
న్యూఢిల్లీ: అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఘర్షణలతో రెండు విధాల నష్టపోవాల్సి ఉంటుందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. పరిస్థితి వేగంగా చేజారిపోతే అది ప్రపంచ వృద్ధికి విఘాతం కలిగిస్తుందన్నారు. అల్యూమినియం, ఉక్కు దిగుమతులపై ట్రంప్ సర్కారు భారీ టారిఫ్‌లు వేయడంతో ఆ దేశానికి చైనా, తదితర దేశాలతో వాణిజ్య వివాదానికి దారితీసిన విషయం విదితమే. ‘‘ఈ సమయంలో అతి పెద్ద రిస్క్... పెరిగిపోతున్న వడ్డీరేట్లతోపాటు వాణి జ్యంపై అవాంఛనీయ పరిస్థితులే.
వచ్చే కొన్ని నెలల్లో వాణిజ్య వివాదాలు దావానలంలా మారితే కచ్చితంగా అది ప్రపంచ ఆర్థిక రంగాన్ని దెబ్బతీస్తుంది. కీలకమైన ప్రశ్న ఏంటంటే... ఈ బేరసారాలు, టారిఫ్‌ల హెచ్చరికలు వాస్తవ చర్చలకు దారితీసి ఇరువురికీ లాభదాయకంగా మారతాయా అన్నదే? లేక ఎవరికి వారు తమ స్థాయిలకే పరిమితమై తలుపులు మూసేసుకుని, హెచ్చరికలనే కొనసాగిస్తే అది ఇరువైపులా నష్టపోవాల్సిన పరిస్థితికి దారితీస్తుంది’’ అని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రఘురామ్ రాజన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment