ప్రపంచ వడ్డీరేట్లపై రాజన్ హెచ్చరిక
ముంబై : తక్కువ వడ్డీరేట్లపై మొగ్గుచూపుతున్న ప్రపంచ దేశాలను ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ హెచ్చరించారు. తక్కువ వడ్డీరేట్లు ఆర్థిక సంస్కరణలకు ప్రత్యామ్నాయం కాదని చెప్పారు. తక్కువ వడ్డీరేట్ల విధానాలు పాటిస్తున్న అతిపెద్ద ఆర్థిక దేశాలు యూఎస్, యూరప్, జపాన్లు గ్లోబల్ ఎకానమీలో ఇంకా నిదానంగానే ఉన్నాయని న్యూయార్క్ టైమ్స్కు తెలిపారు. ఎక్కడైతే మానిటరీ పాలసీ తేలికగా ఉంటుందో అక్కడ తక్కువ వడ్డీరేట్లు అవలంభించాలో లేదో నచ్చినట్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు. తక్కువ వృద్ది రేటు చూడాల్సి వస్తుందనే ఆందోళనతో వడ్డీరేట్లు పెంచడానికి చాలా సెంట్రల్ బ్యాంకులు భయపడుతున్నాయని వ్యాఖ్యానించారు.
కానీ ఆర్థికాభివృద్దిని పుంజుకునేలా చేయడానికి పాలసీలో ఇతర మార్గాలపై దృష్టిసారించాల్సినవసరం ఎంతైనా ఉందన్నారు. ఆర్బీఐ గవర్నర్గా రాజన్ సెప్టెంబర్ 4న పదవీ విరమణ చేశారు. ఆయన తదుపరి గవర్నర్ బాధ్యతలను ఉర్జిత్ పటేల్ సోమవారం చేపట్టారు. రాజన్ ఆర్బీఐ పదవిలో కొనసాగినంత కాలం అధిక వడ్డీరేట్లను అవలంభించారనే విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ ఆ విధానాలే దేశంలో అధిక ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకురావడానికి, ఆర్థికాభివృద్ధి పరుగులు పెట్టడానికి దోహదం చేశాయని ఆర్థిక విశ్లేషకులు కొనియాడిన సంగతి తెలిసిందే.