ఒకే పార్టీ, ఒకే నాయకుడి ద్వారా మాత్రమే ఉత్తమ పాలన అందుతుందనేది అపోహ. సంకీర్ణ ప్రభుత్వాలు ‘బలహీనమైనవి’ అనీ, అవి నిర్ణయాలు తీసుకోలేవనీ ఈ అపోహ జనాన్ని నమ్మేలా చేస్తుంది. కానీ చట్టాలను ఆమోదించడంలో ఏకీకృత లేదా సంకీర్ణ ప్రభుత్వాల మధ్య ఎటువంటి తేడా లేదని చరిత్ర చెబుతోంది.
అమెరికాలో మహా మాంద్యం తర్వాత, ‘న్యూ డీల్’(1933)లో భాగంగా సంక్షేమ విధానాలను అమలు చేశారు. సంపూర్ణ మెజారిటీ లేని ప్రభుత్వ హయాంలోనే ఇది జరిగింది. 1980ల చివరి నుండి భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు తప్పనిసరి అయిపోయాయి. ఈ కాలంలోనే భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించారు. నిర్ణయాత్మకమైన పేదరిక నిర్మూలన కార్యక్రమాలను అమలు చేశారు.
భారత్ వంటి విశాలమైన దేశానికి ఒకే పార్టీ, ఒకే నాయకుడి ద్వారా మాత్రమే ఉత్తమ పాలన అందుతుందనే అపోహ ఆధారంగా, ప్రస్తుత కేంద్రప్రభుత్వ పాలనను తిరిగి ఎన్నుకోవడం అనే ప్రబలమైన కథనం ఆధారపడి ఉంది. ‘బలమైన ప్రభుత్వం’ అనే ఈ అపోహ– బహుళ పార్టీ, సంకీర్ణ ఆధారిత ప్రభుత్వాలు ‘బలహీనమైనవి’ అనీ, అవి నిర్ణయాలు తీసుకోలేవనీ లేదా చట్టాలను ఆమోదించలేవనీ నమ్మేలా చేస్తుంది. అయితే, రాజనీతి శాస్త్ర రంగంలోని పరిశోధనలు మనకు భిన్నమైన చిత్రణను చూపుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రధానంగా మూడు రకాల ప్రజా స్వామ్య ప్రభుత్వాలు ఉనికిలో ఉన్నాయి. అవి: అధ్యక్ష తరహా, పార్ల మెంటరీ, సంఘటిత (కాన్‌సోషియేషనల్) ప్రభుత్వాలు. ఈ ప్రతి ప్రభుత్వ రూపంలోనూ, బహుళ పార్టీ ప్రభుత్వాలు లేదా సంకీర్ణ ప్రభు త్వాలు స్థిరంగా ఉండటమే కాకుండా పౌరుల సంక్షేమం విషయంలో కూడా మెరుగ్గా ఉన్నాయని సాక్ష్యాధారాలు చూపుతున్నాయి.
అమెరికా, అధ్యక్ష వ్యవస్థను అనుసరిస్తుంది. ఈ వ్యవస్థలో అధ్య క్షుడిని నేరుగా కార్యనిర్వాహక అధిపతిగా ఎన్నుకుంటారు. అయితే పన్నులు పెంచడం, డబ్బు ఖర్చు చేయగల సామర్థ్యం అనే ఖజానా అధికారాలను ప్రతినిధుల సభకు కట్టబెట్టారు.
డేవిడ్ మేహ్యూ రాసిన ‘డివైడెడ్ వియ్ గవర్న్: పార్టీ కంట్రోల్, లా మేకింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్స్, 1946–2002’ అనే పుస్తకంలో, ఒకే రాజకీయ పార్టీ అటు అధ్యక్ష పదవినీ, ఇటు కాంగ్రెస్‌నీ నియంత్రించినప్పుడు మాత్రమే అమెరికన్ జాతీయ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందనే సాధారణ అపోహను తొలగించారు.
చట్టాలను ఆమోదించడంలో ఏకీకృత పార్టీ లేదా వివిధ పార్టీల మధ్య ఎటువంటి తేడా లేదని ఈ పుస్తకం వెల్లడిస్తుంది. నిజానికి, మహా మాంద్యం (గ్రేట్ డిప్రెషన్) తర్వాత, అంటే 1933లో కొత్త ఒప్పందం (న్యూ డీల్)లో భాగంగా సంక్షేమ ఆధారిత విధానాలు అమలు చేశారు.
అలాగే, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కాలంలో ఇటీవలే తీసుకొచ్చిన ద్రవ్యోల్బణ తగ్గింపు చట్టం, 2022 వంటి సంక్షేమ ఆధారిత విధానాల్లో భాగంగానే ద్రవ్యోల్బణాన్ని తక్కువగా ఉంచడం, మందుల ధరలను తగ్గించడం, క్లీన్ ఎనర్జీకి మద్దతు ఇవ్వడం వంటివాటిని ఆమోదించారు. సంపూర్ణ మెజారిటీ లేని ప్రభుత్వాల హయాంలోనే ఇవి ఆమోదం పొందాయి.
దీనికి విరుద్ధంగా, అఫోర్డబుల్ కేర్ యాక్ట్ (ఏసీఏ) లేదా ఒబామా కేర్ చట్టంగా ప్రసిద్ధి చెందిన యాక్ట్‌ను, 2009లో డెమొక్రాటిక్ పార్టీ అటు అధ్యక్ష పదవినీ నిర్వహిస్తూ, ఇటు ప్రతినిధుల సభలోనూ, సెనేట్‌లోనూ మెజారిటీని కలిగి ఉన్నప్పుడు ఆమోదించారు.
అయినా ఈ చట్టాన్ని రిపబ్లికన్ పార్టీకి చెందిన కాంగ్రెస్ సభ్యులు, గవర్నర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. పైగా దానిని రద్దు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అటువంటి చట్టంలో భాగం కాలేనప్పుడు, తమ నియోజకవర్గాలకు ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు ఉంటాయని తెలిసినప్పటికీ, ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తాయని ఇది సూచిస్తోంది.
పశ్చిమ ఐరోపాలో జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం వంటి పార్ల మెంటరీ ప్రజాస్వామ్యాలను ఎక్కువగా వామపక్ష లేదా సంప్రదాయ వాద పార్టీల చుట్టూ కేంద్రీకృతమై ఉన్న సంకీర్ణ ప్రభుత్వాలు పాలిస్తుంటాయి.
1945 నుండి జర్మనీని రైట్ వింగ్ లేదా ఉదారవాద సంకీర్ణ ప్రభుత్వాలు పాలిస్తున్నాయి. ‘క్రిస్టియన్ డెమో క్రటిక్ యూనియన్ ఆఫ్ జర్మనీ’ మితవాద పక్షానికీ, ‘సోషల్ డెమో క్రటిక్ పార్టీ ఆఫ్ జర్మనీ’ మధ్యస్థ–వామపక్ష ప్రభుత్వానికీ ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
ఇక ‘సంఘటిత’ ప్రభుత్వాలను పార్లమెంటరీ విధానంలోని ఉప విభాగంగా చూడవచ్చు. ఇవి సంకీర్ణ ప్రభుత్వాలను మాత్రమే కలిగి ఉంటాయి. ఇటలీ, లెబనాన్, ఇథియోపియా వంటి దేశాలలో, వివిధ రకాలైన జాతి, మత, భాషా సమూహాలు సహజీవనం చేయవలసి వస్తోంది. సంఘటిత ప్రభుత్వాలు ఈ సమూహాలలోని అన్ని వర్గాల ఏకాభిప్రాయంతో ఏర్పడతాయి. వీటో అధికారాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ ఒక సమూహం ఏదైనా విషయంపై మరొకరిని అడ్డుకుంటే,రెండోది ప్రతిగా ఆ సమూహాన్ని నిరోధించే అవకాశం ఉంటుంది.
1980ల చివరి నుండి భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు తప్పనిసరి అయిపోయాయి. ఈ కాలంలోనే భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించారు. నిర్ణయాత్మకమైన పేదరిక నిర్మూలన కార్యక్రమాలను అమలు చేశారు. అలాగే దేశ అణ్వాయుధ ప్రయోగాల సామర్థ్యాన్ని కూడా ప్రదర్శించారు.
2004 నుండి 2014 వరకు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అనేక పౌరుల, హక్కుల ఆధారిత చట్టాలను రూపొందించింది. వీటిలో 2005లోని సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ), 2006లోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, అటవీ హక్కుల చట్టం, 2009లోని విద్యా హక్కు చట్టంతో పాటు, 2013లో తెచ్చిన ఆహార హక్కు చట్టం; భూ సేకరణ, పునరా వాసం, రీసెటిల్మెంట్ (ఎల్‌ఏఆర్‌ఆర్) చట్టం ఉన్నాయి.
అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను ఉద్దేశించి... బలహీ నమైన, కీలుబొమ్మ ప్రభుత్వం అనే అపోహను ప్రచారం చేయడంతో అది 2014లో బీజేపీ విజయానికి దారితీసింది. అయితే, 2014 నుండి ‘బలమైన నాయకత్వం’ మనకు ఏమి అందించిందో చూద్దాం. హక్కుల ఆధారిత చట్టాలు వేటినీ ఈ ప్రభుత్వం ఆమోదించలేదు.
పాలనా పారదర్శకత, జవాబుదారీతనానికి సంబంధించి ఏ ఆధారాలూ లేవు. బదులుగా మోదీ ప్రభుత్వం ప్రజలను జవాబుదారీగా ఉంచాలనుకుంది. పెద్దనోట్ల రద్దు ద్వారా మీ డబ్బును నాకు చూపించమంది; జీఎస్టీ ద్వారా మీ పన్నులు నాకు చెల్లించమంది. ఇంకా ఆర్టికల్ 370 రద్దు చేయడం, పౌరసత్వ సవరణ చట్టాన్ని తేవడం వంటివి జరిగాయి. నిరసనల తర్వాత మాత్రమే 2020లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రద్దయినాయి.
గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం లేదా స్వచ్ఛ భారత్ పథకం కింద మరుగుదొడ్లు నిర్మించడం వంటివి అమలులో ఉన్న సంక్షేమ విధానాలకు పొడిగింపు మాత్రమే. ఏ కొత్త ఆవిష్కరణా లేదా కొత్త దిశనూ ఈ ప్రభుత్వం చూపలేదు. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన సుమారు 50 కోట్ల బ్యాంకు ఖాతాలను తెరవడానికి ఆర్థిక సేవలను అందిస్తుంది. అయితే ఇందులో 4.12 కోట్ల మంది జూలై 2023 నాటికి జీరో బ్యాలెన్స్ కలిగి ఉన్నారు. కాగా, జనవరి 2018 నుండి 6 కోట్ల ఖాతాల్లో ఎటువంటి లావాదేవీలు జరగలేదు.
హక్కుల ఆధారిత చట్టాలు ఈ ప్రభుత్వ హయాంలో నిర్వీర్య మయ్యాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయించిన నిధులు తగ్గాయి. సమాచార హక్కు చట్టాన్ని బలహీనపరచడం ద్వారా ప్రభుత్వం తనను సూక్ష్మశోధనకు అతీతంగా ఉంచుకుంది. వివిధ పథకాలు లేదా ప్రభుత్వ వైఖరి సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి కాదు. ఒక రకమైన భూస్వామ్య పరాధీనతను సృష్టించడంలో భాగమే. అన్ని గ్యాస్ స్టేషన్‌లపై, మనందరి కోవిడ్ టీకా సర్టిఫికేట్‌లపై భూస్వామ్య ప్రభువైన ప్రధాని స్వయంగా కనిపిస్తుంటారు.
ఏకవ్యక్తి ప్రభుత్వం వర్సెస్ సంకీర్ణ ప్రభుత్వం గురించి చరిత్ర పొడవునా సమీక్షించినప్పుడు, బలమైన నాయకుల అహంకారం వారి ప్రజలకు ఎల్లప్పుడూ మంచిది కాదని మనకు అర్థమవుతుంది. ఇస్లా మిక్ చట్టంలో ఇజ్మా అనే భావన ఉంటుంది. అంటే ఏకాభిప్రాయం. అతి పెద్ద సమాజం తరపున నిర్ణయాలు తీసుకోవడానికి పండితుల సంఘం కలిసి వస్తుందనే అవగాహనపై ఇది ఆధారపడి ఉంటుంది.
ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ రూపంలో మనం ఒక సంభా వ్యతకు సాక్ష్యులుగా ఉన్నాం. భారత దేశంలోని భిన్న సమూహాల ప్రజానీకానికి ప్రాతినిధ్యం కల్పించడం కోసం అనేక పార్టీలు కలిసి వస్తున్నాయి. వాళ్లకు ఓటర్లు ఒక అవకాశం ఇస్తారని ఆశించవచ్చు.
డాక్టర్ రాజ్‌దీప్ పాకనాటి
వ్యాసకర్త ‘జిందాల్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్’ ప్రొఫెసర్, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ
Comments
Please login to add a commentAdd a comment