ప్రజాస్వామ్య స్ఫూర్తి కరవైన అమెరికా | Manoj Joshi Article On Joe Biden Government In Usa | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్య స్ఫూర్తి కరవైన అమెరికా

Published Thu, Dec 9 2021 12:40 AM | Last Updated on Thu, Dec 9 2021 12:41 AM

Manoj Joshi Article On Joe Biden Government In Usa - Sakshi

ప్రజాస్వామ్యం అంటే అర్థం... ఓటు వేసే హక్కు, ఎన్నికలు అని మాత్రమే కాదు. అది పౌరుల జీవన నాణ్యత, వారి వ్యక్తిగత హక్కులకు సంబంధించినది. 1960ల నుంచి అమెరికా ఎన్ని వైఫల్యాలు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యం, వ్యక్తి హక్కుల పట్ల విశ్వాసం ఉన్నవారికి తన రాజకీయ, పౌర సమాజ వ్యవస్థల ద్వారా నిజంగానే నాయకత్వం అందించింది. ప్రజాస్వామిక వ్యవస్థ ఎన్ని లోపాలున్నా సరే... మానవ పురోగతి వైపుగా ఉత్తమ పాలనా వ్యవస్థను అందిస్తుందనే విశ్వాసానికి అమెరికా ఛాంపియన్‌గా నిలిచింది. కానీ ఈరోజు, అమెరికా బయటి ప్రపంచానికి చేస్తున్న బోధ, స్వదేశంలో అవలంబిస్తున్న విధానాల మధ్య అంతరం పెరుగుతోంది. వ్యక్తిగత హక్కులను, పౌర సమాజాన్ని నిర్లక్ష్యం చేయడానికి ‘జాతి’ వంటి అమూర్త భావనలను ప్రయోగిస్తున్న భారత్‌ వంటి దేశాలలో దీని ప్రతిధ్వనులు స్పష్టమవుతున్నాయి.


ప్రభుత్వం, పౌర సమాజం, ప్రైవేట్‌ రంగం నేతలతో వర్చువల్‌ ’ప్రజాస్వామ్యాల సదస్సు’కు వచ్చేవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆతిథ్యం ఇవ్వనున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలకు ఎదురవుతున్న సవాళ్లు, అవకాశాలపై దృష్టి సారించి చర్చించడమే దీని లక్ష్యం. పర్యావరణ మార్పు లేక చైనా, రష్యా వంటి నిరంకుశ వ్యవస్థల అభివృద్ధి వంటి భవిష్యత్తు సవాళ్లను ప్రజాస్వామ్య వ్యవస్థలు మాత్రమే ఎదుర్కోగలవనే అమెరికా పాలనా ప్రాపంచిక దృక్పథాన్ని ఈ సదస్సు స్పష్టం చేయనుంది. ఈ సదస్సుకు ఆహ్వానించిన అతిథుల్లో యూరప్‌కి చెందిన బలమైన ఉదారవాద ప్రజాస్వామిక దేశాలు ఉన్నాయి. ఇక భారతదేశం, ఇజ్రాయెల్‌ వంటి బలహీన ప్రజాస్వామ్య దేశాలూ ఉన్నాయి. మరోవైపున పాకిస్తాన్, కాంగో ప్రజాతంత్ర రిపబ్లిక్‌ వంటి పచ్చి నిరంకుశ దేశాలూ ఈ జాబితాలో ఉన్నాయి. ఇకపోతే కెన్యా, సెర్బియా, ఇరాక్, జాంబియా, ఉక్రెయిన్, ఫిలిప్ఫైన్స్‌ వంటి దేశాలను కూడా ఈ సదస్సుకు ఆహ్వానించడం విశేషం.

నిజానికి ఈ సదస్సులో ఎదురవుతున్న అతిపెద్ద ప్రశ్న ఏదంటే... ఆతిథ్యమిస్తున్న అమెరికానే. గత సంవత్సరం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా తన ఎన్నికను కొల్లగొట్టారంటూ తప్పుడు ప్రకటనలు చేశారు. పైగా నాటి ఎన్నికల్లో విజేత జో బైడెన్‌ని అధికారం చేపట్టకుండా నిరోధించడానికి కుట్రకు కూడా ప్రయత్నించారు. ఎన్జీఓ ఫ్రీడమ్‌ హౌస్‌ సంస్థ వార్షిక అంచనా ప్రకారం, అమెరికా ప్రజాస్వామిక విధానాలు క్రమానుగతంగా క్షీణిస్తున్నాయని నమోదైంది. గత దశాబ్దంలో, 100 ప్రజాస్వామ్య దేశాల్లో అమెరికా స్థానం 94 నుంచి 83కి పడిపోయింది. ఇతర ఏ దేశం కూడా ఇంత వేగంగా కిందికి దిగజారిపోలేదు.

అమెరికన్‌ ప్రజాస్వామ్యాన్ని పట్టిపీడిస్తున్న అనేక రుగ్మతలు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి స్వేచ్ఛ కల్పించడం నుంచే తలెత్తుతున్నాయి. పాలక పార్టీ స్థితిని సురక్షితంగా ఉంచడానికి ఓటర్లను మినహాయిస్తూ నియోజకవర్గాలను కుదించే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అమెరికాలో కాలిఫోర్నియా, వాషింగ్టన్, అరిజోనా మినహా తక్కిన దేశమంతటా ఎన్నికలను తారుమారు చేయడం రాజకీయ పార్టీల చేతుల్లో ఉంటోంది. తమ సొంత పార్టీ ప్రయోజనంకోసం దేనికైనా సిద్ధపడటానికి ప్రయత్నిస్తున్నారు. దీంట్లో మరీ ప్రమాదకరమైన విషయం ఏమిటంటే ఆఫ్రికన్‌ అమెరికన్‌ మైనారిటీల జన సంఖ్యను ఓటింగ్‌ నుంచి మినహాయించడం లేదా వేరు చేయడం దిశగా నియోజకవర్గాలను మార్చేయడం.

దీని ఫలితంగా, ఎన్నికల్లో పోటీ చేయాలంటే భారీ స్థాయిలో డబ్బు వెచ్చించాల్సి వస్తోంది. అమెరికా చట్టసభల సభ్యులు వాస్తవంగానే ఓటమి ఎరుగనివారిగా మారుతున్నారు. ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడంతోపాటు, అప్పటికే చట్టసభల్లో ప్రతినిధులుగా ఉన్నవారికి భారీ స్థాయిలో డబ్బు వెచ్చించడం సులభమైపోతోంది. దీంతో అమెరికాలో 90 నుంచి 95 శాతం శాసనసభ్యులు పదే పదే తిరిగి ఎన్నికవుతున్నారు. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌లో తాజా వ్యాసం ప్రకారం, ‘ఎన్నికల్లో ఓటర్లు తమ ప్రతినిధులను ఎన్నుకోవడం అనేది అడ్డం తిరిగి రాజకీయ నాయకులే తమ ఓటర్లను ఎంచుకుంటున్న ప్రక్రియ’ అమెరికాలో అలవాటుగా మారిపోయింది.

ఎన్నికల్లో హోరాహోరీగా తలపడిన తర్వాత గెలుపొందిన ఇరుపార్టీల ప్రతినిధులు కలిసికట్టుగా దేశానికి ప్రయోజనం కలిగించే చట్టాలను రూపొందించే కాలం అమెరికాలో ఒకప్పుడు అమల్లో ఉండేది. ఈరోజు చట్టసభల్లో ఒక శాసనం ఆమోదం పొందడం చాలా కష్టమవుతున్న చందంగా సభలో ప్రతినిధులు పూర్తిగా వేరుపడిపోయారు. ప్రభుత్వం కుప్పకూలిపోకుండా రుణాలపై సీలింగ్‌ని పెంచడం, అమెరికాలో అత్యవసరంగా మారిన మౌలికవసతుల వ్యవస్థ మరమ్మతులను చేపట్టడం వంటివి చట్టరూపంలో ఆమోదం పొందడం ఇప్పుడు అసాధ్యమైపోతోంది. అమెరికా సెనేట్‌లో ప్రస్తుతం ఏదైనా శాసనం తీసుకురావాలంటే నూటికి 60 మంది సభ్యుల మెజారిటీ తప్పనిసరి. 

ఇటీవలే మౌలిక వసతుల అభివృద్ధి చట్టం, అమెరికా ప్రతినిధుల సభలో పూర్తిగా డెమాక్రటిక్‌ పార్టీ ప్రతినిధుల ఓట్ల ద్వారానే ఆమోదం పొందింది. ఇలాంటి కీలక శాసనానికి అనుకూలంగా ఓటు వేసినందుకు 13 మంది రిపబ్లికన్‌ పార్టీ ప్రతినిధులపై కఠిన చర్య తీసుకోవాలని పిలుపునిచ్చారు. అమెరికాలోని చాలా నియోజకవర్గాల్లో ఇప్పుడు  సురక్షితమైన తాగునీరు సమస్యగా ఉంటోంది. బ్రిడ్జిలు, గ్రిడ్‌లు కుప్పగూలుతున్నాయి, జాతీయ రహదారుల నాణ్యత దెబ్బతింటోంది. కానీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడాన్ని రిపబ్లికన్లను ఎవరూ అడ్డుకోలేకపోయారు. చివరకు అమెరికాలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలా వద్దా అనే అంశం కూడా రాజకీయ విభజనకు దారితీసేదిగా మారిపోయింది. వీటికి తోడుగా ఓటర్లను అణిచిపెట్టే ప్రయత్నాలు మరింత హానికరంగా మారాయి. అమెరికా సుప్రీంకోర్టులో సంప్రదాయవాదుల మెజారిటీ దన్నుతో, ఓటింగ్‌ హక్కుల చట్టం–1965 వంటి కీలక చట్టాన్ని కూడా బలహీనపరుస్తున్నారు. ఈ చట్టం అమెరికా చరిత్రలో తొలిసారిగా ఆఫ్రికన్‌ అమెరికన్లకు ఓటుహక్కు కల్పించిన విషయం తెలిసిందే. ఆఫ్రికన్‌ అమెరికన్లు ఓటు వేయడాన్ని కష్టతరం చేస్తూ కొన్ని రాష్ట్రాలూ, స్థానిక ప్రభుత్వాలూ ఇప్పటికే చర్యలు తీసుకున్నాయి. 2020లో డొనాల్డ్‌ ట్రంప్‌ ఓటమి వీరి ప్రయత్నాలను రెట్టింపు చేసిందని చెప్పక తప్పదు.

ప్రజాస్వామ్యం అంటే అర్థం... ఓటు వేసే హక్కు, ఎన్నికలు అని మాత్రమే కాదు. అది పౌరుల జీవన నాణ్యత, వారి వ్యక్తిగత హక్కులకు సంబంధించినది. ఈ కొలమానంతో చూస్తే కూడా ఆఫ్రికన్‌ అమెరికన్లకు వ్యతికేరంగా ఇప్పటికీ కొనసాగుతున్న జాతి వివక్ష విషయంలో అమెరికా వైఫల్యం చెందుతున్నట్లే చెప్పాలి. ఇది అమెరికా జీవన విధానానికి మచ్చగా మారింది. తర్వాత అమెరికాలో నిర్లక్ష్యానికి గురవుతున్న మరొక సామాజిక బృందం ఏదంటే మహిళలు. ఇటీవలే మహిళల గర్భస్రావ హక్కులను నిరాకరించడానికి జరిగిన ప్రయత్నాలు దీనికి అసలైన ఉదాహరణ. మహిళలకు ప్రసూతి సెలవులకు వేతనం చెల్లించడాన్ని తిరస్కరించడం అమెరికాలో అలవాటుగా మారిపోయింది. ఇలాంటి సౌకర్యాన్ని మహిళలకు అందించని ఏకైక పారిశ్రామిక సంపన్న దేశం అమెరికానే అంటే ఆశ్చర్యం కలిగించదు.

అనేకరకాలుగా, అమెరికా ప్రజాస్వామ్యం దురవస్థ బహుశా డొనాల్డ్‌ ట్రంప్‌ నీడలోంచే పుట్టుకొచ్చిందని చెప్పవచ్చు. అబ్రహాం లింకన్‌ వంటి మహానేతకి చెందిన రిపబ్లికన్‌ పార్టీ చివరకు ట్రంప్‌ వంటి విభజన రాజకీయాల కింగ్‌ పాలబడింది. పైగా మహిళలను వేధించడంలో, ప్రమాదకరమైన వ్యాపార విధానాలను అవలంబించడంలో పేరుమోసినవాడు ట్రంప్‌. ఎన్నికల విజయానికి అవసరమైన ఒప్పందాల విషయంలో రిపబ్లికన్లకు అదిగురువు ట్రంప్‌ అనే చెప్పాలి.

అమెరికాలో ప్రజాస్వామ్యానికి పడుతున్న దురవస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రభావం కలిగిస్తోంది. 1960ల నుంచి అమెరికా ఎన్ని వైఫల్యాలు చవిచూసినప్పటికీ ప్రజాస్వామ్యం, వ్యక్తి హక్కుల పట్ల విశ్వాసం ఉన్నవారికి తన రాజకీయ, పౌర సమాజ వ్యవస్థల ద్వారా నిజంగానే నాయకత్వం అందించింది. ప్రజాస్వామిక వ్యవస్థ ఎన్ని లోపాలున్నా సరే... మానవ పురోగతిని ప్రోత్సహించడానికి ఉత్తమ పాలనా వ్యవస్థను అందిస్తుందనే విశ్వాసానికి అమెరికా చాంపియ న్‌గా నిలిచింది. కానీ ఈరోజు, అమెరికా బయటి ప్రపంచానికి చేస్తున్న బోధ, స్వదేశంలో తాను అవలంబిస్తున్న విధానాల మధ్య అంతరం  పెరుగుతోంది. ఈ సమాచార యుగంలో ఇది చక్కగా స్పష్టమవుతోంది. ఆశ్చర్య పడాల్సింది లేదు, వ్యక్తిగత హక్కులను, పౌర సమాజాన్ని నిర్లక్ష్యం చేయడానికి గానూ ‘జాతి’ వంటి అమూర్త భావనలను ప్రయోగిస్తున్న భారత్‌ వంటి దేశాలలో దీని ప్రతిధ్వనులు స్పష్టమవుతున్నాయి. ఇది మొత్తం వ్యవస్థకే ప్రమాదకరం అని గ్రహించాలి.

– మనోజ్‌ జోషీ,
విశిష్ట పరిశోధకులు, అబ్జర్వర్‌ రీసెర్జ్‌ ఫౌండేషన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement