ఆర్థికవృద్ధిని కొనసాగిస్తూనే ప్రభుత్వం మూలధన వ్యయంపై దృష్టి పెడుతుండడంతో ఈ ఏడాది వృద్ధి నమోదవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక నివేదికలో తెలిపింది. 2024-25 ఏడాదిలో సీపీఐ ద్రవ్యోల్బణం సగటున 4.5%గా ఉంటుందని అంచనా వేసింది. 2023-24లో నమోదైన 5.4% ద్రవ్యోల్బణం కంటే ఇది తక్కువ.
ఇన్‌ఫ్లేషన్ తగ్గుముఖం పట్టడంతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వస్తువినిమయం ఊపందుకుంటుందని పేర్కొంది. ఈఏడాదిలో వృద్ధిని ప్రేరేపించేందుకు మూలధన వ్యయంలో సగానికిపైగా ఫైనాన్సింగ్ రంగంలో రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. గతేడాదిలో మూలధనవ్యయం రూ.9.5 ట్రిలియన్లుగా ఉందని, ఈ ఆర్థిక సంవత్సరంలో దీన్ని రూ.11.11 ట్రిలియన్లకు పెంచాలనే లక్ష్యాన్ని కేంద్రం నిర్ణయించినట్లు చెప్పింది.
ఈ ఏడాది దేశ జీడీపీ 7% వరకు పెరుగుతుందని అంచనా వేసింది. కార్పొరేట్ కంపెనీల బ్యాలెన్స్ షీట్లు పెరగడం, వస్తువినిమయం పెరుగుతుండడం, రెండంకెల క్రెడిట్ వృద్ధి వంటి అంశాలు ఆర్థిక ప్రగతికి సానుకూలంగా ఉన్నాయని చెప్పింది. కానీ కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భవిష్యత్తులో ప్రతికూల వాతావరణాన్ని ఏర్పరిచే ప్రమాదముందని అనుమానం వ్యక్తం చేసింది. దానివల్ల వస్తుసరఫరాలో మార్పులుంటాయని చెప్పింది. ప్రధాన పంటల ఉత్పత్తిలో తగ్గుదల వల్ల ద్రవ్యోల్బణం ప్రభావితం చెందవచ్చని భావిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment