ద్రవ్యోల్బణం మళ్లీ భయపెడుతోంది. సెప్టెంబరులో 8 నెలల గరిష్ఠ స్థాయికి చేరింది.
న్యూఢిల్లీ : ద్రవ్యోల్బణం మళ్లీ భయపెడుతోంది. సెప్టెంబరులో 8 నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. ఆగస్టులో 6.1 శాతంగా ఉన్న టోకు ధరల సూచీ సెప్టెంబరులో 6.46 శాతానికి పెరిగింది. మార్కెట్ అంచనాల కంటే ఎక్కువగా ద్రవ్యోల్బణం రికార్డయింది. ఒకవైపు ఇన్‌ఫ్లేషన్ పరుగులు తీస్తుంటే.. పారిశ్రామికోత్పత్తి తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఆగస్టు నెలలో ఐఐపీ 0.6 శాతంగా నమోదైంది. ధరలు భారీగా పెరుగుతూ వృద్ధిరేట్లు తగ్గిపోయే స్థితిని ఆర్థిక శాస్త్రంలో స్టాగ్‌ఫ్లేషన్ అంటారు.
ప్రస్తుతం మన దేశంలో ఇలాంటి స్థితే ఉందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి రిజర్వ్ బ్యాంకు మరోసారి వడ్డీరేట్లు పెంచే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. గత నెల 20న రెపోరేటు పెంచి షాకిచ్చిన ఆర్బీఐ కొత్త గవర్నర్ రఘురామ్ రాజన్.. ఈ నెలలో మరోసారి అలాగే చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.