ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే కీలక వడ్డీరేట్లు | Fed Interest Rates To Control Inflation | Sakshi
Sakshi News home page

ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే కీలక వడ్డీరేట్లు

Published Fri, Jan 5 2024 1:21 PM | Last Updated on Fri, Jan 5 2024 2:09 PM

Fed Interest Rates To Control Inflation - Sakshi

రాజకీయాలతోపాటు రాష్ట్ర బాగోగులు, సమస్యలపై నిత్యం పార్లమెంట్‌లో పోరాడే ఏపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ప్రపంచ ఆర్థికవ్యవస్థపై విస్తృత పట్టు ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సమస్యను తగ్గించేందుకు అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ తీసుకుంటున్న నిర్ణయాలేంటి.. దానివల్ల ఎలాంటి ప్రభావం ఉండబోతోంది.. అసలు ద్రవ్యోల్బణం ఎలా ఏర్పడుతుంది.. కార్మికుల జీతాలకు ఇన్‌ఫ్లేషన్‌కు సంబంధం ఏమిటనే అంశాలను విజయసాయిరెడ్డి వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా సంపన్న దేశాల్లో, చెప్పుకోదగ్గ ప్రగతి సాధించిన వర్ధమాన దేశాల్లో మధ్యతరగతి ప్రజల నుంచి ఆర్థికవేత్తల వరకూ ద్రవ్యోల్బణం గురించి మాట్లాడుతున్నారు. జనం వినియోగించే వస్తువులు, సరకుల ధరలు పెరుగడం అందరినీ వేధిస్తున్న సమస్య. అమెరికా నుంచి ఇండియా వరకూ ద్రవ్యోల్బణంలో వచ్చే మార్పులే మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ (ఫెడ్‌) ఇటీవల ‘దేశంలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టేకొద్దీ 2024లో వడ్డీ రేట్లను మూడుసార్లు తగ్గించగలం’ అని సూచనప్రాయంగా తెలిపింది. దీంతో ఇండియాలో స్టాక్‌ మార్కెట్లలో సూచీలు రికార్డు స్థాయిలో పెరిగాయి. దేశ ఆర్థికవ్యవస్థ గమనాన్ని నిర్ణయించే ద్రవ్యోల్బణంపై తరచూ ‘ఫెడ్‌’ ప్రకటనలు చేస్తూ అమెరికన్లను నిరంతరం అప్రమత్తం చేస్తోంది.

ఫెడ్‌ సూచనలు కీలకం

ప్రస్తుత ద్రవ్యోల్బోణం ఈ ఏడాది లేదా తర్వాత ఏడాది ఏ స్థాయిలో అదుపులోకి వస్తుందనే విషయంపై ఫెడ్‌ లేదా దాని సభ్యులు అంచనా వేసి చెబుతుంటారు. ఈ అంచనాల ఆధారంగా వడ్డీ రేట్లలో మార్పులు చేస్తోంది ఫెడ్‌. రాబోయే సుమారు మూడు నెలల కాలంలో వడ్డీ రేట్ల తగ్గింపు లేదా పెంపు ఎలా ఉండవచ్చనే అంశంపై ప్రజలకు ఫెడ్‌ ముందే సూచిస్తోంది. ఇలా ద్రవ్యోల్బణంపై ఫెడ్‌ వేసే అంచనాలకు మీడియా అధిక ప్రాధాన్యం ఇస్తూ వాటిని భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తుంది. ఫెడ్‌ అభిప్రాయాలపై విస్తృతంగా చర్చలు సాగుతాయి. చివరికి ఫలానా వస్తువుల ధరలు భవిష్యత్తులో ఎలా ఉంటాయనే విషయంపై సగటు వినియోగదారుడు ఒక నిర్ధారణకు వస్తాడు. ఫెడ్‌ కీలక నిర్ణయాల వల్ల బ్యాంకు వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణంపై ఎలా ప్రభావం చూపుతాయనే విషయంపై క్లారిటీ వస్తుంది. అర్థశాస్త్ర పాఠ్యపుస్తకాల్లో ఉన్నట్టే అంతా జరుగుతుందా అంటే, వాటిలో వివరించిననట్టు ప్రపంచం నడవదు.

వాస్తవ ప్రపంచం వేరు..

వ్యాపారులు తమ ఉత్పత్తి కార్యకలాపాలను విస్తరించాలనుకున్నప్పుడు అందుకు సరిపడా కార్మికులు లేకపోతే ద్రవ్యోల్బణం వేగం పుంజుకుంటుంది. ఉద్యోగులకు డిమాండ్‌ ఉండడంతో వారు అధిక వేతనాల కోసం పట్టుబడతారు. ఫలితంగా ఉత్పత్తి వ్యయాలు పెరుగుతాయి. దాంతో వేరే దారిలేక పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులకు ఎక్కువ ధరలు నిర్ణయిస్తారు. జీతాలు పెరగడం వల్ల కార్మికుల జేబుల్లోకి ఎక్కువ డబ్బు వస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ కనీస అవసరాల కోసం షాపుల్లో కొనుగోలు చేసే వస్తు ధరలు ఊహించినదాని కన్నా ఎక్కువ ఉంటాయి. వేతనాలు పెరగడంతో వచ్చిన ప్రయోజనం వస్తు ధరల పెంపుతో మాయమౌతుంది. ఇక ధరలు ఇలాగే పెరుగుతాయనే ఆందోళనతో కార్మికులు మరింత ఎక్కువ వేతనాలు కావాలంటూ ఒత్తిడి చేస్తారు. ఈ విధంగా వర్కర్ల జీతాలతోపాటే వస్తువుల  ధరలూ పెరుగుతుంటాయి. దీన్నే ‘ధరల వలయం’ అని పిలుస్తారు. ఈ రకమైన సూత్రీకరణలు అర్థసత్యాలేగాని సంపూర్ణ వాస్తవాలు కావు. సరకుల కొరత ఉన్నప్పుడు తమ లాభాలు పెంచుకోవడానికి వ్యాపారులు చేసే ప్రయత్నాల వల్ల (ధరలు పెంచడం ద్వారా) కొన్ని కాలాల్లో ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయిల్లో ఉంటుందని అనేక అధ్యయనాలు నిరూపించాయి.

ఇదీ చదవండి: కొత్త ఏడాదిలో మానవ యంత్రాలు..?

ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం అంటే?

అసలు ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం అంటే ఏమిటి? అనే విషయంపై అమెరికాలో చర్చ జరుగుతోంది. ఫెడ్‌ తన ప్రకటనలో వాడిన ఈ మాటలకు (ఇన్‌ఫ్లేషన్‌ ఈజింగ్‌) అర్థం–ద్రవ్యోల్బణం తగ్గిపోవడం. అంటే ధరలు తగ్గవు. గతంతో పోల్చితే ధరలు చాలా నెమ్మదిగా పెరుగుతాయి. అమెరికాలో ఇళ్లలో వాడే సరకుల ధరలు 2022లో 12% పెరగగా, గడచిన 12 మాసాల్లో కేవలం 2 శాతమే పెరిగాయి. ప్రపంచ ఆర్థికవ్యవస్థను ముందుకు నడిపించే ఈ దేశంలో గతేడాది ద్రవ్యోల్బణం 9.1% ఉండగా, నవంబర్‌లో 3.1% గా నమోదైంది. ఈ లెక్కన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గమనం 2024లో కూడా ఇప్పటిలా ఆశావహంగా ఉండొచ్చని అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ అంచనా.


విజయసాయిరెడ్డి, రాజ్యసభ ఎంపీ, YSRCP

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement