నేడు ఆర్బీఐ ద్రవ్య, పరపతి సమీక్ష
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మంగళవారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొట్టమొదటి ద్వైమాసికద్రవ్య, పరపతి విధాన సమీక్ష జరపనుంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు- రెపో ప్రస్తుతం 6.5 శాతం ఉండగా, ఈ రేటును గవర్నర్ రఘురామ్ రాజన్ తక్షణం తగ్గించకపోవచ్చని మెజారిటీ అంచనా. అయితే ఆగస్టులో పావుశాతం కోత ఉంటుందన్నదీ ప్రస్తుతం మెజారిటీ అభిప్రాయంగా ఉంది. అయితే యస్ బ్యాంక్ ఎండీ రాణా కపూర్ మాత్రం జూన్ 7న పావుశాతం రేటు కోత ఉండొచ్చన్నారు. తక్కువ స్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణం, వర్షపాతంపై తగిన సానుకూల అంచనాలు వంటివి ఇందుకు రాణా కారణంగా చూపారు.
రుణాలకు సంబంధించి ముఖ్యమైన సీజన్ నేపథ్యంలో ఆగస్టులో కూడా పావుశాతం కోత ఉండవచ్చనీ ఆయన పేర్కొంటున్నారు. సెప్టెంబర్ 2013న ఆర్‌బీఐ గవర్నర్‌గా మూడేళ్ల బాధ్యతలు చేపట్టిన తర్వాత క్రమంగా రుణ బెంచ్‌మార్క్ రేటు- రెపో రేటును 7.25 శాతం నుంచి 8 శాతానికి పెంచారు. అటుతర్వాత ఆర్థికశాఖ, పరిశ్రమల నుంచి వచ్చిన ఒత్తిడులు, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో క్రమంగా రెపో రేటును 1.50 శాతం తగ్గించారు. దీనితో ఈ రేటు ప్రస్తుతం 6.5 శాతానికి దిగివచ్చింది. అమెరికా సెంట్రల్ బ్యాంక్- ఫెడ్ ఫండ్ రేటుపై ఈ నెల 15-16 తేదీల్లో నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఆర్‌బీఐ తాజా సమీక్ష జరుగుతుండటం విశేషం.