
గతేడాది రిటైల్ ద్రవ్యోల్బణం బేస్ పాయింట్లు అధికంగా ఉన్నందునే తాజాగా విడుదలైన ద్రవ్యోల్బణ గణాంకాలు తగ్గినట్లు నమైదయ్యాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2023 జులై, ఆగస్టుల్లో రిటైల్ ద్రవ్యోల్బణం బేస్ వరుసగా 7.44 శాతం, 6.83 శాతంగా నమోదైంది. దాంతో పోలిస్తే ఇటీవల ద్రవ్యోల్బణం తగ్గుతున్నట్లు కనిపిస్తుందని చెబుతున్నారు.
2024 జులై, ఆగస్టులో ద్రవ్యోల్బణ గణాంకాలు ఐదేళ్ల కనిష్ట స్థాయిలో (వరుసగా 3.6 శాతం, 3.65 శాతం) నమోదయ్యాయి. కానీ ఇటీవల ఆర్‌బీఐ గవర్నర్ మాత్రం అందుకు అనుగుణంగా కీలక వడ్డీరేట్లను తగ్గింపుపై మొగ్గు చూపించడం లేదని తెలుస్తుంది. రేట్ల తగ్గింపు అంశంపై ఇటీవల స్పందించిన గవర్నర్ శక్తికాంతదాస్ రేటుకట్లపై తొందరపడబోమన్నారు. ఈ వ్యాఖ్యలు విశ్లేషకుల అంచనాలను సమర్థించినట్లయింది. రిటైల్ ద్రవ్యోల్బణం 2-4 శాతం వద్ద ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. ఆర్‌బీఐ కీలక ద్వైమాసిక ద్రవ్య, పరపతి విధానానికి ఈ సూచీనే ప్రాతిపదికగా ఉండనుంది.
ఇదీ చదవండి: సెబీ చీఫ్‌పై మరోసారి కాంగ్రెస్ ఆరోపణలు
రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా గడచిన తొమ్మిది ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశాల నుంచి ఆర్‌బీఐ బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలుచేసే రుణ రేటు– రెపో రేటును (ప్రస్తుతం 6.5 శాతం) యథాతథంగా కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణం కట్టడికి ప్రధానంగా ఆహార ద్రవ్యోల్బణమే అడ్డంకని గవర్నర్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. సరళతర వడ్డీరేట్ల విధానం కోరుతున్న ప్రభుత్వం రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల్లో ఆహార ధరలను మినహాయించాలని కూడా సూచిస్తోంది. అవసరమైతే పేదలకు ఫుడ్ కూపన్లను జారీ చేసే ప్రతిపాదనను ఆర్థిక సర్వే ప్రస్తావిస్తోంది. అక్టోబర్ 7 నుంచి 9 వరకూ తదుపరి పాలసీ సమీక్షా సమావేశం జరగనుంది. తాజా పరిణామాల నేపథ్యంలో రానున్న ఆర్‌బీఐ పాలసీ విధానంపై ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment