రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ పదవిని రెండో దఫా చేపట్టేది లేదని రఘురామ్ రాజన్ చేసిన ప్రకటన అనూహ్యమైనదేమీ కాదు. ఆ ప్రకటన సృష్టించిన ప్రకంపనలు మాత్రం అనూహ్యమైనవి. ప్రతిపక్షాలే కాదు, ఏకాభి ప్రాయానికి తావు లేదనిపించే వార్తా, వ్యాపార మీడియా నిపుణుల నుంచి ఆర్థిక నిపుణుల వరకు అంతా రాజన్ నిష్ర్కమణ భారత ఆర్థిక వ్యవస్థకు శుభప్రదం కాదంటున్నారు. అధిక వడ్డీ రేట్ల వ్యవస్థను కొనసాగిస్తూ పెట్టుబడులకు ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆయన పట్ల తరచుగా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చిన వ్యాపార, పారిశ్రామిక సంఘాలు, ప్రముఖులు సైతం ఆయన నిష్ర్కమణ పట్ల విచారాన్ని వ్యక్తం చేయడం విశేషం.
విభ్నిన్న రంగాల ప్రముఖుల నుంచి వినవస్తున్న ఇలాంటి స్పందన లన్నీ.. మూడేళ్లుగా మన ఆర్థిక వ్యవస్థ బహిర్గత, అంతర్గత ఒడిదుడుకులను ఎదుర్కొంటుండగా ఆర్‌బీఐ గవర్నర్‌గా రాజన్ చేసిన కృషి ప్రాధాన్యాన్ని, రాజకీయ ఒత్తిడులకు లొంగక స్థూల ఆర్థిక చలాంకాల వాస్తవ కదలికలను ఎప్పటి కప్పుడు అంచనా వేస్తూ ద్రవ్య విధానాన్ని నిర్దేశిస్తున్న విధానకర్తగా ఆయనకున్న అసమాన విశ్వసనీయతను ప్రతిబింబి స్తున్నాయి. సెప్టెంబర్ 4కు గానీ రాజన్ పదవీ కాలం ముగియదు. ఎన్డీఏ ప్రభుత్వం ఆయనకు రెండో దఫా అవకాశాన్ని కల్పిస్తుందా, లేదా అనే చర్చ కొంత కాలంగా జోరుగా సాగుతోంది.
రాజన్‌కు వ్యతిరేకంగా ఎక్కుపెడుతూ ఈ విషయాన్ని రచ్చకెక్కించి చర్చనీయాంశంగా మార్చినది అధికార పక్ష నేతలే. ప్రధాని, ఆర్థిక మంత్రి, ఆర్‌బీఐ గవర్నర్‌లు మాత్రమే కలసి చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అంశంపై రేగుతున్న అవాంఛనీయమైన ఈ రచ్చను మొగ్గలోనే తుంచేయకుండా ప్రధాన మంత్రి, బీజేపీ అగ్రనాయకత్వం ఉదాసీనత చూపారు. పైగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజన్ విధానాలపై తన అసంతృప్తిని తరచుగానే వ్యక్తంచేస్తూ వచ్చారు. 2007, 2008లలో బద్ధలైన ప్రపంచ ఆర్థిక సంక్షోభం ముప్పును గురించి రాజన్ ముందస్తుగా 2005లోనే హెచ్చరించారు. ప్రపంచం ఆయన మాట విని ఉండాల్సిందని ఐఎంఫ్ అధిపతి క్రిస్టిన్ లగార్డే సైతం ఇటీవల వ్యాఖ్యానించారు. అటువంటి ఆర్థిక నిపుణుడు రెండో దఫా ఆర్‌బీఐ పగ్గాలు చేపట్టలేనని అనడానికి కారణం కేంద్రం ఆయనకు ఆ బాధ్యతలను అప్పగించ డానికి విముఖంగా ఉండటమేననేది బహిరంగ రహస్యం.
2013లో ఆర్‌బీఐ గవర్నర్ పదవిని చేపట్టేటప్పటి నుంచి ద్రవ్యోల్బణంపైకి గురిపెట్టిన ద్రవ్య విధానాన్ని రాజన్ నిలకడగా అనుసరిస్తూ వచ్చారు. 2013లో 10.7 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణాన్ని 5 శాతానికి తగ్గించగలిగారు. అదే సమ యంలో ఆయన నాన్ రెసిడెంట్ ఫారిన్ కరెన్సీ డిపాజిట్ల పెంపుదలకు చర్యలు చేపట్టారు. మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు జూన్ 10 నాటికి రికార్డు స్థాయిలో 36,32,300 కోట్ల డాలర్లకు చేరాయి. వ్యాపార, పారిశ్రామిక వర్గాల నుంచి, ఆర్థిక మంత్రి నుంచి వడ్డీ రేట్లను తగ్గించాలని కోరుతున్నా రాజన్ ప్రజల నిజ ఆదాయాలను ఆవిరిచేసే అధిక ద్రవ్యోల్బణం తగ్గనిదే రేట్ల తగ్గింపు ఉండదనే వైఖరిని సడలించలేదు. ఈ విష యంలో అమెరికా వంటి దేశాలతో పోలికలను తెచ్చే విమర్శకులు తరచుగా రెండు వాస్తవాలను విస్మరిస్తుంటారు.
ఒకటి, అమెరికాకు ద్రవ్యోల్బణం సమస్య లేదు. రెండు, అమెరికాలో 2012 నుంచి కనిపించిన వృద్ధిలోని పెరుగుదలకు కారణం అల్ప వడ్డీ రేట్లు కాదు, ప్రభుత్వ వ్యయం ఉద్యోగిత, ఉత్పత్తులకు కల్పించిన ప్రోత్సాహం వల్ల. అల్ప వడ్డీ రేట్లు కొనసాగుతున్నా ఆ వృద్ధి సైతం సుస్థిరంగా కొనసాగే స్థితి లేకనే ఫెడరల్ రిజర్వ్... వడ్డీ రేట్లను పెంచి, ఆర్థిక వ్యవస్థలోకి అధికంగా ప్రవేశపెట్టిన డబ్బును ఉపసంహరించాలనే నిర్ణయాన్ని ఇటీవలనే నిలుపదల చేసింది. రాజన్ తన నిష్ర్కమణ ప్రకటనలో సైతం ‘‘వృద్ధిపై దృష్టిని కేంద్రీకరించడం కోసం మనం ఎన్నటికీ ద్రవ్యోల్బణాన్ని వదిలేయరాదు’’ అని హెచ్చరించారు.
ద్రవ్య విధానాన్ని దీర్ఘకాలిక వృద్ధి వ్యూహానికి ప్రత్యామ్నాయంగా భావించరాదనేది ప్రపంచ ఆర్థిక నిపుణులంతా చెప్పే మాటే. కానీ ఎన్డీఏ మాత్రం అధికంగా డబ్బును ప్రవేశ పెట్టడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని పెంచే పద్ధతుల్లో అధిక వృద్ధిని సాధించడమనే అవాస్తవిక విధానాన్ని ఎంచుకుంది. అందుకు రాజన్ అడ్డంకి కావడాన్నే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పట్ల ‘ధిక్కారం’గా తప్పు పట్టడం హాస్యాస్పదం. చైనా స్థానంలోకి భారత్ ప్రవేశించనుందని, ప్రపంచంలోనే అత్యధిక వృద్ధి రేట్లను సాధించామనే అవాస్తవికమైన, బాధ్యతారహితమైన ప్రకటనలను చేయడం రాజకీయవేత్త అయిన ఆర్థిక మంత్రి చేయగలరు. అంతర్జాతీయ స్థాయి విశ్వసనీ యతగల ఆర్థికవేత్తగా, ఆర్‌బీఐ గవర్నర్‌గా అలాంటి ప్రకటనలను రాజన్ సమర్థిం చలేకపోవడం సహజమే. అందుకే ఆయన ‘‘మనం ఎగుమతి ఆధార వృద్ధి మార్గాన్ని అనుసరించి వస్తు తయారీపై దృష్టిని కేంద్రీకరించాలని భావిస్తుండ టంలో ప్రమాదం ఉంది. ప్రపంచానికి మరో ఎగుమతి ఆధార చైనాను భరించే శక్తిలేదు.
ఎగుమతి మార్కెట్లలో పెరుగుదల లేకపోయే అవకాశం ఉన్న దృష్ట్యా మనం దేశీయ మార్కెట్‌కోసం ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది’’ అని ఆయన గత ఏడాది కేంద్ర ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని ప్రస్తావిస్తూ హెచ్చరించారు. 2015-16లో ప్రభుత్వ బ్యాంకుల నష్టాలు మొత్తం రూ. 17,995 కోట్లు. కాగా, మొండి బకాయిలు లేదా క్రియాశీలంగా లేని ఆస్తులు రూ. 6 లక్షల కోట్లకు చేరాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థను కుంగదీస్తున్న మొండి బకాయిల విషయంలో రాజన్ చేపట్టిన వైఖరి పట్ల పారిశ్రామిక, వ్యాపార వర్గాల నుంచి, ప్రభుత్వం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
సంపన్న ప్రపంచం సంతృప్తికర మనదగిన స్థాయి వృద్ధిని సాధించడం సమీప భవిష్యత్తులో సాధ్యం కాదనే అంచనాపై ఆధారపడి రాజన్ బ్యాంకింగ్ రంగాన్ని పటిష్టం చేయడానికి చేపట్టిన ప్రయత్నాన్ని సైతం వివాదంగా చేయడం దురదృష్టకరం. ఏదిఏమైనా రాజన్ స్థానంలో మరొకరిని ఆర్‌బీఐ గవర్నర్‌గా ఎంపిక చేయడం ప్రభుత్వానికి కత్తి మీద సామే అవుతుంది. ఈయూ నుంచి బ్రిటన్ నిష్ర్కమణ జరిగే ప్రమాదం ఉన్న తక్షణ నేపథ్యంలో రాజన్ సేవలు మరో మూడేళ్లపాటు అందుబాటులో లేకపో వడం దేశానికి తీరని లోటనడం నిస్సందేహం.
పొమ్మనలేక పొగబెట్టి...
Published Tue, Jun 21 2016 1:04 AM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM
Advertisement