ఇస్లామాబాద్: పొరుగుదేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని అల్లాడుతున్న విషయం తెలిసిందే. నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పటికే ఆకాశాన్నంటుతున్నాయి. లీటర్ పాల ధర రూ.250, కేజీ చికెన్ రూ.780కి చేరిందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో దివాళా అంచుల్లోకి పాకిస్తాన్ వెళ్లిందని అంతా అనుకుంటున్నారు.
అయితే పాక్ రక్షణ మంత్రి, పీఎంఎల్-ఎన్ నేత ఖవాజా ఆసిఫ్ ఆ దేశ పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఇప్పటికే దివాళా తీసిందని కుండబద్దలుకొట్టారు. పీకల్లోతూ అప్పుల్లో కూరుకుపోయామని ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు కన్పించడం లేదన్నారు. ఇక పాక్ ప్రజలు తమకాళ్లపై తామే నిలబడాలని పిలుపునిచ్చారు. సియాల్‌కోట్‌లో ఓ ప్రైవేట్ కాలేజ్ నిర్వహించిన కాన్వొకేషన్ కార్యక్రమానికి అతిథిగా హాజరైన ఖవాజా ఈ వ్యాఖ్యలు చేశారు.
'పాకిస్తాన్ అప్పుల్లో కూరుకుపోయిందని, ఆర్థిక మాంద్యంలో ఉందని ప్రజలు అంటున్నారు. అయితే ఇదంతా ఇప్పటికే జరిగిపోయింది. మనం ఇప్పుడు దివాళా తీసిన దేశంలో నివసిస్తున్నాం. ఇక సొంతంగా మనకాళ్లపైనే నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది' అని ఆసిఫ్ అన్నారు.
Defence Minister of Imported govt admits that Pakistan is already in default. In 10 months they have brought Pak to this sorry state - Shameless lot selling out the country & holding on to power instead of letting nation choose their ldrs thru elections. pic.twitter.com/IHbREnbAhK
— Shireen Mazari (@ShireenMazari1) February 18, 2023
దేశంలో ఇలాంటి దారుణమైన పరిస్థితి రావడానికి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని గత పీటీఐ ప్రభుత్వమే కారణమని ఖవాజా ధ్వజమెత్తారు. ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టి పాకిస్తాన్‌కు తిరిగితీసుకొచ్చారని ఆరోపించారు. పాకిస్తాన్‌ను ఉగ్రవాదులకు నిలయంగా మార్చారని కూడా ఖవాజా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఖవాజా ఆరోపణలను ప్రతిపక్ష పీటీఐ పార్టీ తిప్పికొట్టింది. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అధికారం చేపట్టిన 10 నెలల్లోనే దేశాన్ని దివాళా తీయించిందని ఎదురుదాడికి దిగింది.
అంతర్జాతీయ ద్రవ్య నిధి 2019లో పాకిస్తాన్‌కు 6 బిలియన్ డాలర్ల సాయం అందించింది. 2022లో వరదల తర్వాత మరో 1.1 బిలియన్ డాలర్లను సాయంగా ప్రకటించింది. కానీ దేశంలో రాజకీయ గందరగోళం మధ్య ఆర్థిక ఏకీకరణపై పాకిస్తాన్ మరింత పురోగతి సాధించడంలో విఫలమవడంతో నవంబర్‌లో చెల్లింపులను నిలిపివేసింది.
చదవండి: ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ హాస్పిటల్స్ సీఈఓగా మేఘనా పండిట్
Comments
Please login to add a commentAdd a comment