భారత్‌ను మాల్దీవులు వదులుకోగలదా? | Sakshi Guest Column On Bharat And Maldives Relations | Sakshi
Sakshi News home page

భారత్‌ను మాల్దీవులు వదులుకోగలదా?

Published Fri, Oct 13 2023 4:19 AM | Last Updated on Fri, Oct 13 2023 4:19 AM

Sakshi Guest Column On Bharat And Maldives Relations

దక్షిణాసియాలో చిట్టచివరగా బ్రిటిష్‌ పాలకుల నుండి స్వాతంత్య్రం పొందిన దేశం మాల్దీవులు. 1965లో స్వతంత్ర దేశంగా అవతరించినప్పటి నుండి ఆర్థిక, శాస్త్రీయ–సాంకేతిక అభివృద్ధిలో, సముద్ర భద్రతా విషయాల్లో మాల్దీవులకు భారత్‌ చేయూత అందించింది. 1988లో ఆపరేషన్‌ కాక్టస్‌ ద్వారా ప్రభుత్వాన్ని తీవ్రవాదుల చెర నుండి కాపాడింది. అయినా కొన్నేళ్లుగా భారత్‌ ఆ దేశంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. రెండు మూడేళ్లుగా ఏకంగా ‘ఇండియా అవుట్‌’ ప్రచారానికి కేంద్రం అయింది. దీని వెనక ఐఎస్‌ఐ, చైనా ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. అలాగని అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతుకగా తన వాణిని బలంగా వినిపిస్తున్న భారత్‌ను దూరం చేసుకోవడం మాల్దీవులకు కూడా అంత తేలిక కాదు.


మాల్దీవుల్లో కొన్ని రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో భారత వ్యతిరేక రాజకీయాలు నెరిపిన మొహమ్మద్‌ ముయిజ్యూ సుమారు 54 శాతం ఓట్లతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికతో ఇరు దేశాల సంబంధాలు ఎలా వుండబోతున్నాయో అంచనా వేసే ముందు, భారత్‌ పట్ల వ్యతిరేకత పెరగడానికి కారణాలు ఏమిటో తెలుసుకోవాలి. 

మాల్దీవ్స్‌లో 12వ శతాబ్దంలో ఇస్లాం అడుగుపెట్టినప్పటికీ అది స్థానిక సంప్రదాయాలు, ఆచారాల సమ్మిళితంతో ఉదారవాదంగా ఉండేది. 1970ల్లో ఉదార మత విధానాలను అవలంబించిన మాల్దీ వులు, క్రమంగా గల్ఫ్‌ దేశాల ప్రభావానికి లోనయ్యింది. చమురు ఉత్పాదిత గల్ఫ్‌ దేశాలు అరబ్, ముస్లిం ప్రపంచంలో ముఖ్యమైన భూమికను పోషించడం మొదలుపెట్టాయి.

సున్నీ ముస్లిం వహాబీజం పాటించే గల్ఫ్‌ దేశాలు సంప్రదాయవాదాన్ని బలంగా ప్రచారం చేయడం, మొహమ్మద్‌ అబ్దుల్‌ గయూమ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం 1980, 90ల్లో ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవడానికి మతాన్ని అస్త్రంగా ఉపయోగించుకోవడం, గల్ఫ్‌ దేశాల నుండి వచ్చే చమురు, ఆర్థిక సహాయాన్ని పొందేందుకు సాంప్రదాయవాదాన్ని, ఇస్లామిక్‌ షరియా చట్టాల్ని ప్రవేశపెట్టడం వరుసగా జరిగాయి. ఆఫ్గనిస్తాన్‌ను సోవియట్‌ ఆక్రమించడంతో దానికి వ్యతిరేకంగా సంప్రదాయవాద వర్గాల ఏకీకరణ జరిగింది. 

ఇరవై ఒక్కటవ శతాబ్దం మొదట్లో జరిగిన ప్రపంచ పరిణామాల ప్రభావం మాల్దీవుల యువత మీద తీవ్రంగా పడింది. ఆ దేశంలోని చాలామంది యువత అల్‌–ఖాయిదాలో చేరినట్టుగా వార్తలు వచ్చాయి. 2007లో జరిగిన వరుస బాంబు పేలుళ్లు ప్రమాద ఘంటికలు మోగించాయి. 2008లో మాల్దీవులు ఏక పార్టీ వ్యవస్థ నుండి బహుళ పార్టీ వ్యవస్థగా రూపాంతరం చెందింది. మతపరమైన సాంప్రదాయ పార్టీలు ఏర్పాటు కావడానికీ, అవి మత రాజకీయాలు నెరప డానికీ ఇది దారి తీసింది. 2012లో షరియా చట్టాల అమలు కోసం అనేక ఉద్యమాలు ఈ పార్టీలు చేపట్టాయి.

చాలామంది యువత ‘ఐసిస్‌’లో చేరడానికి సిరియా వెళ్లినట్టు అంతర్జాతీయ నివేదికలు పేర్కొన్నాయి. ఇస్లామిక్‌ ఛాందసవాదాన్ని ఎగదోయడంలో, ముఖ్యంగా భారత్‌ పట్ల వ్యతిరేకతను పెంచడంలో పాకిస్తాన్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ పాత్ర చాలా ఉంది. 1990ల్లో జరిగిన ఇస్రో ‘హనీ ట్రాప్‌’ కేసులో మాల్దీవులకు చెందినవారు ఉన్నట్టుగా బయట పడటం ఆ దేశంలో వేళ్లూనుకున్న ఐఎస్‌ఐ పాత్రకు ఒక ఉదాహరణ మాత్రమే.

1978 నుండి 2008 వరకు సుమారు ముప్పయ్యేళ్లు మాల్దీవులను ఏకధాటిగా పాలించిన మౌమూన్‌ అబ్దుల్‌ గయూమ్, అయన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మాల్దీవియన్‌ డెమోక్రాటిక్‌ పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్‌ నషీద్, 2018లో అధ్యక్షుడిగా ఎన్నికైన ఇబ్రహీం సోలీహ్‌ భారత్‌ పట్ల సన్నిహిత సంబంధాలను కొనసాగించారు. కానీ 2013 నుండి 2018 మధ్యకాలంలో అధికారంలో ఉన్న అబ్దుల్లా యామీన్‌ ప్రభుత్వం భారత్‌ వ్యతిరేక విధానాలను అనుసరించింది. తాజాగా ఆయన వారసుడిగా మొహమ్మద్‌ ముయిజ్యూ భారత్‌ పట్ల అంతే తీవ్ర వ్యతిరేక ప్రచారాలతో ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధించారు. 

యామీన్‌ అధికారంలో ఉన్న ఐదేళ్లలో మాల్దీవ్స్‌లో చైనా కార్యకలాపాలు విపరీతంగా పెరిగాయి. 2014లో చైనీస్‌ బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌లో మాల్దీవ్స్‌ చేరడమే కాకుండా అనేక మౌలిక వసతుల నిర్మాణ బాధ్యతలను చైనీస్‌ కంపెనీలకు అప్పగించింది. మాలె, హుల్హులే, హుల్హుమాలే దీవులను కలిపే సినిమాలే బ్రిడ్జితో పాటు, వెలనా అంతర్జాతీయ విమానాశ్రయం, హుల్హులే ద్వీపంలోని నివాస సముదాయ నిర్మాణాలు, టూరిజం, ఎనర్జీ తదితర రంగాల్లో చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది.

మాల్దీవుల ఆర్థిక శాఖ అంచనా ప్రకారం, 2022 చివరికల్లా ఆ దేశ అప్పులు జీడీపీలో 110 శాతం. అందులో చైనా వాటా సుమారు 70 శాతం. ప్రతి సంవత్సరం చైనాకు చెల్లించే వడ్డీలు సుమారు 92 మిలియన్ల అమెరికన్‌ డాలర్లు. మాల్దీవుల వార్షిక బడ్జెట్‌లో ఇది సుమారు 10 శాతం. యామీన్‌ అధికారంలో ఉన్నప్పుడు చేసిన రాజ్యాంగ సవరణ ప్రకారం, విదేశీయులు ఆ దేశంలో స్థిరాస్తులు కొనుగోలు చేయవచ్చు.

దీని ఆసరాగా చైనీస్‌ కంపెనీలు ఫెయిదూ ఫింహులు ద్వీపాన్ని 50 ఏళ్ల కాలానికి లీజుకు తీసుకున్నాయి. ఈ లెక్కలు చైనా ప్రభావం మాల్దీవుల పైన ఎంతవుందో, చైనా అప్పుల ఊబిలో ఎంతగా చిక్కుకుందో తెలియజేస్తాయి. చైనా ఈ పరిస్థితులను భారత వ్యతిరేక శక్తులను పెంచడానికి ఉప యోగించుకుంది. చైనా అనుసరిస్తున్న వైఖరిని గ్రహించిన ఇబ్రహీం సోలీహ్‌ ప్రభుత్వం ‘ఇండియా ఫస్ట్‌’ విధానాన్ని పాటించింది.

అయితే భారత వ్యతిరేక శక్తులు ఒక క్రమ పద్ధతిలో ప్రచారాన్ని సాగించాయి. ఆ దేశంలో ఉన్న నిరుద్యోగానికి ముఖ్య కారణం, భారతీయులు టూరిజం తదితర రంగాల్లో ఉద్యోగాలు ఎగరేసుకు పోవడమేననీ, భారత్‌లో ముస్లింల పట్ల అణచివేతకు పాల్పడుతున్నా రనీ, భారత్‌ తన సైనిక కార్యక్రమాలు సాగిస్తూ మాల్దీవుల సార్వభౌ మత్వాన్ని ఉల్లంఘిస్తోందనీ, ఇబ్రహీం సోలీహ్‌ ప్రభుత్వం దేశ సంపదను భారత్‌కు ధారాదత్తం చేస్తోందనీ ఇలా అనేక రకాలుగా విష ప్రచారం చేశాయి. ఇదే రకమైన రాడికలైజేషన్, యువతలో భారత వ్యతిరేక భావజాల వ్యాప్తి బంగ్లాదేశ్‌లోనూ గమనించవచ్చు. ఈ ప్రచారం వెనక అటు ఐఎస్‌ఐ, ఇటు చైనా ఉన్నాయన్నది బహిరంగ రహస్యం.

ఈ పరిణామాల నేపథ్యంలో కొత్త ప్రభుత్వాన్ని భారత వ్యతిరేక కార్యక్రమాలు కొనసాగించకుండా చేయడం, విదేశాంగ విధానానికి ఒక సవాలు. ఇప్పటికే హిందూ మహాసముద్రంలో మయాన్మార్‌ నుండి జిబౌటి వరకు తన ఆర్థిక, సైనిక, వ్యూహాత్మక ప్రభావాన్ని విపరీతంగా పెంచుకున్న చైనాను కట్టడి చేయడం అంత తేలిక కాదు. భారత్, చైనా మధ్య ఈ ప్రాంతంలో నెలకొన్న పోటీలో మాల్దీవులు ముఖ్య భూమికను పోషిస్తాయి, 2013లో అమెరికా మాల్దీవులతో సైనిక ఒప్పందాలు చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలను, భారత్‌ అడ్డుకుంది.

దక్షిణాసియాలో ప్రాంతీయేతర శక్తుల ప్రభావాన్ని అడ్డు కోవడం భారత విదేశీ విధానంలో ముఖ్య భాగం. కానీ అది క్రమంగా మారడం గమనించవచ్చు. 2020లో కుదిరిన అమెరికా, మాల్దీవుల సైనిక ఒప్పందానికి భారత్‌ సానుకూలత వ్యక్తం చేసింది. మాల్దీవులకు సుమారు 1,800 కిలోమీటర్ల దూరంలో ఉన్న డిగో గరిసియ అమెరికా మిలిటరీ స్థావరాన్ని గతంలో వ్యతిరేకించిన భారత్‌ ప్రస్తుత పరిస్థి తుల్లో తన స్వరం మార్చింది. ఈ ఒప్పందాలు చైనా ప్రభావాన్ని నిలువరించడంలో సహాయపడతాయని భావిస్తోంది.

భారత వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడబోతున్నందుకు మరీ ఆందోళన చెందకుండా ఇదివరకే ఆ దేశంతో కుదిరిన అనేక ఒప్పందాలు, ముఖ్యంగా 500 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల విలువైన థిలమలే సముద్ర వంతెన ప్రాజెక్ట్, తాగునీరు పైపులైన్‌ ప్రాజెక్ట్, విద్య, అరోగ్య సేవల వసతుల నిర్మాణ ప్రాజెక్టులు, వివిధ ఇతర పనులకు సంబంధించిన దాదాపు 300 బిలియన్‌ డాలర్ల విలువైన ప్రాజెక్టులు కొనసా గించాలి.

ఇవి మాల్దీవులకు చాలా ముఖ్యమైనవి. ఇవి కొనసాగించేందుకు నూతన ప్రభుత్వాన్ని ఒప్పించడం, భారత వ్యతిరేక ప్రచారాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం తక్షణ కర్తవ్యాలు. అభివృద్ధి చెందు తున్న దేశాల గొంతుకగా తన వాణిని బలంగా వినిపిస్తున్న భారత్‌ను దూరం చేసుకోవడం మాల్దీవులకు కూడా అంత తేలిక కాదు. 

‘ఇండియా అవుట్‌’ ప్రచారం అక్కడి భారత సైనిక బలగాలకు వ్యతి రేకంగానో, భావోద్వేగ రాజకీయాల కోసమో తప్ప, పూర్తిగా భారత్‌ను ఆ దేశానికి దూరం చేయాలని కాదని మనం అనుకోవలసి ఉంటుంది.

డా‘‘ గద్దె ఓంప్రసాద్‌ 
వ్యాసకర్త అసోసియేట్‌ ప్రొఫెసర్, దక్షిణాసియా వ్యవహారాల అధ్యయన విభాగం, ఎస్‌ఐఎస్, జేఎన్‌యూ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement