
గోరంతే చెప్పాలి.. కొండంత సాధించి చూపాలి
ఎప్పుడైనా సరే మన సామరŠాధ్యల గురించి తక్కువగానే చెప్పి, ఎక్కువగా సాధించి చూపాలని.. ఆ తర్వాతే గొప్పలు చెప్పుకోవాలని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు.
► చైనాతో పోటీలో భారత్ చేయాల్సిందిదే
► ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్
చెన్నై: ఎప్పుడైనా సరే మన సామరŠాధ్యల గురించి తక్కువగానే చెప్పి, ఎక్కువగా సాధించి చూపాలని.. ఆ తర్వాతే గొప్పలు చెప్పుకోవాలని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. వృద్ధి విషయంలో చైనా నుంచి ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎదుర్కొనడం కన్నా ఈ విధానాన్ని పాటించడమే శ్రేయస్కరమని ఆయన పేర్కొన్నారు. ఆర్‌బీఐ గవర్నర్‌గా తన అనుభవాలను కూర్చి రాసిన ‘ఐ డూ వాట్ ఐ డూ’ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రాజన్ ఈ విషయాలు చెప్పారు.
భారత్‌కి అపరిమితమైన సామర్ధ్యముందని, అయితే సాధించడానికి ముందుగానే గొప్పలు చెప్పుకుంటూ తిరగడం శ్రేయస్కరం కాదని ఆయన సూచించారు. ‘సాధించగలమన్న సత్తా మనలో ఉందని గట్టిగా విశ్వసిద్దాం. సాధించి చూపుదాం. ఆ తర్వాతే గొప్పలు చెప్పుకుందాం. అంతే తప్ప సాధించడానికన్నా ముందుగానే గొప్పలకు పోవద్దు‘ అని రాజన్ పేర్కొన్నారు. వరుసగా రెండో త్రైమాసికంలో భారత వృద్ధి చైనా కన్నా వెనుకబడి ఉండటంపై తన బీజింగ్ పర్యటనలో.. కొన్ని ఇబ్బందికర ప్రశ్నలు ఎదుర్కొన్నట్లు రాజన్ తెలిపారు.
ఇటీవలి వివాదం సంగతి ఎలా ఉన్నా భారత్ మెరుగ్గానే రాణిస్తోన్నప్పటికీ ప్రస్తుతం మాత్రం ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్నది చైనాయే కదా అన్న ప్రశ్నలు వచ్చాయన్నారు. మరోవైపు, డీమోనిటైజేషన్ మూల్యం చాలా భారీగానే ఉంటుందని ఆయన చెప్పారు. బ్యాంకింగ్ రంగంలో ఒత్తిడి పరిస్థితులు, డీమోనిటైజేషన్, జీఎస్‌టీ .. ఇవన్నీ కూడా దాదాపు ఏకకాలంలో ఉండటం వల్ల దేని ప్రభావం ఎంత మేర ఉంటుందనేది ఇథమిత్థంగా చెప్పలేకపోయినప్పటికీ.. విశ్లేషకులు అంచనా వేస్తున్నట్లుగా జీడీపీ వృద్ధిపై 1–2% ప్రతికూల ప్రభావం ఉండొచ్చని రాజన్ పేర్కొన్నారు.