హోదా ఎక్కువ.. జీతం తక్కువ
బ్యాంకుల్లో కింది వారికే ఎక్కువ జీతాలు
ఉన్నత స్థాయి ఉద్యోగులకు తక్కువే
♦ నాకు కూడా తక్కువే ఇస్తున్నారు
♦ ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యలు
♦ వేతన విధానం మారాలని సూచన
♦ లేకుంటే ప్రతిభావంతులను ఆకర్షించడం కష్టమని వ్యాఖ్య
♦ పీఎస్‌బీల్లో ప్రభుత్వ జోక్యం తగ్గాలని అభిప్రాయం
ముంబై: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో (పీఎస్‌బీలు) వేతన విధానం సరిగా లేదని రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. జీతాలైతే ఉన్నత స్థాయిలో ఉన్న వారికి తక్కువగాను, దిగువన ఉన్న వారికి ఎక్కువగాను ఉన్నాయన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోకి ప్రతిభ గల వారిని ఆకర్షించేందుకు ఇదే పెద్ద ప్రతిబంధకమని ఆయన అభివర్ణించారు. అలాగే, మౌలికరంగ ప్రాజెక్టులకు రుణాలను విస్మరించరాదని సూచించారు. ఫిక్కీ, బ్యాంకుల ఆధ్వర్యంలో ముంబైలో మంగళవారం జరిగిన జాతీయ బ్యాంకర్ల సదస్సులో రాజన్ పలు అంశాలపై తనదైన శైలిలో సూటిగా మాట్లాడారు.
ఇలా అయితే ఎలా...?
‘పీఎస్‌బీలలో దిగువ స్థాయిలో అధిక వేతనాలు చెల్లించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఉన్నత స్థాయిలో వారికి మాత్రం వేతనాలు తక్కువగా ఉన్నాయి. ఎంతో మంది ప్రజల కోసం ఈ ఉద్యోగం చేస్తున్నామని మీరు భావించాలి. కానీ, దీనివల్ల అత్యున్నత నైపుణ్యం ఉన్నవారిని ఆకర్షించడం కష్టం’ అని రాజన్ అన్నారు. ‘నాక్కూడా తక్కువగానే వేతనం ఇస్తున్నారంటూ’ ఆయన చమత్కరించారు. పీఎస్‌బీల షేర్ల ధరలు తక్కువగా ఉన్నందున దాన్నో అవకాశంగా భావించి ఉద్యోగులకు ప్రైవేటు రంగం మాదిరి షేర్లను (ఈ సాప్స్) కేటాయించాలని సూచించారు. ఇచ్చేది కొద్ది మొత్తమైనా అది వారికి ఎంతో ప్రేరణ ఇచ్చి పనితీరు మెరుగుపరచడం ద్వారా బ్యాంకుల విలువను భారీగా పెంచుతుందన్నారు.
అదే సమయంలో దిగువ స్థాయిలో మంచి వేతన స్కేళ్లు ఉండడం కూడా ఓ మంచి అవకాశంగా పేర్కొన్నారు. ‘మూడో తరగతిలో ఇంజనీర్లు, ఎంబీఏ అర్హతులున్న వారిని ఉద్యోగులుగా పొందుతున్నాం. మీరున్నది గుమస్తా ఉద్యోగానికి కాదు. మరింత విలువ సృష్టించడానికి... అని వారికి సూచించడం ద్వారా అవకాశాలను విస్తరించుకోవడంపై దృష్టి పెట్టాలి’ అని బ్యాంకర్లకు రాజన్ సూచించారు. ఈ రంగం మొత్తానికి ఒకే వేతన విధానం కాకుండా భిన్న విధానాలను అమలు చేయాలని సూచించారు. కాగా, రఘురామ్ రాజన్ 2015 జూలైలో రూ.1,98,700 వేతనంగా అందుకున్నారు. ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య 2015-16లో పొందిన వేతనం రూ.31.1 లక్షలు. ప్రైవేటు రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఎండీ ఆదిత్యపురి అందుకున్న వేతనం మాత్రం రూ.9.7 కోట్లు.
మౌలికరంగ రుణాలూ ముఖ్యమే
పీఎస్‌బీలు మౌలికరంగ ప్రాజెక్టుల రుణాలు ఇవ్వకపోవడంపై రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. తక్కువ వ్యయం గల కాసా (కరెంట్, సేవింగ్స్ ఖాతా) డిపాజిట్లను పెంచుకోవడం ద్వారా బ్యాంకులు మౌలికరంగ ప్రాజెక్టులకు రుణాలు అందించాలని సూచించారు. మౌలిక రంగం వైపు నుంచి అధిక మొత్తంలో ఎన్‌పీఏల సమస్య ఉన్న విషయాన్ని పేర్కొంటూ... ఈ విషయంలో నిర్వహణ పనితీరును మెరుగుపరుచుకుని, సరైన మూలధన నిర్మాణంపై దృష్టి పెట్టాలని సూచించారు. రిటైల్ రుణాలపై కూడా రిస్క్ ఉంటుందని... కొంత కాలానికి అది బయటకు వస్తుందన్నారు.
పీఎస్‌బీల్లో ఉన్నత స్థాయి నియామకాల్లో ప్రభుత్వ పాత్ర తగ్గాలని, పాలనాపరమైన నిర్ణయాలను స్వేచ్ఛగా తీసుకునేలా బ్యాంకు బోర్డులను బలోపేతం చేయాలని రాజన్ సూచించారు. పీఎస్‌బీల బోర్డుల నుంచి ఆర్‌బీఐ తన ప్రతినిధులను సైతం ఉపసంహరించుని నియంత్రణ పాత్రకే పరిమితం కావాలని అభిప్రాయపడ్డారు. బ్యాంకుల్లో ఉన్నత స్థాయి ఉద్యోగులను నియమించే అధికారం బ్యాంకు బోర్డు బ్యూరోలకే కల్పించాలన్నారు. సైబర్ నేరాలు పెరిగిపోయిన దృష్ట్యా బ్యాంకులు తమ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని సూచించారు.
ఆన్‌లైన్ పరీక్షలు ఓ మార్గం
బ్యాంకులు కొన్ని క్యాంపస్‌లలో రిక్రూట్‌మెంట్లు నిర్వహించకుండా కోర్టు తీర్పులు అడ్డుపడుతున్నందున... ఈ విషయమై బ్యాంకులు పిటిషన్లు దాఖలు చేయవచ్చని సూచించారు. మరో మార్గంలో బ్యాంకులు ఉద్యోగ ప్రవేశ పరీక్షల విధానాన్ని ఆన్‌లైన్‌లో చేపట్టడం ద్వారా ఈ ప్రక్రియను సులభతరం చేయాలని... తద్వారా ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో చదివిన వారు సైతం పరీక్ష రాసేందుకు వీలుంటుందన్నారు. అలాగే స్థానికులను భర్తీ చేసుకోవడం ద్వారా అవకాశంగా మల్చుకోవాలని సూచించారు.