నెమ్మదిగా దారిలోకి.. ద్రవ్యోల్బణం | Sakshi
Sakshi News home page

నెమ్మదిగా దారిలోకి.. ద్రవ్యోల్బణం

Published Wed, Jun 14 2023 3:55 AM

Inflation in India is slowly coming under control - Sakshi

ముంబై: భారత్‌లో ద్రవ్యోల్బణ నెమ్మదిగా అదుపులోనికి వస్తుందని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మంగళవారం అన్నారు. సమీప మధ్యకాలిక సమయంలో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని లక్ష్యం మేరకు 4 శాతానికి తగ్గించడం జరుగుతుందని కూడా భరోసా ఇచ్చారు. లండన్‌లో సెంట్రల్‌ బ్యాంకింగ్‌ నిర్వహించిన ఒక సెమినార్‌లో ఆయన ప్రసంగించారు. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం మేలో రెండేళ్ల కనిష్టస్థాయి 4.25 శాతానికి తగ్గిన నేపథ్యంలో శక్తికాంత్‌దాస్‌ తాజా ప్రసంగం చేశారు.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాతం) నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ప్రకారం 2 ప్లస్‌ లేదా 2 మైనస్‌తో 4 శాతం వద్ద ఉండాలి. అంటే 6 శాతం పైబడకూడదు. అయితే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, చమురు ధరల తీవ్రత, వడ్డీరేట్ల పెరుగుదల వంటి అంశాల నేపథ్యంలో 2022 నవంబర్, డిసెంబర్, 2023 మార్చి, ఏప్రిల్, మే మినహా మిగిలిన అన్ని నెలలూ 6 శాతం ఎగువనే రిటైల్‌ ద్రవ్యోల్బణం కొనసాగింది.

తాజా సమీక్షా నెల మే నెల్లో  2021 ఏప్రిల్‌ కనిష్టాన్ని (4.23 శాతం) చూసింది. గడచిన నాలుగు నెలల నుంచీ రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తుండగా, వరుసగా మూడవనెల నిర్దేశిత 6 శాతం దిగువన నమోదయ్యింది. ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో గత మేలో 4 శాతంగా ఉన్న రెపో రేటును ఆర్‌బీఐ 6.5 శాతానికి పెంచింది. ద్రవ్యోల్బణం అదుపు నేపథ్యంలో గడచిన రెండు త్రైమాసికాల్లో యథాతథంగా కొనసాగించింది. తాజా గణాంకాల ధోరణి కొనసాగితే, ఆర్‌బీఐ 2023లో రెపో రేటును పెంచే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు.

జూన్‌ పాలసీ సమీక్ష సందర్భంగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం అంచనాలను మొదటి ద్వైమాసిక సమీక్షతో పోల్చితే ఇటీవలి రెండవ ద్వైమాసిక సమావేశాల్లో ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ  తగ్గించింది. కిత్రం 5.2 శాతం అంచనాలను స్వల్పంగా 5.1 శాతానికి కుదించింది. జూన్, సెప్టెంబర్, డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని వరుసగా 4.6 శాతం, 5.2 శాతం, 5.4 శాతం, 5.2 శాతాలుగా ఆర్‌బీఐ పాలసీ సమీక్ష అంచనా వేసింది.  ఎల్‌నినో, రుతుపవనాలపై అంచనాల్లో ఇంకా స్పష్టత లేదని కూడా ఈ సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్‌ పేర్కొన్నారు. తాజాగా శక్తికాంత్‌ దాస్‌ చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. 

దేశంలో ద్రవ్యోల్బణం లక్ష్యం మేరకు 4 శాతానికి క్రమంగా దిగివస్తుంది. 
♦ ఇటీవలి నెలల్లో ద్రవ్యోల్బణం కొంత తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి.  
♦ రేటు నిర్ణయం అంశాలపై ఏమీ చెప్పలేని అనిశ్చితి పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతోంది.  
వృద్ధి లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ధరల స్థిరత్వాన్ని కొనసాగించాలని ఆర్‌బీఐ భావిస్తోంది. అధిక జనాభా, వారి పురోగతిని అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని సెంట్రల్‌ బ్యాంక్‌ వృద్ధిపై కూడా ఆర్‌బీఐ దృష్టిపెడుతుంది. 
♦ ధరల స్థిరత్వం లేకుంటే ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని మేము గుర్తించాము.  ద్రవ్య విధానం– దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వంపై పూర్తి దృష్టి కేటాయింపు ఉంటుంది.  
♦ ద్రవ్యోల్బణం లక్ష్యానికి మించి (4 శాతం ఎగువన) ఉన్నప్పటికీ మహమ్మారి సంవత్సరాలలో ఆర్‌బీఐ తన పాలసీ విధానంలో వృద్ధికి ప్రాధాన్యతనిచ్చిం ది. 
♦ ఆర్థిక, ద్రవ్య విధానాల చురుకైన సమన్వయం, ప్రతిస్పందన వల్ల ఎకానమీ రికవరీ త్వరిత పునరుద్ధరణకు దోహదపడింది.  
♦  బ్యాంకింగ్, డిజిటలైజేషన్, టాక్సేషన్, తయారీ అలాగే కార్మికులకు సంబంధించిన వివిధ నిర్మాణాత్మక సంస్కరణలు గత కొన్ని సంవత్సరాలుగా అమలయ్యాయి. తద్వారా మధ్యస్థ, దీర్ఘకాలంలో బలమైన– స్థిరమైన వృద్ధికి పునాదులు పడ్డాయి. 2020–21 ఆర్థిక సంవత్సరంలో క్షీణత తర్వాత స్థూల దేశీయోత్పత్తి త్వరితగతిన మెరుగుపడ్డానికి ఆయా అంశాలు కారణం.  
♦ 2023–24లో భారత్‌ 6.5 శాతం వృద్ధిని నమోదు చేసుకుంటుందని భావిస్తున్నాం. ఇది 2023లో ప్రపంచ దేశాలకన్నా వేగవంతమైన వృద్ధి రేటు.  
♦ మూలధన వ్యయాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత హర్షణీయం. ఇది ఎకానమీలో అదనపు సామర్థ్యాన్ని సృష్టిస్తోంది. అలాగే  కార్పొరేట్‌ పెట్టుబడి చట్రంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న పునరుజ్జీవనాన్ని ప్రోత్సహిస్తుంది.   
♦ నియంత్రణ, పర్యవేక్షణ విభాగాలపై కూడా ఆర్‌బీఐ పలు చర్యలు తీసుకుంది. బ్యాంకుల వ్యాపార నిర్ణయాల విషయంలో నిరంతరం  జోక్యం చేసుకోకుండా, బ్యాంకులు– ఇతర రుణ సంస్థల వ్యాపార నమూనాలను తరచూ లోతుగా పరిశీలిస్తూ, వాటి రుణాలు–డిపాజిట్ల అసమతుల్యతలు, నిధుల స్థిరత్వం  నిశితంగా ఆర్‌బీఐ పరిశీలిస్తుంది.  
♦ ఏదైనా అనిశ్చితి, సంక్షోభం తలెత్తే పరిస్థితి ఉంటే, ముందస్తు హెచ్చరిక సంకేతాల వ్యవస్థను మా బ్యాంకింగ్‌ కలిగి ఉంది. ఇవి ప్రమాదాన్ని పెంచడానికి దారితీసే సూచనలను, వాటిని కట్టడి చేసే చర్యలును సూచిస్తాయి. సవాళ్లను గుర్తించడానికి  బ్యాంకింగ్‌ వెలుపలి ఆడిటర్‌ల సహాయసహకారాలనూ తీసుకుంటుంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement