అవును... అభివృద్ధికి అడ్డా ఆంధ్రప్రదేశ్‌ | Andhra Pradesh Top in Gross State Domestic Product: VVR Krishnam Raju Views | Sakshi
Sakshi News home page

అవును... అభివృద్ధికి అడ్డా ఆంధ్రప్రదేశ్‌

Published Tue, Nov 22 2022 2:00 PM | Last Updated on Tue, Nov 22 2022 2:00 PM

Andhra Pradesh Top in Gross State Domestic Product: VVR Krishnam Raju Views - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అధోగతిపాలైందని, అన్ని రంగాల్లో వెనుకబడి పోయిందని ప్రతి పక్ష నాయకులు, కొందరు కుహనా మేధావులు ఆరోపిస్తున్నారు. అయితే రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా వృద్ధి చెందుతోందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చెబు తోంది. ‘హ్యాండ్‌ బుక్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ ఆన్‌ ఇండియన్‌ స్టేట్స్‌  2021 – 2022’ పేరుతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నవంబర్‌ రెండో వారంలో విడుదల చేసిన నివేదిక ప్రతిపక్షాలు, ఇతరులూ చేస్తున్న ఆరోపణలు అవాస్తవం అని తేల్చి చెప్పింది. 

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ నేతృత్వంలోని వైసీపీ 2019 మే 30వ తేదీన అధికారంలోకి వచ్చింది. తర్వాతి కొద్ది కాలానికే కోవిడ్‌ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అతలాకుతల మయ్యాయి. అయితే ఈ కోవిడ్‌ సంక్షోభాన్ని కూడా ఆంధ్ర ప్రదేశ్‌ సమర్థవంతంగా అధిగమించిందనే చెప్పాలి. కోవిడ్‌తో దేశ జీడీపీ 7.3 శాతం క్షీణిస్తే ఏపీలో ఈ క్షీణత 2.58 శాతం మాత్రమే నమోదైంది. అయితే అనతి కాలంలోనే పుంజుకుని 2021–22లో భారత దేశం 8.7 శాతం వృద్ధి రేటు సాధించగా ఆంధ్రప్రదేశ్‌ 11.43 శాతంతో దేశంలో అత్యధిక ఆర్థికాభివృద్ధిని సాధించిన రాష్ట్రంగా ఎదిగింది. అంతేకాకుండా ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’లో వరుసగా మూడేళ్ళపాటు మొదటి స్థానంలో ఉంది. 

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిపై సందేహాలు వ్యక్తం చేస్తున్న వారికి ఆర్‌బీఐ నివేదికలో సమగ్రమైన సమాధానాలు లభిస్తాయి. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న చివరి ఏడాదిలో సాధించిన అభివృద్ధినీ, జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో అభివృద్ధినీ ఆర్‌బీఐ నివేదిక ఆధారంగా పరిశీలిస్తే రాష్ట్రంలో అన్ని రంగాల్లో సంతృప్తికరమైన పురోగతిని గమనించవచ్చు. ఉదా హరణకు 2018–19లో సామాజిక రంగానికి చంద్రబాబు ప్రభుత్వం రూ. 76,759 కోట్ల రూపాయలు వ్యయం చేస్తే, 2021–22లో జగన్‌ జగన్‌ ప్రభుత్వం రూ.1,13,434 కోట్లు వ్యయం చేసింది. సంక్షేమ ఫలాలను అందించే ఈ వ్యయం విషయంలో ఏపీ దేశంలో ఆరో స్థానంలో ఉంది. 

స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జీఎస్‌డీపీ) 2020–2021లో రూ. 10,14,374 కోట్లు కాగా అది 2021–2022 నాటికి రూ. 12,01,736 కోట్లకు పెరిగింది. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం చంద్రబాబు సీఎంగా ఉన్న 2018–19లో రూ. 1,54,031 గా ఉంది. అది 2020–21 నాటికి రూ. 1,76,707కూ, 2021–22 నాటికి రూ. 2,07,717కు  పెరిగింది. ఇదే సమయంలో దేశంలో తలసరి ఆదాయం రూ. 1,26,855 నుంచి రూ. 1,49,848 కు మాత్రమే పెరిగింది. అంటే జాతీయ స్థాయిలో ఈ పెరుగుదల రూ.  23,000గా ఉంటే... రాష్ట్రంలో రూ. 31,010 పెరిగిందన్న మాట! తలసరి ఆదాయం విషయంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో 9వ స్థానంలో ఉంది. 

ఆర్థిక శాస్త్రంలో గ్రాస్‌ వాల్యూ యాడెడ్‌ (జీవీఏ) అనే పదాన్ని రాష్ట్రం లేదా దేశంలోని ఆయా రంగాల వస్తు, సేవల ఉత్పత్తి విలువ లెక్కించడానికి వాడతారు. ఆంధ్రప్రదేశ్‌లో 2021–22లో జీవీఏ గ్రోత్‌ రేట్‌ 18.47 గా నమోదైంది. రాష్ట్ర విభజన తర్వాత ఇంత ఎక్కువ గ్రోత్‌ రేట్‌ నమోదు కావడం ఇదే మొదటి సారి. వ్యవసాయం, దాని అనుబంధ ఉత్పత్తుల జీవీఏలో పెరుగుదల 14.50 శాతం నమోదైంది. ఇది జాతీయ సగటు కన్నా ఎక్కువ. జీవీఏ ప్రాతిపదిక లెక్కన మొత్తం వ్యవసాయ రంగం విలువ చంద్రబాబు హయాంలో సుమారు రూ. 10 లక్షల కోట్లు ఉంటే జగన్‌ ప్రభుత్వ హయాంలో అది రూ. 15 లక్షల కోట్లకు పెరిగింది. పరిశ్రమల జీవీఏ 2018– 19లో రూ. 18లక్షల కోట్లు ఉంటే అది 2021–2022 నాటికి రూ. 24 లక్షల కోట్లకూ పెరిగింది.

గత మూడేళ్ళుగా వ్యవసాయ రంగాభివృద్ధి కూడా సంతృప్తికరంగానే ఉందని ఆర్‌బీఐ నివేదిక తెలియజేస్తోంది. 2018–2019లో స్థూల సాగుభూమి 72.97 లక్షల హెక్టార్లు కాగా అది 2021–2022 నాటికి 74.07 లక్షల హెక్టార్లకు పెరిగింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి ఇదే కాలంలో 10,838 వేల టన్నుల నుంచి 11,299 వేల టన్నులకూ, నూనె గింజల ఉత్పత్తి 504 వేల టన్నుల నుంచి 804 వేల టన్నులకూ పెరిగాయి. చేపలు, గుడ్ల ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. 

ఆర్‌బీఐ నివేదిక ప్రకారం బాబు పాలన చివరి ఏడాదిలో సాధారణ ద్రవ్యోల్బణం 6.9 శాతం ఉంటే ప్రస్తుతం 5.2 శాతంగా ఉంది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వేయి మందికి 45 మంది నిరుద్యోగులుంటే ఇప్పుడు వీరి సంఖ్య 33కి తగ్గింది. అలాగే పట్టణ ప్రాంతంలో గతంలో ప్రతి వేయి మందికి 73 మంది నిరుద్యోగులుంటే ఇప్పుడు వారి సంఖ్య 60కి తగ్గింది. 6234 ప్రభుత్వాసుపత్రులతో ఆంధ్రప్రదేశ్‌ దేశం లోనే అగ్రస్థానంలోనూ, 86,721 ఆస్పత్రి పడకలతో  దేశంలో రెండో  స్ధానంలోనూ ఉంది. 2018–19లో రాష్ట్రంలో విద్యుత్‌ లభ్యత 6,380 కోట్ల యూనిట్లు ఉండగా నేడు 6822 కోట్ల యూనిట్లకు పెరిగింది.

చంద్రబాబు పాలన ఆఖరి ఏడాదిలో రాష్ట్ర పన్నుల ఆదాయం రూ. 58,677 కోట్లుగా నమోదు కాగా అది ఈ ఏడాది రూ. 85,265కు పెరిగింది. 2021–22లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రుణాలపై వడ్డీగా రూ. 22,740 కోట్లు చెల్లించగా... ఉత్తర ప్రదేశ్‌ రూ. 43 వేల కోట్లు, మహారాష్ట్ర రూ. 42 వేల కోట్లు, తమిళనాడు రూ. 41 వేల కోట్లు చెల్లించాయి. 

దేశ ఎగుమతుల్లో 5.8 శాతం వృద్ధి ఉంటే, రాష్ట్రంలో ఎగుమతుల వృద్ధి 19.4 శాతంగా నమోదైంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎగుమతుల్లో తొమ్మిదో స్థానంలో ఉన్న రాష్ట్రం నేడు నాల్గో స్థానానికి చేరుకుంది. నీతి ఆయోగ్‌ ర్యాకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ డీసెంట్‌ ఎకనమిక్‌ గ్రోత్‌ విభాగంలో రెండో ర్యాంక్‌, పేదరిక నిర్మూలన విభాగంలో 3వ ర్యాంక్, గుడ్‌ హెల్త్‌ విభాగంలో 2వ ర్యాంక్,  క్లీన్‌ వాటర్, శానిటేషన్‌ విభాగంలో 6వ ర్యాంక్‌ సాధించింది. 

జగన్‌ ప్రభుత్వం నగదు బదిలీ పథకం ద్వారా గత మూడే ళ్ళుగా పేదలకు సుమారు లక్షా 90 వేల కోట్ల రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. పథకంపై ప్రారంభంలో కొందరు సందేహాలు వ్యక్తం చేసినప్పటికీ క్రమంగా ఈ విధానాన్ని ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయి. పెద్ద ఎత్తున జరుగుతున్న నగదు బదిలీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్ధ పురోగమనానికి కూడా తోడ్పడుతోంది. కోట్లాది రూపాయల మేరకు బదిలీ అవుతున్న నగదును లబ్ధిదారులు కొద్ది రోజుల్లోనే వివిధ రకాల వస్తు, సేవల కొనుగోలుకూ, ఫీజుల చెల్లింపునకూ ఖర్చు చేస్తున్నారు. ఫలితంగా వస్తు, సేవలకు గిరాకీ ఏర్పడడం, వస్తువుల తయారీ అవసరం ఏర్పడడం, దానికై ముడి సరకులు కొనుగోలు చేయడం, ఉపాధి లభించడం, వ్యాపారాలు వృద్ధి చెందడం జరుగుతోంది. వ్యాపార లావాదేవీలు పెరగడం వల్ల ప్రభుత్వానికి పన్నుల రాబడి కూడా పెరుగుతోంది. 

ఒక అంచనా ప్రకారం ఒక లబ్ధిదారుడికి ప్రభుత్వం ఒక ఏడాదిలో లక్ష రూపాయలు బదిలీ చేస్తే ఆ మొత్తం ఏడాదిలో కనీసం 50 లావాదేవీల ద్వారా చేతులు మారుతోంది. ఫలి తంగా అన్ని చోట్లా వస్తుసేవలకు గిరాకీ ఏర్పడి, క్రయ విక్ర యాల ద్వారా ప్రభుత్వానికి పన్నుల రూపంలో రాబడి వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పన్నుల రాబడి పెరగడానికీ, ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెరగడానికీ, వస్తు సేవలకు గిరాకీ ఏర్పడటానికీ... ఫలితంగా రాష్ట్రాభివృద్ధికి ఈ నగదు బదిలీ కొంత కారణమవుతుంది. అయితే పెద్దఎత్తున నగదు ప్రజలకు ఇవ్వడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదముంటుందని కొందరు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో లక్షలాది కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ప్రజలకూ, ప్రజల నుంచి మార్కెట్‌లోకీ వచ్చినప్పటికీ గతంతో పోలిస్తే ద్రవ్యోల్బణం 6.9 శాతం నుంచి 5.2 శాతానికి తగ్గడం గమనార్హం. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి జరుగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ప్రతిపక్షాలు, మీడియా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. అలా కాకుండా ఆర్‌బీఐ నివేదిక వెలువడిన తర్వాత కూడా మొండిగా అబద్ధాలు, అర్ధసత్యాలు ప్రచారం చేస్తే నవ్వుల పాలయ్యే  ప్రమాదం ఉంది. 


- వి. వి. ఆర్‌. కృష్ణంరాజు 
అధ్యక్షుడు ఏపీ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement