దసరా రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులు
విజయవాడ (బస్‌స్టేషన్) : దసరా పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీకి తగినవిధంగా బస్సులు నడపాలని ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. పండిట్ నెహ్రూ బస్టాండ్ కాన్ఫరెన్స్ కార్యాలయంలో ఆయన శుక్రవారం ఈడీలు, ఆర్‌ఏం, సీటీఏంలతో సమావేశమయ్యారు. దసరా ఏర్పాట్లు, నడుపుతున్న బస్సుల వివరాల గురించి ఎండీ సాంబశివరావు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జిల్లా నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక బస్సులు పంపుతున్నామని, 11న 200 బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు ఎండీకి వివరించారు. ఎండీ సాంబశివరావు మాట్లాడుతూ పండగ సందర్భాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడటమే కాకుండా, ప్రయివేట్ ఆపరేటర్ల తీరుతో మోసపోతున్నారని, వీటిని నియంత్రించేందుకు ఆర్టీసీ ప్రయివేట్ ఆపరేటర్లకు దీటుగా బస్సులు నడపాలని ఆదేశించారు. ఈడీలు జయరావు, కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, ఆర్‌ఎం రామారావు, సీటీఏంలు శ్రీరాములు, జాన్‌సుకుమార్, సుధాకర్ పాల్గొన్నారు.