపెద్ద వనరుగా ఉంటోంది. 2021లో వీటి విలువ 45 బిలియన్‌ డాలర్లు. అంతర్జాతీయ సరఫరా చెయిన్లపై చైనా ఆధి పత్యాన్ని నిలువరించేలా అమెరికన్‌ అధికారులు తమ ఉత్పాదక స్థావరాలను నెలకొల్పేలా అమెరికన్‌ కంపెనీలను ప్రోత్సహిస్తూ వచ్చారు.

ఈ క్రమంలో వారు అమెరికా పాలనా యంత్రాంగానికి చెందిన ‘ప్రధానమైన మిత్రుల’ ఎజెండాలో భారత్‌ను కేంద్ర స్థానంలో నిలిపారు. ఉదాహరణకు ఆపిల్‌ కంపెనీ 2025 సంవత్సరానికల్లా తన మొత్తం ఐఫోన్ లలో దాదాపుగా 25 శాతాన్ని భారత్‌లోనే ఉత్పత్తి చేయ నుందని భావిస్తున్నారు. అదే విధంగా, భారతీయ ఔషధ కంపెనీలు ఆమెరికా సాధారణ జనరిక్‌ మందుల ప్రధాన సరఫరాదారుగా చైనాను తోసిరాజనగలుగుతాయి.

అయితే గార్‌సెటీ నియామకాన్ని నిర్ధారించడంలో అమెరికా వైఫల్యం ఇరుదేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన బాంధవ్యాన్ని వమ్ము చేసింది. ఆ నిర్ధారణలోని ఘర్షణను అలా ఉంచినట్లయితే, భారత్‌లో రాయబారి పదవికి గార్‌సెటీ ఒక మంచి ఎంపిక అని చెప్పాలి. ఆయనది చిన్న వయసే (51 ఏళ్లు). చురుకైనవాడు. బైడెన్ తో ఆయనకు ఉన్న సన్నిహిత సంబంధం వల్ల, అధ్యక్షుడితో నేరుగా సంప్రదించే స్థానంలో ఉన్నారు.

అధ్యక్షుడి చెవిలో నేరుగా ఊదగలిగే శక్తి ఉన్న అమెరికన్‌ రాయ బారిని కలిగి ఉండటం అనేది ఆతిథ్య దేశానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. న్యూఢిల్లీలోని అమెరికా రాయబారి నివాసాన్ని రూజ్‌వెల్ట్‌ హౌస్‌ అని పిలుస్తారు. చైనా, భారత యుద్ధ కాలం సహా తాను కోరుకున్నప్పుడల్లా అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ బ్యూరో క్రసీని దాటి తన సన్నిహిత మిత్రుడు, అధ్యక్షుడు అయిన జాన్‌ ఎఫ్‌. కెన్నెడీని నేరుగా కలవగలిగే స్థాయి ఉన్న జాన్‌ కెన్నెత్‌ గాల్‌బ్రెయిత్‌ వంటి ప్రముఖ ఆర్థికవేత్త ఈ రూజ్‌వెల్ట్‌ హౌస్‌లో నివసించారు. భవి ష్యత్తులో అమెరికా సెనేటర్‌ కానున్న డేనియల్‌ ప్యాట్రిక్‌ మొయినిహాన్‌ కూడా ఈ పదవిని అలంకరించారు.

భారత్‌లో శాశ్వత రాయబారి లేకపోవడానికి సెనేట్‌ నిర్ధారణ ప్రక్రియే కారణమంటూ శ్వేత సౌధ అధికారులు భుజాలు ఎగరేస్తూ ప్రైవేటుగా నిందిస్తుంటారు. కానీ అమెరికా బహిరంగంగా పేర్కొంటున్నట్లుగా భారత్‌ తనకు అంత విలువైన దేశమే అయినట్లయితే, తన నామినీని నిర్ధారింప జేసుకోవడంలో అధ్యక్ష పాలనా యంత్రాంగం మరింత శక్తిని ఎందుకు ప్రదర్శించడం లేదనే ప్రశ్న ఇప్పటికీ మిగిలే ఉంది. 2000 సంవత్సరంలో నాటి అమెరికా అధ్యక్షుడు  బిల్‌ క్లింటన్‌ చారిత్రాత్మక భారత్‌ సందర్శన నుంచి, రిపబ్లికన్, డెమోక్రాటిక్‌ పాలనా యంత్రాంగాలు అమెరికా భౌగోళిక వ్యూహంలో భారత్‌ను అత్యంత ప్రధాన భాగస్వామిగా ఎంచుతూ వచ్చాయి. 

డిసెంబర్‌ నెలలో జీ20 కూటమి అధ్యక్ష బాధ్యతను స్వీకరించిన భారత్‌ నిజంగానే అమెరికా గ్లోబల్‌ విజన్ లో గణనీయంగా ఇమిడి పోతుందనడంలో సందేహమే లేదు. పైగా, పర్యావరణ మార్పు, ఇస్లా మిక్‌ ఉగ్రవాదం వంటి ఉమ్మడి ఆంశాల్లో సహకారం వల్ల ఇరుదేశాలు ఎంతో ప్రయోజనం పొందగలవు.

ఆసియాలో అమెరికా అత్యంత కీలక భాగస్వామితో వ్యవహరించడానికి తగిన వ్యక్తిగత సంబంధాలను పెంచి పోషించగల రాయ బారిని నిర్ధారించే విషయంలో తన రాజకీయ మూలధనాన్ని వెచ్చించడం శ్వేతసౌధానికి తప్పనిసరి అవసరం. ఈ కోణంలో బైడెన్‌ యంత్రాంగం కలిసి పనిచేసి, ఏమాత్రం జాగు చేయకుండా గార్‌సెటీని న్యూఢిల్లీ విమానం ఎక్కించాలి.


శశి థరూర్‌ 
వ్యాసకర్త కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ
(‘ప్రాజెక్ట్‌ సిండికేట్‌’ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement