న్యూఢిల్లీ: లైటింగ్ పరిశ్రమలో అగ్రగామిగా అవతరించాలనే లక్ష్యంతో విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ లైటింగ్ ఉంది. 2024–25 నాటికి టాప్–3 కంపెనీల్లో ఒకటిగా అవతరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ద్రవ్యోల్బణం, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ డిమాండ్ క్షీణత తదితర సవాళ్లు ఉన్నప్పటికీ, తాము పరిశ్రమ సగటు కంటే వేగంగా వృద్ధిని సాధిస్తున్నట్టు తెలిపింది. విప్రో ఎంటర్‌ప్రైజెస్‌లో భాగమైన విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ లైటింగ్ ఏడాది క్రితమే గృహోపకరణాల విభాగంలోకి అడుగు పెట్టింది.
మధ్యస్థ ప్రీమియం శ్రేణిలో ఉత్పత్తులను విడుదల చేసింది. ప్రస్తుతం ఇవి ఆన్‌లైన్‌లో ఈ కామర్స్ చానళ్లపై లభిస్తున్నాయని, ఆఫ్‌లైన్‌లోనూ (భౌతిక దుకాణాఅల్లో) విక్రయించనున్నట్టు సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా తెలిపారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో విప్రో కన్జ్యూమర్ కేర్ రూ.1,000 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. డిమాండ్ వైపు సవాళ్లు ఉన్నప్పటికీ పరిశ్రమకంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేయగలమని గుప్తా తెలిపారు.
అందుకే టాప్–3లోకి చేరాలనే లక్ష్యాన్ని విధించుకున్నట్టు చెప్పారు. విప్రో లైటింగ్ వ్యాపారంలో 60 శాతం వాటా బీటూసీ నుంచి వస్తుంటే, 40 శాతం బీటూబీ నుంచి లభిస్తోందని.. ద్రవ్యోల్బణం, ఇతర అంశాల వల్ల గత ఏడాది కాలంలో బీటూసీ విభాగంలో వ్యాపారం నిదానించినట్టు తెలిపారు. కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కారణంగా బీటూబీ వ్యాపారం మంచి పనితీరు సాధిస్తున్నట్టు పేర్కొన్నారు. బీటూసీ అంటే నేరుగా కస్టమర్‌కు విక్రయించేవి. బీటూబీ అంటే వ్యాపార సంస్థలకు విక్రయించేవి.
గృహోపకరణాల విభాగంలో విస్తరణ
గృహోపకరణాల విభాగంలో తమకు మంచి ఫలితాలు కనిపిస్తున్నట్టు సంయజ్ గుప్తా వెల్లడించారు. ‘‘ప్రస్తుతం మేము పరీక్షించే దశలో ఉన్నాం. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర చానళ్లపై విక్రయిస్తున్నాం. గృహోపకరణాలు, లైటింగ్ ఉత్పత్తుల మధ్య పోలిక ఉంది. ఒకే రకమైన రిటైల్ చానళ్లలో వీటిని విక్రయిస్తుంటారు. దేశంలో లైటింగ్ ఉత్పత్తులు విక్రయించే చాలా మంది రిటైలర్లు గృహోపకరణాలను కూడా అమ్ముతుంటారు’’అని గుప్తా తమ మార్కెటింగ్ విధానాన్ని వివరించారు.
ఎలక్ట్రిక్ ఐరన్, ఎలక్ట్రిక్ కెట్టెల్, ఎగ్ బాయిలర్, పాపప్ టోస్టర్, శాండ్‌విచ్ మేకర్లు, ఇండక్షన్ కుక్‌టాప్స్, మిక్సర్ గ్రైండర్లను విప్రో ప్రస్తుతం విక్రయిస్తోంది. ఈ విభాగంలో టీటీకే ప్రెస్టీజ్, బజాజ్ ఎలక్ట్రికల్స్, ఫిలిప్స్ తదితర సంస్థలతో పోటీ పడుతోంది. వాటర్ గీజర్లు, కూలింగ్ ఉత్పత్తుల వంటి విభాగాల్లోకి ప్రవేశించే ప్రణాళిక ఉందా? అని ప్రశ్నించగా.. చిన్నపాటి గృహోపకణాలకే పరిమితం అవుతామని గుప్తా స్పష్టం చేశారు. చిన్న గృహోపకరణాల మార్కెట్ ఇంకా విస్తరించాల్సి ఉన్నందున వృద్ధికి అవకాశాలున్నట్టు తెలిపారు. బీటూసీ స్మార్ట్ లైటింగ్‌లో తాము మార్కెట్ లీడర్‌గా ఉన్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment