న్యూఢిల్లీ: ధరల ఒత్తిళ్లకు తగ్గట్టు భారత సెంట్రల్ బ్యాంకు తన విధానాన్ని మార్చుకోవాలని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో అంతర్జాతీయంగా సరఫరా చైన్‌లో ఏర్పడిన అవరోధాల ఫలితంగా ధరల ఒత్తిళ్లకు భారత్ సన్నద్ధం కావాలన్నారు. ద్రవ్యోల్బణం నియంత్రణలో వైఫల్యం అయితే అది ప్రభుత్వం, సెంట్రల్ బ్యాంకు లక్ష్యాలకు విఘాతమన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు ఆర్‌బీఐ కట్టుబడి ఉండాలన్నారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయిలో కట్టడి చేయాలని.. మరీ అయితే 2 శాతం అటూ, ఇటూగా ఉండొచ్చంటూ ఆర్‌బీఐకి కేంద్ర సర్కారు ఎప్పుడో నిర్ధేశించిన లక్ష్యాన్ని రాజన్ పరోక్షంగా ప్రస్తావించారు.
కరోనా సంక్షోభంలోనూ రేట్లను పెంచకుండా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంలో ఆర్‌బీఐ చక్కని పాత్రనే పోషించినట్టు చెప్పారు. ‘‘అన్ని సెంట్రల్ బ్యాంకుల మాదిరే మనం కూడా ముందుకు వచ్చి నూతన సవాళ్లను ఎదుర్కోవాల్సిందే. పాత విధానం ఇప్పటికీ పనిచేస్తుందా? అని ప్రశ్నించుకోవడంతోపాటు అవసరమైతే మార్పులు చేసుకోవాలి’’ అని రాజన్ పేర్కొన్నారు. ఆర్‌బీఐ ఎగువ పరిమితి స్థాయి 6 శాతాన్ని రిటైల్ ద్రవ్యోల్బణం జనవరి నెలలో మించిపోవడంతో రాజన్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుత ద్రవ్యోల్బణ మంటలు తాత్కాలికమేనా? అన్న ప్రశ్నకు రాజన్ బదులిస్తూ.. ఇప్పటికే గరిష్ట స్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణానికి తాజా ఒత్తిళ్లు అదనంగా పేర్కొన్నారు. యుద్ధ ప్రభావాలను కూడా కలిపి చూస్తే మరింతగా పెరిగిపోవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
వృద్ధిపై ఆందోళన..?
భారత్ వృద్ధి పథంపై ఆందోళనగా ఉన్నారా? అన్న ప్రశ్నకు.. ‘‘2014 తర్వాత నుంచి కనిష్ట చమురు ధరల వల్ల భారత్ లాభపడింది. కానీ ఇప్పుడు తిరిగి చెల్లించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మన వృద్ధి పనితీరు కొంత కాలంగా బలహీనంగా ఉందన్నది వాస్తవం. 2016 డీమోనిటైజేషన్ తర్వాత నుంచి బలమైన రికవరీ లేదు. ద్రవ్యోల్బణం, కరెంటు ఖాతాలోటు, ద్రవ్యలోటు అనే మూడు సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఎంతో జాగ్రత్తగా వీటిని నిర్వహించాల్సి ఉంటుంది’’ అని రాజన్ తన అభిప్రాయాలను వెల్లడించారు.
కీలక బ్యాంకింగ్ వివరాలను ఎవరికీ చెప్పొద్దు: ఆర్‌బీఐ
ముంబై: డిజిటల్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఓటీపీ, సీవీవీ నంబర్లు వంటి కీలకమైన గోప్యనీయ బ్యాంకింగ్ సమాచారాన్ని ఎవరికీ వెల్లడించరాదని రిజర్వ్ బ్యాంక్ హెచ్చరించింది. సైబర్ సెక్యూరిటీ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవా లని సూచించింది. ప్రజా ప్రయోజనార్థం ఆర్థిక మోసాల తీరుతెన్నులపై ’బి(ఎ)వేర్’ పేరిట రూపొందించిన బుక్‌లెట్‌లో ఈ విషయాలు వివరించింది. టెక్నాలజీ ఆధారిత ఆర్థిక సాధనాలతో అంతగా పరిచయం లేని సామాన్యులను మోసగించేందుకు నేరగాళ్లు కొంగొత్త పద్ధతులు ఉపయోగిస్తున్నారని పేర్కొంది. అపరిచితుల నుంచి వచ్చే అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయొద్దని సూచించింది.
ప్రజా ఫిర్యాదులను పరిష్కరించడానికి ఏ సంస్థకూ అధికారం ఇవ్వలేదు
కాగా, తన నియంత్రణలోని సంస్థలపై ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ఏ సంస్థకూ అధికారం ఇవ్వలేదని ఆర్‌బీఐ ప్రకటన ఒకటి స్పష్టం చేసింది. ఈ మేరకు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని పేర్కొంది. నియంత్రిత సంస్థలపై ఫిర్యాదులు, విచారణకు ఎటువంటి ఫీజులూ చెల్లించనక్కర్లేదని పేర్కొంది. జ్టి్టpట:// ఠీఠీఠీ.టbజీ.ౌటజ.జీn కంప్లైంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్‌ను (సీఎంఎస్) పోర్టల్ ప్రజా ఫిర్యాదులకు వినియోగించుకోవచ్చని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment