ద్రవ్యోల్బణం తక్కువా.. ఎలా? | Should focus on structural reforms, not get fixated with growth numbers | Sakshi
Sakshi News home page

ద్రవ్యోల్బణం తక్కువా.. ఎలా?

Published Mon, Jul 18 2016 1:09 AM | Last Updated on Tue, Sep 18 2018 8:19 PM

ద్రవ్యోల్బణం తక్కువా.. ఎలా? - Sakshi

ద్రవ్యోల్బణం తక్కువా.. ఎలా?

అధిక వడ్డీ రేట్ల విధానంపై విమర్శకులకు రాజన్ సవాల్
పరిస్థితులు మెరుగైతే వృద్ధి అంచనాల్లో మార్పులు
ప్రతీ గ్రామానికీ బ్యాంకు సాధ్యం కాదు
పోస్ట్ బ్యాంకు, మొబైల్ కంపెనీల రాకతో పరిస్థితులు మారతాయని ఆశాభావం 

ముంబై: అధిక వడ్డీ రేట్ల విధానంతో వృద్ధికి అడ్డుపడుతున్నారంటూ తనపై వస్తున్న విమర్శలను ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తిప్పికొట్టారు. తనను విమర్శించే వారు ముందుగా ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలోనే ఉందని చూపించాలంటూ సవాల్ చేశారు. అడ్డంకులున్నా దేశ జీడీపీ వృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మీ స్థానంలో గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టే వ్యక్తికి ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారన్న ప్రశ్నకు పరపతి విధానం (ఆగస్ట్ 9న) వరకు వేచి చూడాలని కోరారు. తన అనుభవాన్ని పుస్తక రూపంలో ఆవిష్కరించే ఆలోచన ప్రస్తుతానికి లేదని స్పష్టం చేశారు. పలు అంశాలపై రాజన్ మీడియా ప్రతినిధుల ముందు తన అభిప్రాయాలను ఆవిష్కరించారు.

 విమర్శకులకు సవాల్
వడ్డీ రేట్లను అధిక స్థాయిలో ఉంచుతున్నారని, వృద్ధికి అడ్డు పడుతున్నారన్న విమర్శలపై నేను దృష్టి పెట్టను. వరుసగా నాలుగో నెల జూన్‌లోనూ వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం పెరిగి 5.77 శాతానికి చేరుకున్న విషయం తెలిసిందే. మా పాలసీ రేటు 6.5 శాతంగానే ఉంది. ఈ అంశంపై జరిగే చర్చ ఆర్థిక ప్రాతిపదికన కాకుండా ఉండాలి’ అని అన్నారు. తనను విమర్శించే వారు... వడ్డీ రేట్లను తగ్గించేందుకు ద్రవ్యోల్బణం తక్కువగానే ఎలా ఉందో చెప్పాలని సవాల్ చేశారు. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 2 నుంచి 6 శాతం పరిధికే పరిమితం చేయాలన్నది ఆర్‌బీఐ లక్ష్యం. బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి సహా పలువురు ఇటీవలి కాలంలో రాజన్ విధానాలను తప్పుబట్టిన విషయం తెలిసిందే.

 వృద్ధి కోణం నుంచి...
‘ఆర్థిక రంగానికి సంబంధించి ప్రస్తుతమున్న సవాళ్లే కొంత కాలం పాటు కొనసాగుతాయి. ఆర్థిక పురోగతి తీరుపై ఎంతో నిరుత్సాహం నెలకొని ఉంది. కానీ, రెండేళ్ల వరుస కరువుతోపాటు అంతర్జాతీయంగా మందగమనం నెలకొని ఉంది. అలాగే, బ్రెగ్జిట్ వంటి పలు అంతర్జాతీయ పరిణామాలు సైతం ఎదురయ్యాయి. ఈ అడ్డంకులున్నా దేశీయ వృద్ధి మంచిగానే ఉంది. వర్షాలు తగినంత కురిస్తే వ్యవసాయ రంగం మెరుగుపడుతుంది. గ్రామీణ వినియోగం పెరగడం ద్వారా మొత్తం మీద ఆర్థిక రంగం ఊపందుకుంటుంది. కానీ, ఇవి అంచనాలే. వాస్తవంగా ఏం జరుగుతుందో చూడాలి’ అని రాజన్ వివరించారు. మంచి వర్షాలు కురిసి, అంతర్జాతీయ ఆర్థిక రంగం మెరుగుపడితే జీడీపీ 7.6 శాతంగా ఉంటుం దన్న తమ అంచనాల్లో మార్పు ఉంటుందన్నారు. వ్యవస్థాగత సంస్కరణల ప్రక్రియను వేగవంతం చేయాల్సి ఉందని చెప్పారు.

 బ్యాంకు శాఖలపై...
అందరికీ ఆర్థిక సేవల అందుబాటు (ఫైనాన్షియల్ ఇంక్లూజన్) గురించి రాజన్ మాట్లాడుతూ... ‘ప్రతీ గ్రామంలో బ్యాంకు శాఖ ఉండడం అన్నది సాధ్యం అయ్యేది కాదు. చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. కొన్ని బ్యాంకులు మొబైల్ బ్రాంచ్‌లను ప్రారంభిస్తున్నాయి. వాహన రూపంలో ఉండే ఈ బ్రాంచ్ గ్రామాలలో తిరుగుతూ ప్రతీ గ్రామంలో నిర్ధిష్ట సమయం మేరకు సేవలు అందిస్తుంది. అలాగే, చిన్న, సూక్ష్మ శాఖల ఏర్పాటు కూడా పరిశీలనలో ఉంది. పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు లెసైన్స్ జారీ చేశాం. మొబైల్ కంపెనీలు కూడా ఈ రంగంలోకి వస్తున్నాయి. ఓ మొబైల్ కంపెనీకి 1.5 లక్షల విక్రయ కేంద్రాలు ఉంటే వాటన్నింటి ద్వారా నగదు జమ, ఉపసంహరణకు అవకాశం ఏర్పడుతుంది. ఇది నిజంగా వ్యవస్థనే మార్చే పరిణామం. ఈ నెల చివరిలోపు రానున్న యూనివర్సల్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా నగదు బదిలీ సులభతరం కానుంది’ అని రాజన్ వివరించారు. 

 అనుభవాలపై పుస్తకం రాయను...
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా తన అనుభవాలకు అక్షర రూపం ఇచ్చే ఆలోచన ఇప్పటికైతే లేదని రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తాజాగా తన అనుభవాలను ‘హు మూవ్డ్ మై ఇంట్రెస్ట్ రేట్’ పేరుతో పుస్తక రూపంలోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో విలేకరుల ప్రశ్నకు రాజన్ స్పందించారు. గవర్నర్ గిరీ నుంచి తప్పకున్న తర్వాత విద్యా సంబంధింత అంశాలపై మాత్రం పుస్తకాలు రాస్తానని చెప్పారు.

బ్యాంకుల ఆందోళనలపై...
రుణాల విషయంలో దర్యాప్తు సంస్థల నుంచి తమకు రక్షణ కల్పించాలన్న బ్యాంకర్ల డిమాండ్‌ను రాజన్ సమర్థించలేదు. ఈ విషయంలో నిబంధనల మేరకు నడచుకోవడమే రక్షణాత్మక విధానంగా సూచించారు. ‘రుణాల విషయంలో తాము తీసుకున్న చర్యలకు బాధ్యులను చేయరాదంటూ బ్యాంకర్లు తమ ఆందోళనను వ్యక్తం చేశారు. అయితే, రుణాలు ఇచ్చే ముందు తగిన జాగ్రత్తలు, విధానాల మేరకు నడచుకోవాలి. లేకుంటే ప్రక్షాళన సాధ్యం కాదు. రుణాల జారీలో బాధ్యతాయుతంగా వ్యవహరించి సరైన నిర్ణయాలు తీసుకుంటే... చర్యలకు వారు బాధ్యులు కారు. కానీ, ఒక్కోసారి నిర్ణయాల్లో తప్పిదం జరుగుతోంది’ అని రాజన్ తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement