రాజన్ పై ముఖర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు
చెన్నై: భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ..మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరూర్ వైశ్యా బ్యాంక్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రసంగించిన ఆయన రాజన్ అనుసరించిన విధానాలను ప్రశంసించారు. బ్యాంకులకు పెరుగుతున్న మొండి బకాయిల సెగ మంచి పరిణామం కాదని పేర్కొన్న ప్రణబ్ బ్యాంకింగ్ వ్యవస్థను సరైన దిశలో నడిపించేందుకు రాజన్ తగిన చర్యలను తీసుకున్నారని ప్రశంసించారు. అందుకు రాజన్ చాలా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు.
వరుస సంక్షోభాలతో ప్రపంచ ఆర్థికవ్యవస్థ ప్రభావితమైందనీ, మొత్తంగా ప్రపంచంలో ప్రధాన ఆర్థిక వ్యవస్థల మొత్తం పనితీరు అంత ప్రకాశంగా, సంపన్నంగా లేదని చెప్పారు. అయితే ఈ సమయంలో దేశ ఆర్థికవ్యవస్థ, బ్యాంకింగ్ వ్యవస్థ లు సహేతుకంగా పని చేశాయని చెప్పారు . అలాగే అంతర్జాతీయంగా ప్రధాన ఆర్థిక వ్యవస్థలు, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ సంక్షోభంలో ఉండగా, భారత బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరంగా, దృఢముగా ఉండడంపై అందరూ తనను అడిగేవారన్నారు. ప్రాథమిక పునాదులు, దేశ స్థూల ఆర్థిక సూచీల బలంతో భారత ఆర్థిక వ్యవస్థ సహేతుకంగా, బాగా రాణించడం తనకు సంతోషాన్నిచ్చే అంశమని ప్రణబ్ వ్యాఖ్యానించారు.
కాగా ఆర్ బీఐ గవర్నర్ గా సెప్టెంబర్ 4న పదవీవిరమణ చేసిన రాజన్ పై మాజీ ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు విశేషంగా మారాయి.