అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జో బైడెన్ వ్యక్తిగత జీవితమంతా విషాదాల మయమే. ఈ విషాదాల మధ్యే గడిపిన బైడెన్ ఆ అభద్రతా ఛాయల మధ్యే 40 ఏళ్లుగా అపార రాజకీయ అనుభవాన్ని గడిస్తూ వచ్చారు. ఏరోజుకైనా అధ్యక్ష పదవి చేపట్టాలన్నది ఆయన కల. ఆ కల సాకారంలో ఎన్నో సార్లు విఫలమైనా చివరికి తన లక్ష్యాన్ని సాధించారు. పట్టువిడుపులు ప్రదర్శించడం, చేసిన తప్పులు ఒప్పుకోవడం, తన పరిమితులను గుర్తించడం, ప్రజాజీవితంలో అనేకమందితో కనెక్ట్ కావడం.. ఈ లక్షణాలతోనే ఇప్పుడు శ్వేతసౌధంలోకి అడుగుపెడుతున్న బైడెన్ ప్రపంచ వ్యాప్తంగా ఉదారవాద ప్రజాస్వామ్యం భవిష్యత్తును నిర్దేశించడానికి సమాయత్తమవుతున్నారు.
తనకు ముందు పనిచేసిన అధ్యక్షులతో పోలిస్తే జో బైడెన్ అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్ష పదవి చేపట్టడానికి చేసిన ప్రయాణం పూర్తిగా భిన్నమైనది, విలక్షణమైనది అనే చెప్పాలి. బిల్ క్లింటన్ తన ప్రత్యర్థి అయిన సీని యర్ జార్జి బుష్‌తో పోలిస్తే అత్యంత పిన్నవయస్కుడిగా చెప్పుకోవడమే కాకుండా తన రుణవిధానంపై చర్చ ద్వారా అధ్యక్షుడు కాగలి గారు. సీనియర్ బుష్ తనయుడు జార్జి డబ్ల్యూ బుష్ వివాదాస్పద కోర్టు తీర్పు ద్వారా అధ్యక్షుడు కాగలిగారు. ఇక ఒబామా విషయానికి వస్తే ఆకర్షణీయమైన ప్రసంగాలు, తన గొప్పదైన వ్యక్తిగత గాథ ద్వారా అమెరికన్లను మంత్రముగ్ధులను చేసి అధికారంలోకి వచ్చారు.
ఇక బైడెన్ విషయానికి వస్తే అనేక అంశాలలో తేలిపోయారు, గత సంవత్సరం జరిగిన డెమోక్రాటిక్ పార్టీ చర్చల్లో కూడా బైడెన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. తన పార్టీలోని ప్రత్యర్థులు ఎలిజబెత్ వారెన్, బెర్నీ శాండర్స్‌లతో పోలిస్తే బైడెన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. లైవ్ ప్రసంగాల్లో కూడా తాను సమాధానాలు ఇవ్వలేకపోయారు. పైగా తన టెలిప్రింటర్ చూపుతున్న దాన్ని కూడా తప్పుగా చదివేశారు. పైగా గతంలో జాతుల మధ్య విభజనను ప్రోత్సహించే సెనేటర్లకు తాను ప్రాతినిధ్యం వహించడంపై పార్టీలో ప్రత్యర్థిగా నిలిచిన కమలా హ్యారిస్ తనపైనే దాడి చేయడంతో బైడెన్ బిత్తరపోయాడు. తర్వాత డొనాల్డ్ ట్రంప్ విసుగెత్తించిన పాలన, డెమోక్రాటిక్ ప్రతినిధి జిమ్ క్లైబర్న్ కీలక సమయంలో ఇచ్చిన మద్దతు కారణంగా సౌత్ కరోలినా నుంచి బైడెన్ గెలుపొందారు. ఆ తర్వాతే సూపర్ ట్యూస్‌డే సందర్భంగా డెమోక్రాటిక్ పార్టీ తరపున అధ్యక్షపదవికి అభ్యర్థిగా గెలుపొందడం, అనంతరం దేశాధ్యక్ష పదవిని గెల్చుకోవడం వరుసగా జరిగిపోయాయి.
అయితే బైడెన్ గురించి ఇప్పటికీ అనుమానాలు ఉంటూనే వస్తున్నాయి. చాలామంది బైడెన్ మంచి కాలం ఎప్పుడో ముగిసిపోయిం దని, ఒక దఫా అధ్యక్షుడిగా మాత్రమే ఉండగలరని, కమలా హ్యారిస్ కోసం తన స్థానాన్ని త్యాగం చేస్తారని, వివిధ వర్గాలుగా చీలిపోయిన అమెరికాలో టెక్నోక్రాటిక్, రాజకీయ సవాళ్లతో వ్యవహరించగలిగిన శక్తి కానీ సైద్ధాంతిక జ్ఞానం కానీ, తనకు లేదని ప్రజల్లో రకరకాల అభిప్రాయాలు చలామణిలో ఉంటూ వస్తున్నాయి. చివరకు ‘జోబైడెన్ అమెరికన్ డ్రీమర్’ పేరిట ఇవాన్ ఒసోన్స్ రాసిన లఘు జీవిత చరిత్ర కూడా బైడెన్ సంభాషణలు, ఆయన సహచరులు, వ్యతిరేకుల సంభాషణలను పొందుపరుస్తూ, ప్రపంచం విస్మరించిన లేక తక్కువ చేసి చూపిన జోబైడెన్ గురించి కాస్త మెరుగైన ధోరణిలో బైడెన్‌ని మలచడం విశేషం. బైడెన్ భావోద్వేగంతో కూడిన సంక్లిష్టతను, ప్రగాఢమైన, వృత్తిపరమైన అనుభవాన్ని తనతోపాటు వైట్‌హౌస్‌కి తీసుకెళుతున్నారని, ఇది గడచిన దశాబ్దాల్లో పనిచేసిన అధ్యక్షులతో పోలిస్తే అరుదైన విషయమని ఒస్నోస్ రాసిన పుస్తకం చెబుతోంది. బైడెన్ బాల్యంలో నత్తితో ఇబ్బందిపడ్డాడు కానీ చిన్న వయసులోనే అధ్యక్షుడు కావాలన్న ఆకాంక్షను మాత్రం వ్యక్తం చేశారట.
ఆ ప్రకారంగానే 29 ఏళ్ల వయసులోనే బైడెన్ సెనేటర్ అయ్యారు. కానీ క్రిస్మస్ ట్రీని కొనుగోలు చేయడానికి బయటకు వచ్చిన ఆయన భార్య, కుమార్తె కారు ప్రమాదంలో మరణించారు. అది తనను తీవ్ర విచారంలో ముంచెత్తింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన జిల్ జాకబ్స్‌ని పెళ్లాడారు. జిల్ మా జీవితాలను కాపాడింది. ఏ మనిíషీ ఒక గొప్ప ప్రేమకు మించి అర్హుడు కాదు. ఇక రెండు గొప్ప ప్రేమల గురించి చెప్పేదేముంది అని జోబైడెన్ తర్వాత చెప్పారు. కానీ విషాదం తన జీవితాన్ని వెంటాడుతూనే ఉంది. 2015లో తానెంతగానో ప్రేమించిన కుమారుడు బ్యూని కేన్సర్ కబళించింది. ఇక రెండో కుమారుడు హంటర్ మాదకద్రవ్యాల సేవనం నుంచి బయటపడే విషయంలో పోరాడుతున్నారు.
బైడెన్ తనజీవితం పొడవునా అభద్రతతో జీవిస్తూనే 1987లో అధ్యక్షపదవికి పోటీ చేసి ఘోరంగా విఫలుడయ్యారు. ఈ పరాజయాల నడుమ కూడా ప్రజలతో సంభాషించగల రాజకీయవేత్తగా కొనసాగడాన్ని నిలిపివేయలేదు. వ్యక్తులను పలకరించడంలో, వారితో సంబంధాలు నెరపడంలో బైడెన్ వెనుకబడలేదు. తన జీవితంలో ఎదురైన అభద్రతా అనుభూతులు దాపరికంలేని తత్వాన్ని, సులభంగా ప్రమాదాల్లో చిక్కుకుపోవడానికి అవకాశం ఇచ్చాయని బైడెన్ స్వీయజీవిత రచయిత ఓస్నోస్ రాశారు. ఆ క్రమంలోనే వాషింగ్టన్‌లో సెనేటర్‌గా విస్తృతమైన అనుభవం గడించారు. ఒప్పందాలను సమర్థంగా కుదర్చడం, శాసనాల రూపకల్పనలో ప్రావీణ్యత సాధించడం, సెనేట్ విదేశీ సంబంధాల కమిటీ చైర్మన్‌గా ప్రపంచ నేతలతో సంబంధాలు నెలకొల్పుకోవడంలో రాటుదేలిపోయారు.
తన సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో బైడెన్ అనేక తప్పిదాలు చేశారు. డెమోక్రాటిక్ పార్టీలోనే ఛాందసవాదిగా ఉంటున్నందుకు సంతోషించేవారు. సుప్రీకోర్టులో క్లేరిన్స్ థామస్ నామినేషన్ విషయంలో అనితా హిల్ చేసిన ఆరోపణలను సమర్థించడమే కాకుండా ఇతర మహిళలు సాక్ష్యం చెప్పడానికి బైడెన్ అనుమతించలేదు. ఇక పౌర హక్కుల విషయంలోనూ బైడెన్‌కి ఏమంత ఘనమైన రికార్డు లేదు. నల్లజాతి ప్రజలను దెబ్బతీసిన 1994 క్రైమ్ బిల్లు ముసాయిదాను బైడెన్ రూపొందించారు.
భావజాలపరంగా మార్పు చెందుతూ కూడా బైడెన్ మనగలగడానికి కారణం.. తన తప్పిదాలను అంగీకరిస్తూనే నిత్యం తన్ను తాను మార్చుకోవడానికి ప్రయత్నించడంలో విజయం పొందడమే. కొన్ని సందర్భాల్లో బైడెన్ తప్పిదం లేదని తర్వాత బయటపడేదనుకోండి. ఒస్నోస్ తన పుస్తకంలో కొన్ని మరచిపోలేని విషయాలు పొందుపర్చారు. వాటిలో ఒకటి ఏమిటంటే, ఒకానొక కాన్ఫరెన్సులో హన్నా అరెంట్ చదివిన పత్రం గురించి బైడెన్ ఒక పత్రికలో చదివి ఆ కాపీని తనకు పంపాలని బైడెన్ ఆమెను అభ్యర్థించారట. ఇటీవలే ‘హౌ డెమోక్రసీస్ డై’ అనే వ్యాసం చదివి ట్రంప్, ఇతర నిరంకుశ నేతలు ప్రపంచానికి తీసుకొస్తున్న ప్రమాదాలను గురించి హెచ్చరించారట.
నల్లజాతి పురుషులను ‘బాయ్స్’ అని ప్రస్తావించినందుకు బైడెన్ తర్వాత ఒక టీవీ చర్చలో సెనేటర్ కోరీ బుకర్‌కి క్షమాపణ చెప్పిన వైనాన్ని బైడెన్ స్వీయరచనా కర్త ఓస్నోస్‌కి బుకర్ తెలిపారు. ‘బైడెన్ తన దుర్భలత్వాన్ని నాముందు గొప్పగా అంగీకరించారు. తనలోని అసంపూర్ణత్వాన్ని దాచుకోకుండా బయటికి చెప్పుకున్నారు. చాలాకాలంగా నేను రాజకీయాల్లో ఉంటున్నాను. బైడెన్ మారడాన్ని నేను దగ్గరగా చూస్తూ వచ్చాను’ అన్నారామె. ఇక సెనేట్‌లో తొలి సంవత్సరం ఆందోళనతో గడుపుతున్న సందర్భాల్లో తాను చేసిన ఒక ప్రసంగానికి గాను బైడెన్ తనను అభినందించారని సెనేటర్ అమీ క్లోబుచర్ పేర్కొన్నారు. కుటుంబంలో ఒకరిని కోల్పోయినప్పుడు నా స్నేహితులలో ఒకరికి కాల్ చేసి ఓదార్చడాన్ని కూడా అమీ గుర్తు చేశారు. చాలా మంది ప్రజలు బైడెన్ పట్ల ప్రేమ చూపుతారు. పైగా ఆయన గురించి వారికి సన్నిహితంగా తెలుసు అని అమీ అన్నారు.
ఒబామా అంటే బైడెన్‌కి వీరారాధన. రాజకీయనేతగా తన పరిణామంపై ఒబామా పాత్ర చాలా ఎక్కువ అని బైడెన్ చెప్పారు. బైడెన్‌ని తన వైస్ ప్రెసిడెంట్‌గా ఒబామా ఎంచుకున్నారు. అందుకు బైడెన్‌కు విదేశీ వ్యవహారాలపై ఉన్న విస్తృతమైన అనుభవమే కారణం. అధ్యక్షుడిగా పాలించడంలో తనకు సహాయం చేయాలని ఒబామా కోరినట్లు బైడెన్ చెప్పారు. సమగ్రతా వైఖరి, మృదుస్వభావం, ఇతరుల అవసరాలను పట్టించుకునే తత్వం వంటి లక్షణాలు కలిగిన అధ్యక్షుడిని తానెన్నడూ చూడలేదని, ఒబామా ఈ అన్ని విషయాల్లోనూ తనకు స్ఫూర్తి అని బైడెన్ కృతజ్ఞతలు తెలిపారు. సలహాదారులు ఎన్ని చెప్పినా తనదైన నిర్ణయాన్ని తీసుకోవడంలో ఒబామా సాహసోపేతంగా ఉండేవారని బైడెన్ పేర్కొన్నారు. అదేసమయంలో రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు ఒబామాపై చేసే దాడులన్నింటికీ వ్యతిరేకంగా బైడెన్ నిలబడి ఒబామాకు రక్షణగోడలా నిలబడేవారు.
అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జో బైడెన్ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. ప్రజా జీవితంలో సభ్యతను పునరుద్ధరించడం, కాస్త నాగరికంగా వ్యవహరించడం, ప్రభుత్వ పని తీరును మెరుగుపర్చడం, అమెరికాను మార్చే ప్రయత్నంలో వాషింగ్టన్‌లో సహకార భావనతో పనిచేయడం.. ఇవన్నీ కొత్త అధ్యక్షుడి ముందు సవాళ్లే. ఒబామా అధ్యక్ష పదవి గురించి గతంలో మాట్లాడేటప్పుడు తన దేశానికి గుర్తించదగిన పనులు చేయగలిగిన అద్భుతమైన మని షితో నేను భాగమవుతున్నానని బైడెన్ పేర్కొన్నారు. ఇప్పుడు తన చరిత్రను తానే రాసుకుంటున్న బైడెన్ ఉదారవాద ప్రజాస్వామ్యం భవిష్యత్తును నిర్దేశించడానికి సమాయత్తమవుతున్నారు.
సుశీల్ అరోన్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు
(ది వైర్ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment