ఆయనకు ముందే తెలిసిపోయిందా?
తనకు రెండోవిడత రిజర్వు బ్యాంకు గవర్నర్ పదవి దక్కకపోవచ్చని రఘురామ్ రాజన్‌కు ముందే తెలిసిపోయినట్లుంది. తాను మళ్లీ అధ్యాపక వృత్తిలోకి వచ్చి, పాఠాలు చెప్పుకొంటానని ఆయన వ్యాఖ్యానించడం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా తన పదవీకాలం సెప్టెంబర్ 4వ తేదీతో ముగుస్తుందని, ఆ తర్వాత మళ్లీ పాఠాలు చెప్పుకొంటానని ఆయన తన సహచరుల వద్ద వ్యాఖ్యానించారు. తన తర్వాత ఆ పదవి చేపట్టేవాళ్లు దేశాన్ని మరింత ఎత్తులకు తెస‍్తాడన్న నమ్మకం తనకుందని, మరో రెండు నెలలు అందరితో పనిచేస‍్తానని ఆయన అన్నారు.
దాంతో అసలు రాజన్‌కే ఆ పదవి రెండోసారి చేపట్టడం ఇష్టం లేదా, లేక మోదీ సర్కారు తనను కొనసాగించడానికి సముఖంగా లేదన్న విషయం ఏమైనా ఆయనకు తెలిసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజన్‌ను గవర్నర్‌గా కొనసాగించకూడదని, ఆయన అచ్చంగా అమెరికా మనిషని, ఆయన ఆలోచనలన్నీ అటువైపే ఉంటాయని బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది సుబ్రమణ్యం స్వామి ఎప్పటినుంచో చెబుతున్నారు. అయితే కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మాత్రం రాజన్‌ను కొనసాగించడానికి మొగ్గు చూపినట్లు కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాజన్ తాజా వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.