మరణాల రేటు తక్కువ
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మరణాల రేటు తక్కువని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో వచ్చిన ఇతర వైరస్‌లతో పోలిస్తే ఈ వైరస్‌తో మరణాల రేటు అతి తక్కువగా ఉందని, కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. వైరస్ నియంత్రణకు ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందని తెలిపారు. కోవిడ్‌పై మంగళవారం మంత్రివర్గ ఉపసంఘం భేటీ జరిగింది. మంత్రులు ఎర్రబెల్లి, ఈటల ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోవిడ్‌పై ఏం చేయాలి, ఏం కావాలో చెప్పాలని అధికారులను కేటీఆర్ కోరారు. టోల్ ఫ్రీ నంబర్ పెద్దదిగా ఉందని, దాని స్థానంలో సులువుగా గుర్తుండే వాటిని ఏర్పాటు చేయాలని చెబుతూ ‘104’ను ఏర్పాటు చేసుకోవాలని కేటీఆర్ సూచించారు.
ప్రముఖులతో వీడియోలు..
ప్రస్తుతం కోవిడ్‌పై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను పోగొట్టేందుకు ప్రముఖులతో సందేశాలు ఇప్పించాలని సూచించారు. ఇప్పటికే ఉర్దూలో హోం మంత్రి మహముద్ అలీ, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాలతో వీడియో సందేశాలను రూపొందించామన్నారు. సినీ, క్రీడాకారులు, ఇతర రంగాల ప్రముఖులతో కోవిడ్‌పై అవగాహన వీడియోలు రూపొందించాలని ఆదేశించారు. హైదరాబాద్‌తో పాటు ఇతర చోట్ల ఉన్న హోర్డింగ్స్‌లో మెజారిటీ హోర్డింగ్స్ అన్నీ కూడా కోవిడ్ అవగాహనపైనే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
మెడికల్ కాలేజీల్లో ఐసోలేషన్..
అత్యవసర ఆరోగ్య పరిస్థితి వచ్చే అవకాశం ఉండటంతో హైదరాబాద్ పరిధిలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలనూ ఐసోలేషన్ కోసం వాడుకోవాలని కేటీఆర్ సూచించారు. ప్రస్తుత పరిస్థితిని మెడికల్ ఎమర్జెన్సీ కింద హ్యాండిల్ చేయాలని ఆదేశించారు. మాస్కుల వల్ల ఉపయోగం ఉండదని, దాన్ని ముక్కుకు తగిలించుకొని పదేపదే సరిజేసుకోవడం వల్ల చేతులకు ఎక్కువ కాంటాక్ట్ అవుతుందని, దాంతో ఇతరులకు త్వరగా సోకే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.