న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంక్‌కు మధ్య రగులుతున్న వివాదంపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పందించారు. రిజర్వ్ బ్యాంక్‌ను కారులోని సీటుబెల్ట్‌తో పోలుస్తూ... వాహనదారు (కేంద్రం) గానీ సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని హెచ్చరించారు.
ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని రిజర్వ్ బ్యాంక్ స్వయం ప్రతిపత్తిని కచ్చితంగా గౌరవించాల్సిందేనని, ఉదారంగా వ్యవహరించాలంటూ ప్రభుత్వం ఒకవేళ ఒత్తిడి తెచ్చినా నిరాకరించేందుకు దానికి పూర్తి స్వేచ్ఛ ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. దేశానికి కీలకమైన సంస్థను కాపాడటమే బోర్డు ప్రధాన లక్ష్యంగా ఉంటుంది తప్ప ఇతరుల ప్రయోజనాల కోసం పనిచేయడం కాదని ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవలి కాలంలో పలు అంశాలపై కేంద్రం, ఆర్‌బీఐకి మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. కేంద్రీయ బ్యాంకు స్వతంత్రతను గౌరవించకపోతే ప్రభుత్వం.. ఆర్థిక మార్కెట్లు ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందంటూ రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య ఇటీవల బహిరంగంగానే వ్యాఖ్యానించడంతో వివాదం మరింత ముదిరింది.
దీనికి ప్రతిగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్‌బీఐపై ప్రభుత్వం కీలకమైన ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్ 7ని ప్రయోగించినట్లు వార్తలు వచ్చాయి. వృద్ధికి ఊతమిచ్చే క్రమంలో బ్యాంకులు మళ్లీ రుణ కార్యకలాపాలు సజావుగా సాగించేలా కఠినమైన మొండిబాకీల కట్టడి నిబంధనలను సడలించడం తదితర అంశాలపై ఆర్‌బీఐకి సూచనలు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇలా కేంద్రం, ఆర్‌బీఐ మధ్య విభేదాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
సీట్ బెల్ట్ లేకుంటే ప్రమాదమే ..
‘ఆర్‌బీఐ అనేది ఒక సీట్ బెల్ట్ లాంటిది. డ్రైవింగ్ సీట్లో ఉండే డ్రైవర్.. అంటే ప్రభుత్వం ఒకోసారి సీట్ బెల్ట్ పెట్టుకోకపోవచ్చు. కానీ, దీన్ని పెట్టుకోకపోవడం వల్ల ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఒకోసారి ప్రమాదాలు చాలా తీవ్రంగానూ ఉండొచ్చు‘ అని రాజన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు ప్రధానంగా అధిక వృద్ధిపై దృష్టి పెడుతుంటాయని, ఆర్‌బీఐ మాత్రం ఆర్థిక స్థిరత్వానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుందని రాజన్ చెప్పారు. ఈ రెండింటి మధ్య పొంతన కుదరక సాధారణంగానే పలు సందర్భాల్లో ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య వివాదాలు రేగుతుంటాయని, తాజాగా కూడా అలాంటి పరిస్థితే తలెత్తిందని చెప్పారు.
‘మరింత ఉదారంగా వ్యవహరించేలా ఆర్‌బీఐపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తూనే ఉంటుంది. కానీ, ఆర్థిక స్థిరత్వానికి పొంచి ఉండే రిస్కులను కూడా ఆర్‌బీఐ నిశితంగా పరిశీలించాలి. ఆర్‌బీఐకి ఆర్థిక స్థిరత్వ సాధన అనేది ఒక బాధ్యత. కాబట్టి నో చెప్పే అధికారం కూడా ఉంటుంది. అలాగని ఆర్‌బీఐ ఏదో ఊసుపోక నో చెప్పదు. పరిస్థితులన్నింటినీ కూలంకషంగా పరిశీలించి ఆర్థిక అస్థిరతకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని భావించిన పక్షంలోనే తిరస్కరిస్తుంది. ప్రభుత్వం, ఆర్‌బీఐకి మధ్య ఇలాంటివి కొత్తేమీ కాదు. ప్రభుత్వం అనేక మార్లు దీన్ని పరిశీలించండి.. దాన్ని పరిగణనలోకి తీసుకోండి అంటూ ఆర్‌బీఐని కోరుతూనే ఉండొచ్చు.
కానీ అంతిమంగా ఆర్థిక స్థిరత్వ నియంత్రణ సంస్థగా ఆ బాధ్యతలు మీవే కాబట్టి, మీ నిర్ణయాన్ని గౌరవిస్తాం అంటూ ఏదో ఒక సందర్భంలో ప్రభుత్వమే ఒకింత వెనక్కి తగ్గొచ్చు‘ అని రాజన్ పేర్కొన్నారు. ‘డిప్యూటీ గవర్నర్లు, గవర్నర్లను నియమించుకున్నప్పుడు ప్రభుత్వం వారి మాట వినాలి. వారిని నియమించుకున్నదే అందుకు కదా. వారు మీకు సేఫ్టీ బెల్ట్ లాంటి వాళ్లు‘ అని రాజన్ చెప్పారు. నవంబర్ 19న ఆర్‌బీఐ బోర్డు సమావేశం కానుంది.
ద్రవ్యోల్బణం మెరుగు..
ఆర్థిక వ్యవస్థ స్థితిగతుల గురించి మాట్లాడుతూ.. ద్రవ్యోల్బణ పరిస్థితి చాలా మెరుగ్గానే ఉందని, ఇందుకు ప్రభుత్వం, ఆర్‌బీఐని అభినందించవచ్చని రాజన్ చెప్పారు. మిగతా దేశాలతో పోలిస్తే భారత వృద్ధి రేటు అత్యధికంగా ఉంటోందని, అయితే.. ఉద్యోగాల కల్పనపై మరింత కసరత్తు చేయాల్సి ఉందని ఆయన తెలిపారు.
‘ద్రవ్యలోటు విషయాన్ని తీసుకుంటే.. కేంద్ర ప్రభుత్వ లోటు తగ్గుతున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వాలది పెరుగుతోంది. గడిచిన మూడు, నాలుగేళ్లుగా స్థూలంగా ద్రవ్య లోటు పరిస్థితులు మెరుగవడం కన్నా.. మరింత దిగజారాయి‘ అని రాజన్ పేర్కొన్నారు. ఇక బలహీన ఎగుమతులు, భారీ ముడి చమురు ధరల కారణంగా కరెంటు అకౌంటు లోటు కూడా పెరుగుతోందని ఆయన చెప్పారు. చమురు రేట్లు ఇటీవల కాస్త తగ్గినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో క్రూడ్‌పరమైన రిస్కులను పక్కన పెట్టలేమన్నారు.
పరస్పరం గౌరవించుకోవాలి..
ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్ 7ని ప్రభుత్వం ప్రయోగించిందన్న అంశంపై స్పందిస్తూ.. రెండు పక్షాలు.. ఒకరి అభిప్రాయాలను మరొకరు పరస్పరం గౌరవించుకోవాలని రాజన్ చెప్పారు. ప్రభుత్వ అభిప్రాయాలను ఆర్‌బీఐ వింటూనే ఉంటుందని, కానీ అంతిమంగా తన బాధ్యతరీ త్యా జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ‘ఆర్‌బీఐ బోర్డు ప్రధాన లక్ష్యం సంస్థను పరిరక్షించడమే. ఇతరుల ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయడం కాదు.
ఆర్‌బీఐ ఒకవైపు సంస్థను పరిరక్షిస్తూనే మరోవైపు విస్తృతమైన, సముచితమైన సూచనలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి బోర్డు లక్ష్యం రాహుల్ ద్రావిడ్ తరహాలో వివేకవంతంగా, ఆలోచనాన్వితంగా వ్యవహరించేట్లు ఉండాలి. నవజోత్ సిద్ధూలా దూకుడుగా కాదు. (తప్పుగా అనుకోవద్దు.. సిద్ధూని నేను ఎంతగానో గౌరవిస్తాను)‘ అని రాజన్ పేర్కొన్నారు.
లిక్విడిటీ సమస్యలపై ఆర్‌బీఐ దృష్టి పెట్టాలి..
నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ) నిధుల కొరత సమస్యను ఎదుర్కొంటుండటంపై మాట్లాడుతూ.. లిక్విడిటీ అంశాన్ని రిజర్వ్ బ్యాంక్ మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని రాజన్ చెప్పారు. వ్యవస్థలో తగినంత ద్రవ్యలభ్యత ఉండేలా చూడటం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలన్నారు. ‘మార్కెట్లలో కొంత ఆందోళన నెలకొన్నట్లుగా కనిపిస్తోంది. అయితే, మొత్తం అసెట్స్‌లో ఎన్‌బీఎఫ్‌సీల వాటా 17 –18% మాత్రమే కనుక.. ఇది పరిష్కరించలేనంత పెద్ద సమస్యేమీ కాదని నా అభిప్రాయం.
కాకపోతే నిధుల కొరత, దివాలా సమస్యలను కాస్త జాగ్రత్తగా పరిశీలించి చూడాలి‘ అని రాజన్ పేర్కొన్నారు. ‘ఒకవేళ దివాలా పరిస్థితే ఉంటే.. ప్రైవేట్ నిర్వహణలో ఉన్న ఆయా సంస్థలు.. గట్టెక్కించాలంటూ వెంటనే ప్రభుత్వం దగ్గరకు పరిగెత్తుకెళ్లడం కాకుండా ముందు తమ సామర్ధ్యం మేరకు నిధులు సమకూర్చుకునే ప్రయత్నాలు చేయాలి. తను జోక్యం చేసుకోవాలా లేదా అని ప్రభుత్వం ఆలోచించడానికి ముందే.. తమంతట తామే సమస్య నుంచి బైటపడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామన్న భరోసా ఆయా సంస్థలు కల్పించగలగాలి‘ అని రాజన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment