Andhra Pradesh GSDP Growth Increased a Decade After Bifurcation of the State - Sakshi
Sakshi News home page

దక్షిణాదిన తలసరి ఆదాయంలో దూసుకుపోతున్న ఏపీ: ఆర్‌బీఐ గణాంకాలు 

Published Thu, May 11 2023 2:33 PM | Last Updated on Thu, May 11 2023 4:53 PM

Decade After Bifurcation Andhra Pradesh crawling on gsdp growth - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగి పదో సంవత్సరంలోకి ప్రవేశించాం. ఈ సందర్భంగా దేశ ఆర్థికాభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల కృషి, వాటి వాటాపై సంతోషకరమైన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ), ఆర్థిక సర్వే గణాంకాల ప్రకారం తోటి దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక రంగంలో ముందుకు దూసుకుపోతోంది. 2014 ఫిబ్రవరి-జూన్‌ మాసాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన ఫలితంగా అనేక రకాలుగా అననుకూల పరిస్థితులు ఎదుర్కొన్న నవ్యాంధ్ర ప్రదేశ్‌ ఆర్థిక పనితీరు సంతృప్తికరంగా ఉంది.

అంతేకాదు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై స్థాయి మెట్రోపాలిటన్‌ నగరం రాజధానిగా లేనప్పటికీ ఏపీ గణనీయమైన స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ) సాధించిందని ఈ గణాంకాలు వివరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ జీఎస్డీపీ రూ.13.2 లక్షల కోట్లు. పారిశ్రామికంగా, విద్య, సామాజిక రంగాల్లో మొదటి నుంచీ ముందున్న తమిళనాడు రూ.24.8 లక్షల కోట్ల జీఎస్డీపీ సాధించగా, తర్వాత కర్ణాటక రూ.22.4 లక్షల కోట్లు, తెలంగాణ రూ.13.3 లక్షల కోట్లు, కేరళ రూ.కేరళ రూ. 10 లక్షల కోట్లతో ముందుకు సాగుతున్నాయి. ఈ లెక్కల ప్రకారం 9 సంవత్సరాల క్రితం విడిపోయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల జీఎస్డీపీలను కలిపితే రూ.26.5 లక్షల కోట్లు అవుతుంది. అంటే ఒకవేళ రాష్ట్ర విభజన జరిగి ఉండకపోతే– జీఎస్టీడీపీ విషయంలో తమిళనాడు కన్నా ఉమ్మడి ఏపీ ముందుండేది.ఒక ఆంగ్ల వాణిజ్య పక్షపత్రిక 2022కు సంబంధించి ఆర్బీఐ, ఇకనామిక్‌ సర్వే నుంచి లభించిన గణాంకాల ఆధారంగా కొన్ని అంచనాలు వేసింది. తలసరి ఆదాయంలోనూ ఏపీ పరుగులు తీస్తోంది.

దక్షిణాది ఐదు రాష్ట్రాల్లో ఐటీ, ఔషధాల పరిశ్రమల కేంద్రం హైదరాబాద్‌ అంతర్భాగంగా ఉన్న తెలంగాణ రూ.2,65,623 తలసరి ఆదాయంతో అగ్రభాగాన నిలవడంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. కాని, హైదరాబాద్‌ వంటి పారిశ్రామిక మహానగరం ఆంధ్రప్రదేశ్‌ లో లేకున్నా ఈ రాష్ట్రం రూ. 2,07,771 తలసరి ఆదాయం నమోదు చేసుకోవడం నిజంగా ఘనవిజయమే. ఎందుకంటే, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర సాంకేతిక, వైద్య విద్యలకు సంబందించి ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతంలో చాలా ఆలస్యంగా విద్యాసంస్థలు నెలకొల్పారు. ప్రైవేటు రంగంలో భారీ పరిశ్రమలు, అత్యధిక జీతాలు చెల్లించే రంగాలు కూడా ఏపీలో ఇంకా చెప్పుకోదగ్గస్థాయికి ఎదగలేదు. ఆంధ్ర ప్రాంతం ప్రధానంగా వ్యవసాయాధారిత ప్రాంతం. ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఇతర టెక్నాలజీ కోర్సులు చదివిన విద్యార్థులు పీజీ చదువుల కోసం అమెరికా, కెనడా, ఐరోపా దేశాలు, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళ్లి స్థిరపడడం ఎక్కువ. ఈ నేపథ్యంలో ఏపీ రూ.2,07,771 తలసరి ఆదాయం సాధించడం నిజంగా ప్రశంసనీయం.

ఐటీ, ఇతర టెక్నాలజీ రంగాలు, గట్టి పునాదులున్న ఫార్మా రంగాల ద్వారా 21వ శతాబ్దపు నగరంగా రూపుదిద్దుకున్న గ్లోబల్‌ సిటీ హైదరాబాద్‌ అంతర్భాగం కావడం వల్ల తెలంగాణ దక్షిణాదిన తలసరి ఆదాయంలో అగ్రభాగాన నిలిచింది. అయితే, తొమ్మిదేళ్ల క్రితం సొంత ప్రయాణం మళ్లీ ప్రారంభించిన ఏపీ తలసరి ఆదాయంలో మంచి ప్రగతి సాధించిందనే చెప్పవచ్చు. కాగా, తలసరి ఆదాయంలో జాతీయ సగటు అయిన రూ.1,50,007ను ఈ ఐదు దక్షిణాది రాష్ట్రాలు దాటì అందనంత ముందుకెళ్లడం ఈ ప్రాంతంలోని ఆర్థిక, సామాజిక, మౌలిక సదుపాయాల పునాదులకు అద్దంపడుతోంది. దక్షిణాదిన ఈ ఐదు రాష్ట్రాల్లో కర్ణాటక, తెలంగాణ మధ్య ఆర్థికాభివృద్ధికి సంబంధించి గట్టి పోటీ ఉందని కూడా ఆర్బీఐ గణాంకాలు సూచిస్తున్నాయి. అయితే, మిగిలిన మూడు రాష్ట్రాలూ ఈ రెండింటితో పోటీపడుతూ ముందుకు పరిగెడుతున్నాయి. మొత్తంమీద ఆంధ్రప్రదేశ్‌ సహా ఈ ఐదు దక్షిణాది రాష్ట్రాలూ భారత ఆర్థిక ప్రగతికి గ్రోత్‌ ఇంజన్లుగా ఉపయోగపడుతున్నాయి.

-విజయసాయిరెడ్డి, రాజ్యసభ ఎంపీ, వైఎస్సార్ సీపీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement