PNBS
-
క్యూ4లో బ్యాంకుల జోరు.. టార్గెట్ లక్షకోట్లు
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో బ్యాంకింగ్ రంగం ప్రోత్సాహకర ఫలితాలు సాధించే వీలున్నట్లు ఫైనాన్షియల్ రంగ నిపుణులు భావిస్తున్నారు. జనవరి–మార్చి(క్యూ4) లాభాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్బీ)లు ప్రధాన పాత్రను పోషించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ బ్యాంకుల మొత్తం లాభాలు రూ. లక్ష కోట్లను తాకవచ్చని అంచనా వేశారు. మొండి రుణాలు తగ్గడం, రుణ వృద్ధి పుంజుకోవడం ప్రభావం చూపనున్నట్లు తెలియజేశారు. రూ. 40,000 కోట్లకు మార్చితో ముగిసిన గతేడాదికి పీఎస్‌యూ దిగ్గజం ఎస్బీఐ రూ. 40,000 కోట్ల నికర లాభం ఆర్జించే వీలుంది. డిసెంబర్‌తో ముగిసిన 9 నెలల కాలంలోనే రూ. 33,538 కోట్లు సాధించింది. ఇది అంతక్రితం ఏడాది(2021–22)లో అందుకున్న రూ. 31,676 కోట్లకంటే రూ. 1,862 కోట్లు అధికంకావడం గమనార్హం! ఈ బాటలో ఇతర ప్రభుత్వ బ్యాంకులు సైతం పటిష్ట పనితీరు ప్రదర్శించనున్నాయి. ఇందుకు మొండి బకాయిలు(ఎన్పీఏలు), స్లిప్పేజీలు తగ్గడానికితోడు రెండంకెల రుణ వృద్ధి, పెరుగుతున్న వడ్డీ రేట్లు సహకరించనున్నాయి. గతేడాది తొలి 9 నెలల్లో(ఏప్రిల్–డిసెంబర్) 12 పీఎస్‌బీలు మొత్తంగా రూ. 70,166 కోట్ల నికర లాభాలను ప్రకటించాయి. 2021–22లో సాధించిన రూ. 48,983 కోట్లతో పోలిస్తే ఇది 43 శాతం అధికం. ఈ ట్రెండ్ క్యూ4లోనూ కొనసాగనున్నట్లు పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ ఎండీ స్వరూప్ కుమార్ సాహా పేర్కొన్నారు. దీంతో పీఎస్‌బీలు ఉమ్మడిగా రూ. 30,000 కోట్లు ప్రకటించే వీలున్నట్లు అంచనా వేశారు. వెరసి పూర్తి ఏడాదికి రూ. లక్ష కోట్ల నికర లాభాలను అందుకోనున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. త్రైమాసికవారీగా ఇలా పీఎస్‌బీలు గతేడాది క్యూ1లో ఉమ్మడిగా రూ. 15,306 కోట్లు, క్యూ2లో రూ. 25,685 కోట్లు, క్యూ3లో రూ. 29,175 కోట్లు చొప్పున నికర లాభాలు ఆర్జించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) మినహా మిగిలిన అన్ని పీఎస్‌బీల నికర లాభాలూ క్యూ3లో మెరుగయ్యాయి. ఎస్బీఐ అత్యధికంగా 68 శాతం వృద్ధితో రూ. 14,205 కోట్లు ఆర్జించగా.. క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో పీఎన్బీ లాభం మాత్రం 44 శాతం క్షీణించి రూ. 628 కోట్లకు పరిమితమైంది. అయితే డిపాజిట్ల రేట్లు పెరగడం, కాసా(సీఏఎస్ఏ) తగ్గుతున్న కారణంగా నికర వడ్డీ మార్జిన్లపై ఒత్తిడి పడనున్నట్లు సాహా అభిప్రాయపడ్డారు. వడ్డీ రేట్ల పెరుగుదలలోనూ క్యూ4లో రుణ వృద్ధి పుంజుకుకోవడం గమనార్హం. ఐసీఐసీఐ దూకుడు బ్రోకరేజీ.. ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ నివేదిక ప్రకారం త్రైమాసికవారీగా ప్రొవిజనింగ్ తగ్గనున్నట్లు అంచనా. ప్రొవిజనింగ్ కవరేజీ రేషియో(పీసీఆర్) భారీ బిల్డప్ నేపథ్యంలో ఎన్పీఏలు వెనకడుగు వేయనున్నాయి. అయితే ఆర్బీఐ నిబంధనల కారణంగా భారీ కార్పొరేట్ రుణాలుగల బ్యాంకులు అదనపు ప్రొవిజన్లు చేపట్టవలసి ఉంటుంది. కాగా.. ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ఆకర్షణీయ లాభాలు సాధించనుండగా.. యాక్సిస్ బ్యాంక్ నష్టాలు ప్రకటించే వీలున్నట్లు ఎమ్కే గ్లోబల్ నివేదిక పేర్కొంది. సిటీబ్యాంక్ పోర్ట్‌ఫోలియో కొనుగోళ్లతో గుడ్‌విల్ రైటా ఫ్స్ చేపట్టవలసిరావడం ప్రభావం చూపనుంది. ఇక పటిష్ట వృద్ధి, తక్కువ ప్రొవిజన్లతో ఇండస్ఇండ్ బ్యాంక్ ఉత్తమ ఫలితాలు ప్రకటించవచ్చు. ఫెడరల్ బ్యాంక్ ఆశావహ ఫలితాలు వెల్లడించే వీలుంది. ప్రయివేట్ రంగ బ్యాంకులు క్యూ3లో 33% అధికంగా రూ. 36,512 కోట్ల నికర లాభాలు ప్రకటించిన విషయం విదితమే. బంధన్ బ్యాంక్, యస్ బ్యాంక్ మినహా అన్ని ప్రయివేట్ బ్యాంకులూ సానుకూల పనితీరు చూపాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అత్యధికంగా రూ. 12,259 కోట్లు ఆర్జించింది. -
పల్లెకు పోదాం చలో.. చలో
బస్‌స్టేషన్(విజయవాడ సెంట్రల్): సకుటుంబ సపరివారంగా తెలుగింట నిర్వహించుకునే సంప్రదాయ పండుగ సంక్రాంతి సందడి అంతటా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అంతా పల్లెబాట పట్టారు. పట్టణాలు, టౌన్లలో వివిధ ఉద్యోగాలు, పనుల రీత్యా స్థిరపడిన వారు అంతా పల్లె బాట పట్టారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. ఇతరత్రా ప్రాంతాల నుంచి నగరానికి వచ్చేవారు, విద్య, ఉద్యోగాల నిమిత్తం నగరానికి వచ్చిన వారు తమ గమ్యస్థానాలకు వెళ్లేవారితో బస్టాండ్‌లో పండుగ వాతావరణం అలముకుంది. గత వారం రోజులుగా ప్రధానంగా రాయలసీమ, విశాఖపట్నం సెక్టార్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లు షెడ్యూల్ ప్రకారం ఉన్న బస్సులు కిక్కిరిసి నడుస్తున్నాయి. ఆర్టీసీ107 ప్రత్యేక సర్వీసులు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్టాండ్‌లో షెడ్యూల్ ప్రకారం కాకుండా అదనపు సర్వీసులను 50 శాతం అదనపు చార్జీలతో 107 ప్రత్యేక బస్సులుగా ఏర్పాటు చేశారు. ఈ మేరకు విశాఖపట్నం–27, రాజమండ్రి–31, రాయలసీమ–27, కాకినాడ–4 అమలాపురం–11, నెల్లూరు–2, ఒంగోలు–4, రావులపాలెం–1బస్సుల్ని అదనంగా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా విజయవాడ నగరంతోపాటు రూరల్ ప్రాంతాలకు తరలివచ్చే ప్రయాణికుల కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నుంచి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఇక్కడి నుంచి బస్సుల్ని పంపించారు. వారిని తరలించేందుకు కృష్ణా రీజియన్ నుంచి 87 బస్సుల్ని హైదరాబాద్ పంపారు. ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక బస్సులకు సంబంధించి రిజర్వేషన్లు ఆన్లైన్ అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. అవి కూడా ఎప్పటికప్పుడు పూర్తయిపోతున్నట్లు వివరించారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: ట్రాఫిక్ మేనేజర్ మూర్తి సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులు తాకిడి ఎక్కువైందని, వారికి సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో అప్రమత్తంగా వ్యవహరించాలని పండిట్ నెహ్రూ బస్టాండ్ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ మూర్తి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు బస్టాండ్‌లో శుక్రవారం కిందిస్థాయి అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. ప్రయాణికుల రాకపోకల విషయంలో నిరంతరం ప్రత్యేక శ్రద్ధతో ఉండాలన్నారు. ట్రాఫిక్ సిబ్బంది బస్సుల నిలుపుదల విషయంలో డ్రైవర్లు అలసత్వం వహిస్తారని ట్రాఫిక్ సమస్య రాకుండా వారిని అప్రమత్తం చేయాలన్నారు. బుకింగ్ సూపర్వైజర్స్ వచ్చిన బస్సుల్ని వచ్చినట్లుగా ప్రయాణికుల్ని ఎక్కించి పంపించాలన్నారు. స్టాల్స్ నిర్వాహకులు ఎటువంటి అధికధరలకు విక్రయించకుండా చూసుకోవాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ మనోహర్, ట్రాఫిక్ సీఐలు, అసిస్టెంట్లు, బుకింగ్ సూపర్‌వైజర్స్‌లు పాల్గొన్నారు. -
దసరా రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులు
విజయవాడ (బస్‌స్టేషన్) : దసరా పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీకి తగినవిధంగా బస్సులు నడపాలని ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. పండిట్ నెహ్రూ బస్టాండ్ కాన్ఫరెన్స్ కార్యాలయంలో ఆయన శుక్రవారం ఈడీలు, ఆర్ఏం, సీటీఏంలతో సమావేశమయ్యారు. దసరా ఏర్పాట్లు, నడుపుతున్న బస్సుల వివరాల గురించి ఎండీ సాంబశివరావు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జిల్లా నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక బస్సులు పంపుతున్నామని, 11న 200 బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు ఎండీకి వివరించారు. ఎండీ సాంబశివరావు మాట్లాడుతూ పండగ సందర్భాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడటమే కాకుండా, ప్రయివేట్ ఆపరేటర్ల తీరుతో మోసపోతున్నారని, వీటిని నియంత్రించేందుకు ఆర్టీసీ ప్రయివేట్ ఆపరేటర్లకు దీటుగా బస్సులు నడపాలని ఆదేశించారు. ఈడీలు జయరావు, కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, ఆర్ఎం రామారావు, సీటీఏంలు శ్రీరాములు, జాన్‌సుకుమార్, సుధాకర్ పాల్గొన్నారు. -
హోదా ఎక్కువ.. జీతం తక్కువ
బ్యాంకుల్లో కింది వారికే ఎక్కువ జీతాలు ఉన్నత స్థాయి ఉద్యోగులకు తక్కువే ♦ నాకు కూడా తక్కువే ఇస్తున్నారు ♦ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యలు ♦ వేతన విధానం మారాలని సూచన ♦ లేకుంటే ప్రతిభావంతులను ఆకర్షించడం కష్టమని వ్యాఖ్య ♦ పీఎస్బీల్లో ప్రభుత్వ జోక్యం తగ్గాలని అభిప్రాయం ముంబై: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో (పీఎస్‌బీలు) వేతన విధానం సరిగా లేదని రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. జీతాలైతే ఉన్నత స్థాయిలో ఉన్న వారికి తక్కువగాను, దిగువన ఉన్న వారికి ఎక్కువగాను ఉన్నాయన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోకి ప్రతిభ గల వారిని ఆకర్షించేందుకు ఇదే పెద్ద ప్రతిబంధకమని ఆయన అభివర్ణించారు. అలాగే, మౌలికరంగ ప్రాజెక్టులకు రుణాలను విస్మరించరాదని సూచించారు. ఫిక్కీ, బ్యాంకుల ఆధ్వర్యంలో ముంబైలో మంగళవారం జరిగిన జాతీయ బ్యాంకర్ల సదస్సులో రాజన్ పలు అంశాలపై తనదైన శైలిలో సూటిగా మాట్లాడారు. ఇలా అయితే ఎలా...? ‘పీఎస్బీలలో దిగువ స్థాయిలో అధిక వేతనాలు చెల్లించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఉన్నత స్థాయిలో వారికి మాత్రం వేతనాలు తక్కువగా ఉన్నాయి. ఎంతో మంది ప్రజల కోసం ఈ ఉద్యోగం చేస్తున్నామని మీరు భావించాలి. కానీ, దీనివల్ల అత్యున్నత నైపుణ్యం ఉన్నవారిని ఆకర్షించడం కష్టం’ అని రాజన్ అన్నారు. ‘నాక్కూడా తక్కువగానే వేతనం ఇస్తున్నారంటూ’ ఆయన చమత్కరించారు. పీఎస్‌బీల షేర్ల ధరలు తక్కువగా ఉన్నందున దాన్నో అవకాశంగా భావించి ఉద్యోగులకు ప్రైవేటు రంగం మాదిరి షేర్లను (ఈ సాప్స్) కేటాయించాలని సూచించారు. ఇచ్చేది కొద్ది మొత్తమైనా అది వారికి ఎంతో ప్రేరణ ఇచ్చి పనితీరు మెరుగుపరచడం ద్వారా బ్యాంకుల విలువను భారీగా పెంచుతుందన్నారు. అదే సమయంలో దిగువ స్థాయిలో మంచి వేతన స్కేళ్లు ఉండడం కూడా ఓ మంచి అవకాశంగా పేర్కొన్నారు. ‘మూడో తరగతిలో ఇంజనీర్లు, ఎంబీఏ అర్హతులున్న వారిని ఉద్యోగులుగా పొందుతున్నాం. మీరున్నది గుమస్తా ఉద్యోగానికి కాదు. మరింత విలువ సృష్టించడానికి... అని వారికి సూచించడం ద్వారా అవకాశాలను విస్తరించుకోవడంపై దృష్టి పెట్టాలి’ అని బ్యాంకర్లకు రాజన్ సూచించారు. ఈ రంగం మొత్తానికి ఒకే వేతన విధానం కాకుండా భిన్న విధానాలను అమలు చేయాలని సూచించారు. కాగా, రఘురామ్ రాజన్ 2015 జూలైలో రూ.1,98,700 వేతనంగా అందుకున్నారు. ప్రభుత్వ రంగ ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య 2015-16లో పొందిన వేతనం రూ.31.1 లక్షలు. ప్రైవేటు రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎండీ ఆదిత్యపురి అందుకున్న వేతనం మాత్రం రూ.9.7 కోట్లు. మౌలికరంగ రుణాలూ ముఖ్యమే పీఎస్‌బీలు మౌలికరంగ ప్రాజెక్టుల రుణాలు ఇవ్వకపోవడంపై రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. తక్కువ వ్యయం గల కాసా (కరెంట్, సేవింగ్స్ ఖాతా) డిపాజిట్లను పెంచుకోవడం ద్వారా బ్యాంకులు మౌలికరంగ ప్రాజెక్టులకు రుణాలు అందించాలని సూచించారు. మౌలిక రంగం వైపు నుంచి అధిక మొత్తంలో ఎన్పీఏల సమస్య ఉన్న విషయాన్ని పేర్కొంటూ... ఈ విషయంలో నిర్వహణ పనితీరును మెరుగుపరుచుకుని, సరైన మూలధన నిర్మాణంపై దృష్టి పెట్టాలని సూచించారు. రిటైల్ రుణాలపై కూడా రిస్క్ ఉంటుందని... కొంత కాలానికి అది బయటకు వస్తుందన్నారు. పీఎస్బీల్లో ఉన్నత స్థాయి నియామకాల్లో ప్రభుత్వ పాత్ర తగ్గాలని, పాలనాపరమైన నిర్ణయాలను స్వేచ్ఛగా తీసుకునేలా బ్యాంకు బోర్డులను బలోపేతం చేయాలని రాజన్ సూచించారు. పీఎస్‌బీల బోర్డుల నుంచి ఆర్బీఐ తన ప్రతినిధులను సైతం ఉపసంహరించుని నియంత్రణ పాత్రకే పరిమితం కావాలని అభిప్రాయపడ్డారు. బ్యాంకుల్లో ఉన్నత స్థాయి ఉద్యోగులను నియమించే అధికారం బ్యాంకు బోర్డు బ్యూరోలకే కల్పించాలన్నారు. సైబర్ నేరాలు పెరిగిపోయిన దృష్ట్యా బ్యాంకులు తమ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ పరీక్షలు ఓ మార్గం బ్యాంకులు కొన్ని క్యాంపస్‌లలో రిక్రూట్మెంట్లు నిర్వహించకుండా కోర్టు తీర్పులు అడ్డుపడుతున్నందున... ఈ విషయమై బ్యాంకులు పిటిషన్లు దాఖలు చేయవచ్చని సూచించారు. మరో మార్గంలో బ్యాంకులు ఉద్యోగ ప్రవేశ పరీక్షల విధానాన్ని ఆన్లైన్లో చేపట్టడం ద్వారా ఈ ప్రక్రియను సులభతరం చేయాలని... తద్వారా ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో చదివిన వారు సైతం పరీక్ష రాసేందుకు వీలుంటుందన్నారు. అలాగే స్థానికులను భర్తీ చేసుకోవడం ద్వారా అవకాశంగా మల్చుకోవాలని సూచించారు.