న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో బ్యాంకింగ్ రంగం ప్రోత్సాహకర ఫలితాలు సాధించే వీలున్నట్లు ఫైనాన్షియల్ రంగ నిపుణులు భావిస్తున్నారు. జనవరి–మార్చి(క్యూ4) లాభాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్‌బీ)లు ప్రధాన పాత్రను పోషించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ బ్యాంకుల మొత్తం లాభాలు రూ. లక్ష కోట్లను తాకవచ్చని అంచనా వేశారు. మొండి రుణాలు తగ్గడం, రుణ వృద్ధి పుంజుకోవడం ప్రభావం చూపనున్నట్లు తెలియజేశారు.
రూ. 40,000 కోట్లకు
మార్చితో ముగిసిన గతేడాదికి పీఎస్‌యూ దిగ్గజం ఎస్‌బీఐ రూ. 40,000 కోట్ల నికర లాభం ఆర్జించే వీలుంది. డిసెంబర్‌తో ముగిసిన 9 నెలల కాలంలోనే రూ. 33,538 కోట్లు సాధించింది. ఇది అంతక్రితం ఏడాది(2021–22)లో అందుకున్న రూ. 31,676 కోట్లకంటే రూ. 1,862 కోట్లు అధికంకావడం గమనార్హం! ఈ బాటలో ఇతర ప్రభుత్వ బ్యాంకులు సైతం పటిష్ట పనితీరు ప్రదర్శించనున్నాయి. ఇందుకు మొండి బకాయిలు(ఎన్‌పీఏలు), స్లిప్పేజీలు తగ్గడానికితోడు రెండంకెల రుణ వృద్ధి, పెరుగుతున్న వడ్డీ రేట్లు సహకరించనున్నాయి. గతేడాది తొలి 9 నెలల్లో(ఏప్రిల్–డిసెంబర్) 12 పీఎస్‌బీలు మొత్తంగా రూ. 70,166 కోట్ల నికర లాభాలను ప్రకటించాయి. 2021–22లో సాధించిన రూ. 48,983 కోట్లతో పోలిస్తే ఇది 43 శాతం అధికం. ఈ ట్రెండ్ క్యూ4లోనూ కొనసాగనున్నట్లు పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ ఎండీ స్వరూప్ కుమార్ సాహా పేర్కొన్నారు. దీంతో పీఎస్‌బీలు ఉమ్మడిగా రూ. 30,000 కోట్లు ప్రకటించే వీలున్నట్లు అంచనా వేశారు. వెరసి పూర్తి ఏడాదికి రూ. లక్ష కోట్ల నికర లాభాలను అందుకోనున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి.
త్రైమాసికవారీగా ఇలా
పీఎస్‌బీలు గతేడాది క్యూ1లో ఉమ్మడిగా రూ. 15,306 కోట్లు, క్యూ2లో రూ. 25,685 కోట్లు, క్యూ3లో రూ. 29,175 కోట్లు చొప్పున నికర లాభాలు ఆర్జించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) మినహా మిగిలిన అన్ని పీఎస్‌బీల నికర లాభాలూ క్యూ3లో మెరుగయ్యాయి. ఎస్‌బీఐ అత్యధికంగా 68 శాతం వృద్ధితో రూ. 14,205 కోట్లు ఆర్జించగా.. క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో పీఎన్‌బీ లాభం మాత్రం 44 శాతం క్షీణించి రూ. 628 కోట్లకు పరిమితమైంది. అయితే డిపాజిట్ల రేట్లు పెరగడం, కాసా(సీఏఎస్‌ఏ) తగ్గుతున్న కారణంగా నికర వడ్డీ మార్జిన్లపై ఒత్తిడి పడనున్నట్లు సాహా అభిప్రాయపడ్డారు. వడ్డీ రేట్ల పెరుగుదలలోనూ క్యూ4లో రుణ వృద్ధి పుంజుకుకోవడం గమనార్హం.
ఐసీఐసీఐ దూకుడు
బ్రోకరేజీ.. ఎమ్‌కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ నివేదిక ప్రకారం త్రైమాసికవారీగా ప్రొవిజనింగ్ తగ్గనున్నట్లు అంచనా. ప్రొవిజనింగ్ కవరేజీ రేషియో(పీసీఆర్) భారీ బిల్డప్ నేపథ్యంలో ఎన్‌పీఏలు వెనకడుగు వేయనున్నాయి. అయితే ఆర్‌బీఐ నిబంధనల కారణంగా భారీ కార్పొరేట్ రుణాలుగల బ్యాంకులు అదనపు ప్రొవిజన్లు చేపట్టవలసి ఉంటుంది. కాగా.. ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ఆకర్షణీయ లాభాలు సాధించనుండగా.. యాక్సిస్ బ్యాంక్ నష్టాలు ప్రకటించే వీలున్నట్లు ఎమ్‌కే గ్లోబల్ నివేదిక పేర్కొంది. సిటీబ్యాంక్ పోర్ట్‌ఫోలియో కొనుగోళ్లతో గుడ్‌విల్ రైటా ఫ్స్ చేపట్టవలసిరావడం ప్రభావం చూపనుంది. ఇక పటిష్ట వృద్ధి, తక్కువ ప్రొవిజన్లతో ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఉత్తమ ఫలితాలు ప్రకటించవచ్చు. ఫెడరల్ బ్యాంక్ ఆశావహ ఫలితాలు వెల్లడించే వీలుంది. ప్రయివేట్ రంగ బ్యాంకులు క్యూ3లో 33% అధికంగా రూ. 36,512 కోట్ల నికర లాభాలు ప్రకటించిన విషయం విదితమే. బంధన్ బ్యాంక్, యస్ బ్యాంక్ మినహా అన్ని ప్రయివేట్ బ్యాంకులూ సానుకూల పనితీరు చూపాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అత్యధికంగా రూ. 12,259 కోట్లు ఆర్జించింది.
Comments
Please login to add a commentAdd a comment