గ్రీన్ కార్డ్ రెన్యువల్ చేయించుకునే పనిలో ఉన్నారు!
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సీనియర్ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు సుబ్రమణ్య స్వామి మరోసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్పై మండిపడ్డారు. చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు అధిక వడ్డీ రేట్లను అమలు చేసి వృద్థి రేటును అడ్డుకున్న రాజన్ ఎట్టిపరిస్థితుల్లోనూ ఆర్బీఐ అత్యున్నత పదవిలో ఉండటానికి అర్హుడు కాదన్నారు.
ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి రెండోసారి లేఖ రాశారు. అవసరం లేకపోయినా అధిక వడ్డీ రేట్లను దీర్ఘ కాలం అమల్లో ఉంచి దేశ వ్యతిరేక విధానాలకు తెరలేపిన రాజన్ ను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రాజన్ మానసికంగా పూర్తి భారతీయుడు కాని కారణంగానే దేశ ఆర్ధికాభివృద్ధి వేగాన్ని అడ్డుకున్నారన్నారు. ప్రస్తుతం గ్రీన్ కార్డ్ను రెన్యూవల్ చేయించుకునే పనిలో ఉన్న రాజన్ తరచు అమెరికా పర్యటనలు కొనసాగిస్తున్నారని సుబ్రమణ్య స్వామి విమర్శించారు.