మోదీ చూపు.. రాజన్ వైపు!
ఆర్‌బీఐ గవర్నర్‌గా కొనసాగింపు ఖాయమంటూ విశ్లేషణలు...
న్యూఢిల్లీ: అది 2014 సంవత్సరం. బ్యాంకులకు తానిచ్చే రుణ రేటు అయిన రెపో రేటును తగ్గించడానికి, తద్వారా దిగువస్థాయికి వడ్డీ రేటు వ్యవస్థను తీసుకురావడానికి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా రాజన్ ససేమిరా అంటున్న రోజులవి. ఇందుకు రాజన్ చూపుతున్న కారణం... ‘ద్రవ్యోల్బణం.’ వడ్డీరేట్లను తగ్గించి వ్యవస్థలో వృద్ధి రేటు పెంపునకు కృషి చేయాల్సిన తరుణమంటూ ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిడికి ఆయన ససేమిరా అంటున్న తీరును ఆర్థికశాఖలోని కొందరు సీనియర్ అధికారులే అప్పట్లో తీవ్రంగా తప్పుపట్టేవారు. తమ కోపాన్ని ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించిన సమావేశంలోనే వారు బహిరంగంగా వెల్లడించారు.
అయితే వారి కోపాన్ని మోదీ సముదాయించారు. సెంట్రల్ బ్యాంక్ ప్రతిష్టకు భంగం కలిగేట్టు బహిరంగ ప్రకటనలు చేయరాదనీ సూచించారు. ఈ సంఘటన తర్వాత క్రమంగా మోదీ-రాజన్ మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అప్పట్నుంచి ఆర్థిక వ్యవస్థకు సంబంధించి వారివురూ కలిసి పనిచేస్తూవస్తున్నారు. నిజానికి రాజన్ లాంటి అంతర్జాతీయ ప్రముఖ ఆర్థికవేత్త ఆర్‌బీఐ గవర్నర్‌గా... తన హయాంలో పనిచేయడాన్ని మోదీ గొప్పగా భావించే వరకూ పరిస్థితి మారిపోయింది. రాయిటర్స్ వార్తా సంస్థతో ఉన్నతాధికారి ఒకరు ఈ వివరాల్ని పంచుకున్నారు. ఈ అంశాల నేపథ్యంలో రాజన్ పదవీకాలాన్ని మోదీ పొడిగించడానికే మొగ్గుతారని తాజా వార్తా కథనం సారాంశం.
సన్నిహిత సహకారం...
ప్రతి విషయాన్నీ మోదీతో రాజన్ చర్చించేవారనీ, ఇందుకు ఆయన తరచూ న్యూఢిల్లీ వచ్చేవారనీ, అయితే ఈ సమావేశాల గురించి పెద్దగా బయటకు తెలిసేదికాదని, ఈ పరిణామాన్ని గమనిస్తున్న సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా... రాజన్‌కు కాలేజ్ ఫ్రెండ్ అన్న విషయమూ ఇక్కడ గమనార్హం. మొండిబకాయిలతో సతమతమవుతున్న బ్యాంకుల్ని... ఈ సమస్య నుంచి గట్టెక్కించడంలో సహాయపడ్డానికి, సూచనలు చేయడానికి రాజన్‌కు మరోసారి తిరిగి అవకాశం లభించడం ఖాయమని కూడా సన్నిహిత వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఇటీవల ప్రధాని కార్యాలయం ఆర్థికశాఖ అధికారులకు ఒక స్పష్టమైన సూచనచేస్తూ... ప్రభుత్వం-ఆర్‌బీఐ మధ్య ఏకాభిప్రాయం మేరకే విధాన నిర్ణయాలు ఉండాలని నిర్దేశించినట్లు సమాచారం. స్వయంగా కొందరు బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారం సైతం మోదీ నిర్ణయంపై ప్రభావం చూపదని వారు విశ్లేషిస్తున్నారు. రాజన్ పునర్‌నియామకంపై మోదీ మాట్లాడుతూ, దీనిపై నిర్ణయం సెప్టెంబర్‌లోనే ఉంటుందని స్పష్టంచేశారు.
మళ్లీ తథ్యం: మయారామ్
రాజన్‌తో కలసి పనిచేసిన భారత ఆర్థికశాఖ కార్యదర్శి అరవింద్ మయారామ్ ఈ విషయమై మాట్లాడుతూ, ‘‘రాజన్‌కు ఆర్‌బీఐ గవ ర్నర్‌గా మరో దఫా అవకాశం ఉంటుంది. దీన్ని రాజన్ కూడా ఆమోదిస్తారు. భారత్ రాజకీయ ఆర్థిక వ్యవస్థ పట్ల ఆయనకు మంచి పట్టు ఉంది’’ అని అన్నారు. ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్‌గా పనిచేసిన రాజన్‌కు... అంతర్జాతీయ ఆర్థికాంశాలపై విశేష అవగాహన ఉంది. 2008 ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే ఊహించిన ఘనత ఆయనకు సొంతం.
సెకండ్ ఇన్నింగ్స్‌కు విముఖత?
రాజన్ సన్నిహితులను ఉటంకిస్తూ.. బెంగాలీ డెయిలీ కథనం..
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ సన్నిహితులను ఉటంకిస్తూ... కీలక అంశం మీడియాలో వెల్లడయ్యింది. దీని ప్రకారం సెప్టెంబర్ 4 తరువాత రెండవదఫా బాధ్యతల పొడిగింపును తాను కోరుకోవడం లేదని రాజన్ కేంద్రానికి స్పష్టం చేశారు. ప్రముఖ బెంగాలీ డెయిలీ ‘ఆనందబజార్ పత్రిక’ రాజన్ సన్నిహితులను ఉటంకిస్తూ... ఈ మేరకు వార్త రాసింది. ‘‘నా బాధ్యతలు పూర్తయిన తర్వాత అమెరికా వెళ్లిపోతాను’ అని రాజన్ పేర్కొన్నట్లు బెంగాలీ పత్రిక పేర్కొంది. అమెరికా యూనివర్సిటీలో చేరి భారత్ ఆర్థిక వ్యవస్థపై పరిశోధన చేయాలని రాజన్ భావిస్తున్నట్లు కూడా తెలిపింది. అయితే రాజన్‌ను రెండవ దఫా బాధ్యతల్లో కొనసాగించాలని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నట్లు కూడా పత్రిక పేర్కొనడం గమనార్హం.
స్వామి ఆరోపణలకు విలువ లేదు!
‘చేయాల్సింది చాలా ఉంది.’ అంటూ రెండవ విడత బాధ్యతల్లో కొనసాగడానికి గతంలో రాజన్ సానుకూల సంకేతాలు ఇవ్వడం.. అలా జరగడానికి వీల్లేదంటూ బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యస్వామి వ్యక్తిగత విమర్శలు.. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఖండన, అసలు ఈ అంశంపై మీడియా ఉత్సుకత తగదని ప్రధానమంత్రి సూచన వంటి అంశాల నేపథ్యంలో రాజన్ సన్నిహితులను ఉటంకిస్తూ వచ్చిన వార్తలకు ప్రాధాన్యత ఏర్పడింది. 2013 సెప్టెంబర్‌లో బాధ్యతలు చేపట్టిన రాజన్ మూడేళ్ల పదవీ కాలం సెప్టెంబర్ మొదటివారంలో ముగియనుంది. కాగా స్వామి ఆరోపణలను పలువురు బీజేపీ నాయకులే ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా రాజన్ కొనసాగింపునకే మద్దతు నిస్తున్నట్లు డెయిలీ పేర్కొంది. కనీసం రెండేళ్లు ఆయన పదవీకాలాన్ని పొడిగించాలని మోదీ భావిస్తున్నట్లు తెలిపింది. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మద్దతు కూడా ఆయనకు ఉందని, ఈ మేరకు ఆయన ప్రధానికి తన అభిప్రాయాన్ని తెలిపారని వెల్లడించింది. రాజన్‌ను కొనసాగించకపోతే... ప్రపంచ వ్యాప్తంగా తప్పుడు సందేశాన్ని పంపినట్లవుతుందని కూడా ఆర్థికమంత్రి భావిస్తున్నట్లు తెలిపింది. పలువురు పారిశ్రామికవేత్తలు సైతం రాజన్‌కు ఇప్పటికే మద్దతు ప్రకటించారు.
రూపాయిపై ‘రాజన్’ ఎఫెక్ట్!
ముంబై: ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ (ఫారెక్స్)లో డాలరుతో రూపాయి మారకపు విలువ వరుసగా మూడవరోజూ పడింది. మంగళవారం ముగింపుతో పోల్చితే 19 పైసలు నష్టపోయి 67.45 వద్ద ముగిసింది. డాలర్ బలపడ్డం.. క్యాపిటల్ అవుట్‌ఫ్లోస్ దీనికి కొన్ని కారణాలుకాగా, రెండవసారి బాధ్యతలు చేపట్టడానికి ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ నిరాకరిస్తున్నారన్న వార్తలు సైతం ఫారెక్స్ ట్రేడింగ్‌పై ప్రభావం చూపినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.