lighting industry
-
లైటింగ్ పరిశ్రమలో అగ్ర స్థానంపై విప్రో కన్ను
న్యూఢిల్లీ: లైటింగ్ పరిశ్రమలో అగ్రగామిగా అవతరించాలనే లక్ష్యంతో విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ లైటింగ్ ఉంది. 2024–25 నాటికి టాప్–3 కంపెనీల్లో ఒకటిగా అవతరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ద్రవ్యోల్బణం, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ డిమాండ్ క్షీణత తదితర సవాళ్లు ఉన్నప్పటికీ, తాము పరిశ్రమ సగటు కంటే వేగంగా వృద్ధిని సాధిస్తున్నట్టు తెలిపింది. విప్రో ఎంటర్‌ప్రైజెస్‌లో భాగమైన విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ లైటింగ్ ఏడాది క్రితమే గృహోపకరణాల విభాగంలోకి అడుగు పెట్టింది. మధ్యస్థ ప్రీమియం శ్రేణిలో ఉత్పత్తులను విడుదల చేసింది. ప్రస్తుతం ఇవి ఆన్లైన్లో ఈ కామర్స్ చానళ్లపై లభిస్తున్నాయని, ఆఫ్లైన్లోనూ (భౌతిక దుకాణాఅల్లో) విక్రయించనున్నట్టు సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా తెలిపారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో విప్రో కన్జ్యూమర్ కేర్ రూ.1,000 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. డిమాండ్ వైపు సవాళ్లు ఉన్నప్పటికీ పరిశ్రమకంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేయగలమని గుప్తా తెలిపారు. అందుకే టాప్–3లోకి చేరాలనే లక్ష్యాన్ని విధించుకున్నట్టు చెప్పారు. విప్రో లైటింగ్ వ్యాపారంలో 60 శాతం వాటా బీటూసీ నుంచి వస్తుంటే, 40 శాతం బీటూబీ నుంచి లభిస్తోందని.. ద్రవ్యోల్బణం, ఇతర అంశాల వల్ల గత ఏడాది కాలంలో బీటూసీ విభాగంలో వ్యాపారం నిదానించినట్టు తెలిపారు. కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కారణంగా బీటూబీ వ్యాపారం మంచి పనితీరు సాధిస్తున్నట్టు పేర్కొన్నారు. బీటూసీ అంటే నేరుగా కస్టమర్‌కు విక్రయించేవి. బీటూబీ అంటే వ్యాపార సంస్థలకు విక్రయించేవి. గృహోపకరణాల విభాగంలో విస్తరణ గృహోపకరణాల విభాగంలో తమకు మంచి ఫలితాలు కనిపిస్తున్నట్టు సంయజ్ గుప్తా వెల్లడించారు. ‘‘ప్రస్తుతం మేము పరీక్షించే దశలో ఉన్నాం. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర చానళ్లపై విక్రయిస్తున్నాం. గృహోపకరణాలు, లైటింగ్ ఉత్పత్తుల మధ్య పోలిక ఉంది. ఒకే రకమైన రిటైల్ చానళ్లలో వీటిని విక్రయిస్తుంటారు. దేశంలో లైటింగ్ ఉత్పత్తులు విక్రయించే చాలా మంది రిటైలర్లు గృహోపకరణాలను కూడా అమ్ముతుంటారు’’అని గుప్తా తమ మార్కెటింగ్ విధానాన్ని వివరించారు. ఎలక్ట్రిక్ ఐరన్, ఎలక్ట్రిక్ కెట్టెల్, ఎగ్ బాయిలర్, పాపప్ టోస్టర్, శాండ్విచ్ మేకర్లు, ఇండక్షన్ కుక్‌టాప్స్, మిక్సర్ గ్రైండర్లను విప్రో ప్రస్తుతం విక్రయిస్తోంది. ఈ విభాగంలో టీటీకే ప్రెస్టీజ్, బజాజ్ ఎలక్ట్రికల్స్, ఫిలిప్స్ తదితర సంస్థలతో పోటీ పడుతోంది. వాటర్ గీజర్లు, కూలింగ్ ఉత్పత్తుల వంటి విభాగాల్లోకి ప్రవేశించే ప్రణాళిక ఉందా? అని ప్రశ్నించగా.. చిన్నపాటి గృహోపకణాలకే పరిమితం అవుతామని గుప్తా స్పష్టం చేశారు. చిన్న గృహోపకరణాల మార్కెట్ ఇంకా విస్తరించాల్సి ఉన్నందున వృద్ధికి అవకాశాలున్నట్టు తెలిపారు. బీటూసీ స్మార్ట్ లైటింగ్‌లో తాము మార్కెట్ లీడర్‌గా ఉన్నట్టు చెప్పారు. -
ఫలించిన పరి‘శ్రమ’
మహేశ్వరం: దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా పరిశ్రమలు, కంపెనీల స్థాపనకు తెలంగాణ ప్రభుత్వం రాయితీలు, సౌకర్యాలు కల్పించి ప్రోత్సహిస్తోందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు చెప్పారు. కంపెనీలకు ఎలాంటి సమస్యలు లేకుండా కొనసాగితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని కేసీ తండాలో ఎలక్ట్రానిక్ పార్కులో విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ లైటింగ్ పరిశ్రమను మంత్రి సబితారెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 30 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్ల పెట్టుబడితో విప్రో కంపెనీ పరిశ్రమను స్థాపించిం దని చెప్పారు. ‘ఇక్కడ 90 శాతం మంది స్థానికు లకు ఉపాధి కల్పిస్తాం. అందులో 15 శాతం మహిళలకు కేటాయిస్తాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎస్–ఐపాస్ ద్వారా 2.20 లక్షల కోట్ల పెట్టుబడులకు అనుమతులు ఇచ్చాం. 16 లక్షల మందికిపైగా ఉపాధి కల్పించాం. విప్రో లాంటి పెద్ద కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడం అభినందనీయం’అని అన్నారు. శాంతి భద్రతలు బాగుంటేనే పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తారని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని చెప్పారు. విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ వినూత్నమైన వ్యాపారవేత్త అని కేటీఆర్ కొనియాడారు. ప్రేమ్‌జీ కరోనా సమయంలో ఆరోగ్య సంరక్షణకు రూ.25 కోట్లు, టీకా కోసం రూ.12 కోట్లు, స్వచ్ఛంద సేవా సంస్థలకు మరో రూ.44 కోట్లు ఇచ్చారని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనితారెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, రాష్ట్ర పరిశ్రమల ఎండీ నర్సింహారెడ్డి, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, విప్రో సీఈఓ వినీత్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. మహేశ్వరంలో మరిన్ని పరిశ్రమలు: సబితా మహేశ్వరం, రావిర్యాల, తుమ్మలూరు గేటు ప్రాం తాల్లో త్వరలో భారీ పరిశ్రమలు రానున్నాయని విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి చెప్పారు. మరిన్ని ఐటీ, ఎలక్ట్రానిక్, ఇతర పరిశ్రమల రాకతో ఈ ప్రాం తం రూపురేఖలు మారిపోతాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు భారత్ వైపు చూసినప్పుడు.. హైదరాబాద్ నగరం వారికి కనిపిస్తోందని చెప్పారు. హైదరా బాద్‌లో ఏర్పాటు చేసిన కంపెనీలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. కంపెనీ ఏర్పాటు చేసేందుకు స్థానికంగా సహకరించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి కేటీఆర్ కంపెనీని సందర్శించి కంపెనీలో తయారైన వస్తువుల తయారీని పరిశీలించి, అక్కడి ఉద్యోగులతో మాట్లాడారు. కంపెనీ ఆవరణలో మొక్కలు నాటారు. జీనోమ్ వ్యాలీలో ‘జాంప్ ఫార్మా’ మర్కూక్: సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం కర్కపట్లలోని జీనోమ్ వ్యాలీలో రూ.250 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన జాంప్ ఫార్మాను మంగళవారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. జీనోమ్ వ్యాలీ ఆకర్షణీయమైన పెట్టుబడులకు కేంద్రంగా మారిందన్నారు. ప్రపంచ వ్యాక్సిన్ ఉత్పత్తిలో 33శాతం హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయని పేర్కొన్నారు. జీనోమ్ వ్యాలీని మరింత విస్తృత పరిచేలా మరో 400ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. జాంప్ ఫార్మా గ్రూప్ సీనియర్ వైస్ చైర్మన్ సుకంద్ జునేజా మాట్లాడుతూ కెనడా తర్వాత జీనోమ్ వ్యాలీలోనే అతిపెద్ద జాంప్ ఫార్మాను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విప్రో కన్జ్యూమర్ కేర్‌ను ప్రారంభిస్తున్న విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, మంత్రులు కేటీఆర్, సబిత -
రూ.14 వేల కోట్లకు లైటింగ్ పరిశ్రమ..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో లైటింగ్ (విద్యుత్ దీపాలు) పరిశ్రమ పరిమాణం రూ.14 వేల కోట్లకు చేరుకుంది. వృద్ధి రేటు 15 శాతముందని ఇండియన్ సొసైటీ ఆఫ్ లైటింగ్ ఇంజనీర్స్(ఐఎస్ఎల్ఈ) తెలిపింది. మొత్తం పరిశ్రమలో దిగుమతుల వాటా రూ.5 వేల కోట్లని సొసైటీ రాష్ట్ర శాఖ చైర్మన్ డి.కృష్ణ శాస్త్రి తెలిపారు. ఐఎస్ఎల్ఈ రాష్ట్ర శాఖ ఆవిష్కరణ సందర్భంగా గురువారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్ఈడీ లైట్ల వ్యాపారం దేశంలో రూ.1,000 కోట్లుందని చెప్పారు. వృద్ధి రేటు అత్యధికంగా 150 శాతం ఉందని పేర్కొన్నారు. భవిష్యత్ ఎల్ఈడీదేనని వివరించారు. దేశంలో ఎల్ఈడీ లైటింగ్ తయారీని ప్రోత్సహించే విధానమేదీ లేకపోవడం పరిశ్రమకు నిరాశ కలిగిస్తోందని అన్నారు. రాష్ట్రంలో ఏర్పాటవుతున్న హార్డ్‌వేర్ పార్కుల్లో లైటింగ్ కంపెనీలకు చోటు ఇవ్వాలని ఆయన కోరారు. నేషనల్ లైటింగ్ కోడ్ అందుబాటులోకి వచ్చినా అమలు కావడం లేదని వ్యాఖ్యానించారు.