Inflation concern
-
ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే కీలక వడ్డీరేట్లు
రాజకీయాలతోపాటు రాష్ట్ర బాగోగులు, సమస్యలపై నిత్యం పార్లమెంట్లో పోరాడే ఏపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ప్రపంచ ఆర్థికవ్యవస్థపై విస్తృత పట్టు ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సమస్యను తగ్గించేందుకు అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ తీసుకుంటున్న నిర్ణయాలేంటి.. దానివల్ల ఎలాంటి ప్రభావం ఉండబోతోంది.. అసలు ద్రవ్యోల్బణం ఎలా ఏర్పడుతుంది.. కార్మికుల జీతాలకు ఇన్ఫ్లేషన్కు సంబంధం ఏమిటనే అంశాలను విజయసాయిరెడ్డి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా సంపన్న దేశాల్లో, చెప్పుకోదగ్గ ప్రగతి సాధించిన వర్ధమాన దేశాల్లో మధ్యతరగతి ప్రజల నుంచి ఆర్థికవేత్తల వరకూ ద్రవ్యోల్బణం గురించి మాట్లాడుతున్నారు. జనం వినియోగించే వస్తువులు, సరకుల ధరలు పెరుగడం అందరినీ వేధిస్తున్న సమస్య. అమెరికా నుంచి ఇండియా వరకూ ద్రవ్యోల్బణంలో వచ్చే మార్పులే మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) ఇటీవల ‘దేశంలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టేకొద్దీ 2024లో వడ్డీ రేట్లను మూడుసార్లు తగ్గించగలం’ అని సూచనప్రాయంగా తెలిపింది. దీంతో ఇండియాలో స్టాక్ మార్కెట్లలో సూచీలు రికార్డు స్థాయిలో పెరిగాయి. దేశ ఆర్థికవ్యవస్థ గమనాన్ని నిర్ణయించే ద్రవ్యోల్బణంపై తరచూ ‘ఫెడ్’ ప్రకటనలు చేస్తూ అమెరికన్లను నిరంతరం అప్రమత్తం చేస్తోంది. ఫెడ్ సూచనలు కీలకం ప్రస్తుత ద్రవ్యోల్బోణం ఈ ఏడాది లేదా తర్వాత ఏడాది ఏ స్థాయిలో అదుపులోకి వస్తుందనే విషయంపై ఫెడ్ లేదా దాని సభ్యులు అంచనా వేసి చెబుతుంటారు. ఈ అంచనాల ఆధారంగా వడ్డీ రేట్లలో మార్పులు చేస్తోంది ఫెడ్. రాబోయే సుమారు మూడు నెలల కాలంలో వడ్డీ రేట్ల తగ్గింపు లేదా పెంపు ఎలా ఉండవచ్చనే అంశంపై ప్రజలకు ఫెడ్ ముందే సూచిస్తోంది. ఇలా ద్రవ్యోల్బణంపై ఫెడ్ వేసే అంచనాలకు మీడియా అధిక ప్రాధాన్యం ఇస్తూ వాటిని భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తుంది. ఫెడ్ అభిప్రాయాలపై విస్తృతంగా చర్చలు సాగుతాయి. చివరికి ఫలానా వస్తువుల ధరలు భవిష్యత్తులో ఎలా ఉంటాయనే విషయంపై సగటు వినియోగదారుడు ఒక నిర్ధారణకు వస్తాడు. ఫెడ్ కీలక నిర్ణయాల వల్ల బ్యాంకు వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణంపై ఎలా ప్రభావం చూపుతాయనే విషయంపై క్లారిటీ వస్తుంది. అర్థశాస్త్ర పాఠ్యపుస్తకాల్లో ఉన్నట్టే అంతా జరుగుతుందా అంటే, వాటిలో వివరించిననట్టు ప్రపంచం నడవదు. వాస్తవ ప్రపంచం వేరు.. వ్యాపారులు తమ ఉత్పత్తి కార్యకలాపాలను విస్తరించాలనుకున్నప్పుడు అందుకు సరిపడా కార్మికులు లేకపోతే ద్రవ్యోల్బణం వేగం పుంజుకుంటుంది. ఉద్యోగులకు డిమాండ్ ఉండడంతో వారు అధిక వేతనాల కోసం పట్టుబడతారు. ఫలితంగా ఉత్పత్తి వ్యయాలు పెరుగుతాయి. దాంతో వేరే దారిలేక పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులకు ఎక్కువ ధరలు నిర్ణయిస్తారు. జీతాలు పెరగడం వల్ల కార్మికుల జేబుల్లోకి ఎక్కువ డబ్బు వస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ కనీస అవసరాల కోసం షాపుల్లో కొనుగోలు చేసే వస్తు ధరలు ఊహించినదాని కన్నా ఎక్కువ ఉంటాయి. వేతనాలు పెరగడంతో వచ్చిన ప్రయోజనం వస్తు ధరల పెంపుతో మాయమౌతుంది. ఇక ధరలు ఇలాగే పెరుగుతాయనే ఆందోళనతో కార్మికులు మరింత ఎక్కువ వేతనాలు కావాలంటూ ఒత్తిడి చేస్తారు. ఈ విధంగా వర్కర్ల జీతాలతోపాటే వస్తువుల ధరలూ పెరుగుతుంటాయి. దీన్నే ‘ధరల వలయం’ అని పిలుస్తారు. ఈ రకమైన సూత్రీకరణలు అర్థసత్యాలేగాని సంపూర్ణ వాస్తవాలు కావు. సరకుల కొరత ఉన్నప్పుడు తమ లాభాలు పెంచుకోవడానికి వ్యాపారులు చేసే ప్రయత్నాల వల్ల (ధరలు పెంచడం ద్వారా) కొన్ని కాలాల్లో ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయిల్లో ఉంటుందని అనేక అధ్యయనాలు నిరూపించాయి. ఇదీ చదవండి: కొత్త ఏడాదిలో మానవ యంత్రాలు..? ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం అంటే? అసలు ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం అంటే ఏమిటి? అనే విషయంపై అమెరికాలో చర్చ జరుగుతోంది. ఫెడ్ తన ప్రకటనలో వాడిన ఈ మాటలకు (ఇన్ఫ్లేషన్ ఈజింగ్) అర్థం–ద్రవ్యోల్బణం తగ్గిపోవడం. అంటే ధరలు తగ్గవు. గతంతో పోల్చితే ధరలు చాలా నెమ్మదిగా పెరుగుతాయి. అమెరికాలో ఇళ్లలో వాడే సరకుల ధరలు 2022లో 12% పెరగగా, గడచిన 12 మాసాల్లో కేవలం 2 శాతమే పెరిగాయి. ప్రపంచ ఆర్థికవ్యవస్థను ముందుకు నడిపించే ఈ దేశంలో గతేడాది ద్రవ్యోల్బణం 9.1% ఉండగా, నవంబర్‌లో 3.1% గా నమోదైంది. ఈ లెక్కన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గమనం 2024లో కూడా ఇప్పటిలా ఆశావహంగా ఉండొచ్చని అమెరికా సెంట్రల్ బ్యాంక్ అంచనా. విజయసాయిరెడ్డి, రాజ్యసభ ఎంపీ, YSRCP -
ధరల మంట.. పరిశ్రమలకు సెగ! దడపుట్టిస్తున్న ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి బుధవారం వెలువడిన అధికారిక గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా తొమ్మిదవ నెల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న ఆరు శాతం వద్ద కట్టడి పరిధి దాటి నమోదయ్యింది. పైగా ఆగస్టులో 7శాతం ఉంటే, సెప్టెంబర్‌లో 7.41శాతానికి (2021 ఇదే నెల ధరలతో పోల్చి) పెరిగింది. గత ఏడాది సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.35 శాతమే. ఇక ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో వృద్ధిలేకపోగా 0.8 శాతం క్షీణించింది. సామాన్యునిపై ధరల భారం రిటైల్ ద్రవ్యోల్బణ బాస్కెట్లో కీలక ఆహార విభాగం ధరలు సెప్టెంబర్‌లో తీవ్రంగా పెరిగాయి. మొత్తంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్టం... 7.41 శాతం పెరగ్గా, ఒక్క ఫుడ్ బాస్కెట్ ఇన్ఫ్లెషన్ 8.60 ( ఆగస్టులో 7.62 శాతం) శాతానికి చేరింది. కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం హద్దు మీరి పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది మే నుంచి వరుసగా నాలుగుసార్లు ఆర్బీఐ రెపోరేటు పెంచింది. మేలో 4 శాతంగా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) ఈ నాలుగు దఫాల్లో 190 బేసిస్ పాయింట్లు పెరిగి, ఏకంగా 5.9 శాతానికి (2019 ఏప్రిల్ తర్వాత) చేరింది. మరింత పెరగవచ్చనీ ఆర్బీఐ సంకేతాలు ఇచ్చింది. రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు అంచనా 6.7 శాతంకాగా, క్యూ2 , క్యూ3, క్యూ4ల్లో వరుసగా 7.1 శాతం, 6.5శాతం, 5.8 శాతంగా ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ రేటు 5.1 శాతానికి దిగివస్తుందని అంచనావేసింది. అక్టోబర్, నవంబర్‌ల్లోనూ ద్రవ్యోల్బణం ఎగువబాటనే పయనిస్తే, తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 5 నుంచి 7 సమయంలో ఆర్బీఐ రెపో రేటును మరో అరశాతం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడచిన తొమ్మిది నెలలుగా ద్రవ్యోల్బణం కట్టడిలో ఎందుకు లేదన్న అంశంపై కేంద్రానికి ఆర్బీఐ త్వరలో ఒక నివేదిక సమర్పిస్తుందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. 18 నెలల కనిష్టానికి పారిశ్రామిక రంగం ఇక ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి గడచిన 18 నెలల్లో ఎన్నడూ లేని తీవ్ర పతన స్థాయి 0.8 శాతం క్షీణతను చూసింది. 2021 ఫిబ్రవరిలో ఐఐపీలో 3.2 శాతం క్షీణత నమోదయ్యింది. తాజా సమీక్షా నెల్లో సూచీలో దాదాపు 60 శాతం వెయిటేజ్ ఉన్న తయారీ రంగం కూడా 0.7శాతం క్షీణతను (2021 ఇదే నెలతో పోల్చి) చూసింది. గత ఏడాది ఇదే కాలంలో తయారీ ఉత్పత్తి వృద్ధి రేటు 11.1శాతం. మైనింగ్ ఉత్పాదకత 23.3 శాతం వృద్ధి నుంచి 3.9 శాతం క్షీణతలోకి జారింది. విద్యుత్ రంగం ఉత్పత్తి వృద్ధి రేటు 16 శాతం నుంచి 1.4 శాతానికి పడిపోయింది. క్యాపిటల్ గూడ్స్ విభాగంలో వృద్ధి రేటు 20శాతం నుంచి 5శాతానికి పడిపోయింది. -
నిర్మలా సీతారామన్‌పై బీజేపీ సీనియర్ సెటైర్లు: తీవ్ర చర్చ
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థిక పరిస్థితి, ద్రవ్యోల్బణంపై ప్రతిపక్షాల డిమాండ్‌పై పార్లమెంటులో చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత సుబ్రమణియన్ స్వామి సెటైర్లు వేశారు. ఆర్థిక మాంద్యం భయాలు, భారత్ కరెన్సీ రూపాయి విలువ పతనం తదితర అంశాలను ప్రస్తావించిన నిర్మలా సీతారామన్ దేశంలో మాంద్యం పరిస్థితులన్న ప్రశ్నేలేదని స్పష్టం చేశారు. డాలర్ మారకంలోభారత్ రూపాయి విలువ కుప్పకూలలేదని అది తన సహజ స్థాయిని కనుగొంటోందని ఆమె వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి సుబ్రమణియన్ వ్యంగ్యంగా స్పందించారు. దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లే ప్రసక్తే లేదు.. నిజమే, ఆమె సరిగ్గా చెప్పారు. ఎందుకంటే భారత ఆర్థిక వ్యవస్థ ఏడాది క్రితమే మాంద్యంలోకి జారుకుందంటూ ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. ఇక మాంద్యం లోకి జారుకోవడం అనే ప్రశ్న లేదంటూ విమర్శించారు. తద్వారా దేశ ఆర్థికపరిస్థితి, నిర్మలా సీతారామన్ ప్రకటనపై ట్వీట్ చేసి మోదీ సర్కార్‌పై వ్యంగ్య బాణాల్ని సంధించడమే కాదు, తీవ్ర చర్చకు తెర తీశారు. (ఆనంద్ మహీంద్ర వీడియో: నెటిజనుల కౌంటర్స్ మామూలుగా లేవు!) “No question of the Indian economy getting into recession” says Finance Minister according to media today. She is right!! Because Indian economy has already got into recession last year. So question of getting into recession does not arise. — Subramanian Swamy (@Swamy39) August 2, 2022 కాగా ద్రవ్యోల్బణంపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో ప్రకటన సందర్భంగా విపక్షాలపై తీవ్ర స్థాయిలో ఎదురుదాడి చేశారు. కోవిడ్ మహమ్మారి విసిరిన సవాళ్లు,సంక్షోభం ఉన్నప్పటికీ దేశం మంచి స్థితిలోనే ఉందని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్నా, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా భారత్ నిలుస్తోందని, అలాగే పరిస్థితులను నియంత్రించేందుకు రిజర్వు బ్యాంక్ చర్యలు చేపడుతోందని ఆమె తెలిపారు. ముఖ్యంగా అమెకా పరిస్థితిని ప్రస్తావిస్తూ, భారత్‌లో మాంద్యం వచ్చే ప్రశ్నే లేదని సీతారామన్ తెలిపిన సంగతి తెలిసిందే. (బ్లెస్సింగ్స్ అడిగిన కస్టమర్‌కు ఆనంద్ మహీంద్ర అదిరిపోయే రిప్లై) -
పొదుపు పెరిగేలా ఐటీ మినహాయింపులు
* ఆర్బీఐ గవర్నర్ రాజన్ సూచన * ద్రవ్యోల్బణం ఆందోళనకరమేనని వ్యాఖ్య ముంబై: ఆదాయపు పన్ను చెల్లించేవారికి సెక్షన్ 80సీ కింద లభించే పన్ను మినహాయింపు పరిమితిని రూ.1.5 లక్షల నుంచి మరింత పెంచాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. చాలా కాలం పాటు రూ. లక్ష వద్దే ఈ పరిమితి ఉందని, మన పొదుపు రేట్లు భారీగా పెరగకపోవడానికి ఇదీ ఒక కారణమని తెలియజేశారు. గత బడ్జెట్లో ఈ మొత్తాన్ని రూ.1.5 లక్షలు చేసినప్పటికీ ఆర్థిక పథకాల ద్వారా వ్యక్తులు మరింత ప్రయోజనం పొందడానికి ఈ మొత్తాన్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ద్రవ్య పరపతి విధాన సమీక్ష అనంతర సమావేశంలో రాజన్ ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 28న బడ్జెట్ రానుండటంతో రాజన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, న్యూ పెన్షన్ స్కీమ్, బీమా పాలసీలు, ఈక్విటీ అనుసంధాన పొదుపు పధకాలన్నీ 80సీ పరిధిలోకి వస్తాయి. వీటిలో రూ.1.50 లక్షల వరకూ పెట్టే పెట్టుబడులపై ఇపుడు ఐటీ మినహాయింపు ఉంది. 2008 ఆర్థిక సంవత్సరంలో 36.9 శాతంగా ఉన్న దేశ పొదుపు రేటు ప్రస్తుతం 30 శాతానికి పడిపోయిన విషయాన్ని రాజన్ ప్రస్తావించారు. మూలధన పెట్టుబడులు పెరగాలి... ఎటువంటి దుర్వినియోగం కాకుండా సబ్సిడీలను హేతుబద్దీకరించడంతోపాటు మూలధన పెట్టుబడులను పెంచడం ద్వారా ద్రవ్య స్థిరీకరణ జరగాలని ఆర్బీఐ కోరుకుంటున్నట్లు రాజన్ చెప్పారు. దీనివల్ల దేశానికి భారీ ఆర్థిక ప్రయోజనాలు ఒనగూరుతాయన్నారు. మూలధన పెట్టుబడుల పెంపు వల్ల సరఫరాల వైపు సమస్యలూ తగ్గుతాయని, ఇది ద్రవ్యోల్బణం కట్టడికి దోహదపడుతుందని విశ్లేషించారు. ద్రవ్యోల్బణంపై ఇంకా ఆందోళనలున్నాయని రాజన్ ఈ సందర్భంగా చెప్పారు. ప్రస్తుతానికి ద్రవ్యోల్బణం అత్యంత దిగువశ్రేణిలో ఉన్నప్పటికీ తిరిగి ఇవి పెరిగే అవకాశాలు లేకపోలేదని అన్నారు. 9వ తేదీ జీడీపీ గణాంకాలపై దృష్టి! భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలకు సంబంధించి... ఆ గణాంకాలను లెక్కించే పద్ధతుల ప్రాతిపదికన ఆర్బీఐ విధానం మారిపోదని రాజన్ వ్యాఖ్యానించారు. ఇటీవల బేస్ రేటు మార్పుతో (2004-05 నుంచి 2011-12గా) వెలువడిన జీడీపీ సవరింపు గణాంకాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థికాభివృద్ధికి సంబంధించి గాయాల బాధ తీవ్రత నుంచి మనం బైటపడ్డాం తప్ప, గాయాల నుంచి మాత్రం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్పీఏల సంక్షోభం రాదు.. మొండి బకాయిల వల్ల భారత బ్యాంకింగ్ వ్యవస్థలో ఎటువంటి సంక్షోభ పరిస్థితులూ తలెత్తవని రాజన్ చెప్పారు. ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయంటూ... పెట్టుబడుల విషయంలో ఆయా బ్యాంకులకు ప్రభుత్వ మద్దతు ఉన్నందువల్ల వ్యవస్థలో సంక్షోభ పరిస్థితి తలెత్తే అవకాశం ఉండబోదని ఓ ఇంటర్వ్యూలో వివరించారు.