పాకిస్తాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడకముందే ద్రవ్యోల్బణం దడ పుట్టించడం మొదలుపెట్టింది. దేశంలోని తాత్కాలిక ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌తో పాటు దేశీయ వంటగ్యాస్ ధరలను మరోమారు పెంచింది. ద్రవ్యోల్బణం కారణంగా సామాన్య ప్రజల వెన్ను విరిగింది.
పాక్‌లో ధరల పెరుగుదల ప్రభావం దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. ఆదివారం కరాచీలో నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ పలువురు ఆందోళన చేపట్టారు. నానాటికీ దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థ తమను అప్పులపాలు చేస్తున్నదని ఆందోళనకారులు వాపోయారు.
ధరల పెరుగుదల పలు ఇబ్బందులను సృష్టిస్తున్నదని కరాచీలో దాబా నిర్వహిస్తున్న ఇర్ఫాన్ వాపోయారు. రాబోయే ప్రభుత్వం కూడా విఫలమవుతున్నట్లు కనిపిస్తోందని, గ్యాస్ బిల్లులు కట్టలేకపోతున్నామని తెలిపారు. గ్యాస్ ధరలు పెరగడంతో ప్రజలు నిత్యావసర వస్తువుల కొనుగోలు తగ్గించారని, ధరల నియంత్రణకు అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని ఆరోపించారు. గ్యాస్ సిలిండర్ ధర రూ. 12,500 (పీకేఆర్)కు చేరడంతో ఈ మొత్తాన్ని వాయిదాల్లో చెల్లిస్తున్నామని తెలిపారు. రోజుకు వెయ్యి రూపాయలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు.
రోజువారీ కూలీగా పనిచేస్తున్న అబిద్ మాట్లాడుతూ ‘నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. పాలు, చక్కెర, గోధుమలు, బియ్యం లాంటివి కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నాం. ఇంటి అద్దె కూడా కట్టలేక పోతున్నాం. రోజంతా కష్టపడితే కేవలం 900 పాకిస్తాన్ రూపాయలు సంపాదిస్తాను. దీంతో ఇంటి అద్దె నెలకు రూ. 7,500(పీకేఆర్) ఎలా చెల్లించాలని’ అబిద్ ప్రశ్నించారు. ఇంటి యజమానులు వంట కోసం కలపను వినియోగించడానికి అనుమతించకపోవడంతో, ఇప్పటికి కనీసం మూడు ఇళ్లు మార్చానని, వంట గ్యాస్ కొనలేక నానా ఇబ్బందులు పడుతున్నానని అబిద్ వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment