
రాజన్ తర్వాత ఎవరు?
న్యూఢిల్లీ: త్వరలో ఆర్బీఐ గవర్నర్ బాధ్యతల నుంచి రఘురాం రాజన్ తప్పుకోనున్న నేపథ్యంలో ఆయన తర్వాత ఆ బాధ్యతలు ఎవరు చేపట్టనున్నారని విషయం ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. తనకు మరోసారి ఆర్బీఐ గవర్నర్ బాధ్యతలు చేపట్టే ఉద్దేశం లేదని, బోధనా రంగంలోకి వెళ్లాలనుకుంటున్నట్లు రాజన్ కూడా స్పష్టం చేసిన ఈ నేపథ్యంలో ఆ చర్చ మరింత వేడెక్కింది. అయితే, ఆ బాధ్యతలు అప్పగించే విషయంలో ప్రభుత్వం వద్ద పెద్ద జాబితానే ఉందంట.
ముఖ్యంగా ఏడుగురు వ్యక్తులతో తదుపరి ఆర్బీఐ గవర్నర్ కోసం జాబితా సిద్ధం చేసినట్లు అధికార వర్గాల సమాచారం. అందులో ముఖ్యంగా విజయ్ కేల్కర్, రాకేశ్ మోహన్, అశోక్ లాహిరి, ఉర్జిత్ పటేల్, అరుంధతి భట్టాచార్య, సుబిర్ గోఖర్న్, అశోక్ చావ్లా పేర్లు ఈ పదవి కోసం సిద్ధం చేసినట్లు వినికిడి. అయితే, తొలిసారి ఆర్బీఐ గవర్నర్ పదవిని ఒక మహిళకు అందించాలని, ఆ నేపథ్యంలోనే అరుధతి భట్టాచార్యకు ఆ బాధ్యతలు అప్పగిస్తారని చర్చలు ఊపందుకున్నాయి. ఈ ఊహాగానాలకు తెరపడేందుకు మరికొద్ది రోజులు ఆగాల్సిందే.