ముంబై: గత నెలలో జరిగిన రెండో త్రైమాసిక ద్రవ్య పరపతి సమీక్షలో మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకే రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును పావు శాతం మేర పెంచింది. ద్రవ్యోల్బణం ఇంకా అధిక స్థాయిలోనే ఉన్నందున రెపో రేటును పెంచేందుకు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్)ని పావు శాతం తగ్గించేందుకు నలుగురు సభ్యులు మద్దతు తెలిపారు. ఆర్‌బీఐ గురువారం ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపింది. ఇద్దరు సభ్యులు మాత్రం రెపో రేటును పెంచితే.. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, ద్రవ్యోల్బణ తగ్గింపు చర్యలకు పెద్దగా ఉపయోగపడకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఒక సభ్యుడు మాత్రం ఆర్‌బీఐ వృద్ధికి ఊతమిచ్చే విధంగా రెపో రేటును పావు శాతం తగ్గించాలని పేర్కొన్నారు. అక్టోబర్ 23న ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ సారథ్యంలో సమీక్ష సమావేశం జరిగింది. ఇందులో ఆర్‌బీఐ డిప్యుటీ గవర్నర్లతో పాటు ఎక్స్‌టర్నల్ సభ్యులు కూడా పాల్గొన్నారు. బ్యాంకులు తీసుకునే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటుగా పరిగణిస్తారు.
మెజారిటీ అభిప్రాయం ప్రకారమే రెపో రేటు పెంపు
Published Fri, Nov 22 2013 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 12:50 AM
Advertisement