Economical system
-
మోదీ చెప్పిందే.. నేను చెప్తున్నాను
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో కాంగ్రెస్ నేత పి.చిదంబరం గతంలో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన ఓ ట్వీట్‌ని గుర్తు చేశారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను తాజాగా చిదంబరం పోస్ట్ చేసి.. విమర్శలు గుప్పించారు. 2013లో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ సమస్యలో చిక్కుకుందని, యువతకు ఉద్యోగాలు కావాలని మోదీ అన్నారు. సమయాన్ని అనవసర రాజకీయ చర్యలకు కాకుండా ఆర్థికవ్యవస్థను బాగు చేసేందుకు కేటాయించాలని కోరుతూ మోదీ అప్పట్లో ట్వీట్ చేశారు. దానినే ఈ రోజు చిదంబరం గుర్తు చేస్తూ తాను కూడా ఇప్పుడు ప్రధానికి చెప్పదలుచుకున్నది ఇదే అంటూ విమర్శలు గుప్పించారు.(చదవండి: ఆ ఆర్మీ శునకాలను పొగిడిన మోదీ) I have to say the same thing to the Honourable Prime Minister! pic.twitter.com/reNmp84mRu — P. Chidambaram (@PChidambaram_IN) September 2, 2020 కరోనా వల్లనే జీడీపీ వృద్ధి రేటు పడిపోయింది... ఇది దేవుని చర్య అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవ తప్పిదాన్ని దేవుడి మీదకు నెట్టకూడదన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఉపశమన ప్యాకేజీని ఒక జోక్‌గా వర్ణించారు చిదంబరం. -
పొమ్మనలేక పొగబెట్టి...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ పదవిని రెండో దఫా చేపట్టేది లేదని రఘురామ్ రాజన్ చేసిన ప్రకటన అనూహ్యమైనదేమీ కాదు. ఆ ప్రకటన సృష్టించిన ప్రకంపనలు మాత్రం అనూహ్యమైనవి. ప్రతిపక్షాలే కాదు, ఏకాభి ప్రాయానికి తావు లేదనిపించే వార్తా, వ్యాపార మీడియా నిపుణుల నుంచి ఆర్థిక నిపుణుల వరకు అంతా రాజన్ నిష్ర్కమణ భారత ఆర్థిక వ్యవస్థకు శుభప్రదం కాదంటున్నారు. అధిక వడ్డీ రేట్ల వ్యవస్థను కొనసాగిస్తూ పెట్టుబడులకు ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆయన పట్ల తరచుగా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చిన వ్యాపార, పారిశ్రామిక సంఘాలు, ప్రముఖులు సైతం ఆయన నిష్ర్కమణ పట్ల విచారాన్ని వ్యక్తం చేయడం విశేషం. విభ్నిన్న రంగాల ప్రముఖుల నుంచి వినవస్తున్న ఇలాంటి స్పందన లన్నీ.. మూడేళ్లుగా మన ఆర్థిక వ్యవస్థ బహిర్గత, అంతర్గత ఒడిదుడుకులను ఎదుర్కొంటుండగా ఆర్బీఐ గవర్నర్‌గా రాజన్ చేసిన కృషి ప్రాధాన్యాన్ని, రాజకీయ ఒత్తిడులకు లొంగక స్థూల ఆర్థిక చలాంకాల వాస్తవ కదలికలను ఎప్పటి కప్పుడు అంచనా వేస్తూ ద్రవ్య విధానాన్ని నిర్దేశిస్తున్న విధానకర్తగా ఆయనకున్న అసమాన విశ్వసనీయతను ప్రతిబింబి స్తున్నాయి. సెప్టెంబర్ 4కు గానీ రాజన్ పదవీ కాలం ముగియదు. ఎన్డీఏ ప్రభుత్వం ఆయనకు రెండో దఫా అవకాశాన్ని కల్పిస్తుందా, లేదా అనే చర్చ కొంత కాలంగా జోరుగా సాగుతోంది. రాజన్‌కు వ్యతిరేకంగా ఎక్కుపెడుతూ ఈ విషయాన్ని రచ్చకెక్కించి చర్చనీయాంశంగా మార్చినది అధికార పక్ష నేతలే. ప్రధాని, ఆర్థిక మంత్రి, ఆర్బీఐ గవర్నర్లు మాత్రమే కలసి చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అంశంపై రేగుతున్న అవాంఛనీయమైన ఈ రచ్చను మొగ్గలోనే తుంచేయకుండా ప్రధాన మంత్రి, బీజేపీ అగ్రనాయకత్వం ఉదాసీనత చూపారు. పైగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజన్ విధానాలపై తన అసంతృప్తిని తరచుగానే వ్యక్తంచేస్తూ వచ్చారు. 2007, 2008లలో బద్ధలైన ప్రపంచ ఆర్థిక సంక్షోభం ముప్పును గురించి రాజన్ ముందస్తుగా 2005లోనే హెచ్చరించారు. ప్రపంచం ఆయన మాట విని ఉండాల్సిందని ఐఎంఫ్ అధిపతి క్రిస్టిన్ లగార్డే సైతం ఇటీవల వ్యాఖ్యానించారు. అటువంటి ఆర్థిక నిపుణుడు రెండో దఫా ఆర్బీఐ పగ్గాలు చేపట్టలేనని అనడానికి కారణం కేంద్రం ఆయనకు ఆ బాధ్యతలను అప్పగించ డానికి విముఖంగా ఉండటమేననేది బహిరంగ రహస్యం. 2013లో ఆర్బీఐ గవర్నర్ పదవిని చేపట్టేటప్పటి నుంచి ద్రవ్యోల్బణంపైకి గురిపెట్టిన ద్రవ్య విధానాన్ని రాజన్ నిలకడగా అనుసరిస్తూ వచ్చారు. 2013లో 10.7 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణాన్ని 5 శాతానికి తగ్గించగలిగారు. అదే సమ యంలో ఆయన నాన్ రెసిడెంట్ ఫారిన్ కరెన్సీ డిపాజిట్ల పెంపుదలకు చర్యలు చేపట్టారు. మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు జూన్ 10 నాటికి రికార్డు స్థాయిలో 36,32,300 కోట్ల డాలర్లకు చేరాయి. వ్యాపార, పారిశ్రామిక వర్గాల నుంచి, ఆర్థిక మంత్రి నుంచి వడ్డీ రేట్లను తగ్గించాలని కోరుతున్నా రాజన్ ప్రజల నిజ ఆదాయాలను ఆవిరిచేసే అధిక ద్రవ్యోల్బణం తగ్గనిదే రేట్ల తగ్గింపు ఉండదనే వైఖరిని సడలించలేదు. ఈ విష యంలో అమెరికా వంటి దేశాలతో పోలికలను తెచ్చే విమర్శకులు తరచుగా రెండు వాస్తవాలను విస్మరిస్తుంటారు. ఒకటి, అమెరికాకు ద్రవ్యోల్బణం సమస్య లేదు. రెండు, అమెరికాలో 2012 నుంచి కనిపించిన వృద్ధిలోని పెరుగుదలకు కారణం అల్ప వడ్డీ రేట్లు కాదు, ప్రభుత్వ వ్యయం ఉద్యోగిత, ఉత్పత్తులకు కల్పించిన ప్రోత్సాహం వల్ల. అల్ప వడ్డీ రేట్లు కొనసాగుతున్నా ఆ వృద్ధి సైతం సుస్థిరంగా కొనసాగే స్థితి లేకనే ఫెడరల్ రిజర్వ్... వడ్డీ రేట్లను పెంచి, ఆర్థిక వ్యవస్థలోకి అధికంగా ప్రవేశపెట్టిన డబ్బును ఉపసంహరించాలనే నిర్ణయాన్ని ఇటీవలనే నిలుపదల చేసింది. రాజన్ తన నిష్ర్కమణ ప్రకటనలో సైతం ‘‘వృద్ధిపై దృష్టిని కేంద్రీకరించడం కోసం మనం ఎన్నటికీ ద్రవ్యోల్బణాన్ని వదిలేయరాదు’’ అని హెచ్చరించారు. ద్రవ్య విధానాన్ని దీర్ఘకాలిక వృద్ధి వ్యూహానికి ప్రత్యామ్నాయంగా భావించరాదనేది ప్రపంచ ఆర్థిక నిపుణులంతా చెప్పే మాటే. కానీ ఎన్డీఏ మాత్రం అధికంగా డబ్బును ప్రవేశ పెట్టడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని పెంచే పద్ధతుల్లో అధిక వృద్ధిని సాధించడమనే అవాస్తవిక విధానాన్ని ఎంచుకుంది. అందుకు రాజన్ అడ్డంకి కావడాన్నే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పట్ల ‘ధిక్కారం’గా తప్పు పట్టడం హాస్యాస్పదం. చైనా స్థానంలోకి భారత్ ప్రవేశించనుందని, ప్రపంచంలోనే అత్యధిక వృద్ధి రేట్లను సాధించామనే అవాస్తవికమైన, బాధ్యతారహితమైన ప్రకటనలను చేయడం రాజకీయవేత్త అయిన ఆర్థిక మంత్రి చేయగలరు. అంతర్జాతీయ స్థాయి విశ్వసనీ యతగల ఆర్థికవేత్తగా, ఆర్బీఐ గవర్నర్‌గా అలాంటి ప్రకటనలను రాజన్ సమర్థిం చలేకపోవడం సహజమే. అందుకే ఆయన ‘‘మనం ఎగుమతి ఆధార వృద్ధి మార్గాన్ని అనుసరించి వస్తు తయారీపై దృష్టిని కేంద్రీకరించాలని భావిస్తుండ టంలో ప్రమాదం ఉంది. ప్రపంచానికి మరో ఎగుమతి ఆధార చైనాను భరించే శక్తిలేదు. ఎగుమతి మార్కెట్లలో పెరుగుదల లేకపోయే అవకాశం ఉన్న దృష్ట్యా మనం దేశీయ మార్కెట్కోసం ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది’’ అని ఆయన గత ఏడాది కేంద్ర ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని ప్రస్తావిస్తూ హెచ్చరించారు. 2015-16లో ప్రభుత్వ బ్యాంకుల నష్టాలు మొత్తం రూ. 17,995 కోట్లు. కాగా, మొండి బకాయిలు లేదా క్రియాశీలంగా లేని ఆస్తులు రూ. 6 లక్షల కోట్లకు చేరాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థను కుంగదీస్తున్న మొండి బకాయిల విషయంలో రాజన్ చేపట్టిన వైఖరి పట్ల పారిశ్రామిక, వ్యాపార వర్గాల నుంచి, ప్రభుత్వం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సంపన్న ప్రపంచం సంతృప్తికర మనదగిన స్థాయి వృద్ధిని సాధించడం సమీప భవిష్యత్తులో సాధ్యం కాదనే అంచనాపై ఆధారపడి రాజన్ బ్యాంకింగ్ రంగాన్ని పటిష్టం చేయడానికి చేపట్టిన ప్రయత్నాన్ని సైతం వివాదంగా చేయడం దురదృష్టకరం. ఏదిఏమైనా రాజన్ స్థానంలో మరొకరిని ఆర్బీఐ గవర్నర్‌గా ఎంపిక చేయడం ప్రభుత్వానికి కత్తి మీద సామే అవుతుంది. ఈయూ నుంచి బ్రిటన్ నిష్ర్కమణ జరిగే ప్రమాదం ఉన్న తక్షణ నేపథ్యంలో రాజన్ సేవలు మరో మూడేళ్లపాటు అందుబాటులో లేకపో వడం దేశానికి తీరని లోటనడం నిస్సందేహం. -
దేశ ఆర్థిక వ్యవస్థలో కస్టమ్స్ విభాగానిది కీలకపాత్ర
- కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ శంషాబాద్ : దేశ ఆర్థిక వ్యవస్థలో కస్టమ్స్ విభాగానిది కీలక పాత్ర అని కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలోని నొవాటెల్ హోటల్లో బుధవారం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘డిజిటలైజేషన్, ప్రొగ్రెసీవ్ మేనేజ్మెంట్ థీమ్’తో ముందుకెళ్లాలని డబ్ల్యూసీఓ (వర ల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్) తీసుకున్న నిర్ణయం సమాచార వ్యవస్థతో ముడిపడి ఉందన్నారు. నిజాయితీతో కూడిన పారదర్శకమైన సమాచార పంపిణీ అనేది ఆయా సంస్థల పురోగతిలో ప్రధానమైన పాత్ర పోషిస్తుందన్నారు. కస్టమ్స్ నిబంధనలు, క్లియరెన్స్ తదితర సమాచారం ప్రయాణికులకు చేరువకావాల్సి ఉందన్నారు. వ్యవస్థీకృత అవినీతి కారణంగా దేశభద్రత సవాలుగా మారుతోందన్నారు. డిజిటలైజేషన్ ద్వారా కస్టమ్స్ పనితీరు మరింత పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పన్ను రాబడి తదితర అంశాలను ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. భర్త జీతాలను భార్యలు తెలుసుకుంటున్నారు.. సమాచార హక్కు చట్టం ద్వారా భర్తల జీతాలు ఎంత ఉన్నాయో కూడా భార్యలు తెలుసుకుంటున్న సందర్భాలు చోటు చేసుకుంటున్నాయని మాడభూషి శ్రీధర్ వివరించారు. భార్యాభర్తల మధ్య పరస్పర సమాచారలోపం కారణంగానే ఇలాంటి ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. సమాచారహక్కు చట్టం దేశ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారిందని పలు సందర్భాలను ఆయన ఊటంకించారు. కస్టమ్స్ విభాగంలో ఇప్పటికే డిజటలైజేషన్ ద్వారా సులభతరమైన పనివిధానంతోపాటు పారదర్శకత చోటు చేసుకుంటుందని హైదరాబాద్ క స్టమ్స్ చీఫ్ కమిషనర్ ఆర్.శకుంతల పేర్కొన్నారు. దేశ ఆర్థికరంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కస్టమ్స్ విభాగం పనితీరు కూడా మారుతుందన్నారు. ఈ సందర్భంగా పలు విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో హైదరాబాద్ కస్టమ్స్ కమిషనర్ శ్రీధర్, అసిస్టెంట్ కమిషనర్లు, ఎగుమతి, దిగుమతి రంగాల్లోని వాణిజ్యవేత్తలు హాజరయ్యారు. -
జర్మనీతో అనుబంధం
యూరప్‌లో అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా మెరిసిపోతున్న జర్మనీతో భారత్‌కు మరింత సాన్నిహిత్యం ఏర్పడింది. జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ మూడు రోజుల భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాల అధినేతల మధ్యా శిఖరాగ్ర సమావేశం జరగడంతోపాటు 18 ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. వీటిలో రక్షణ, భద్రత, ఇంటెలిజెన్స్, రైల్వే రంగాలకు సంబంధించినవి ఉన్నాయి. కాలుష్య రహిత ఇంధన వనరులు, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడంలాంటి అంశాల్లోనూ రెండు దేశాలూ మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే జర్మనీ సంస్థలకు సత్వరం అనుమతులు లభించే ప్రక్రియను అమలు చేయడంపై ఒప్పందం కుదరింది. వచ్చే అయిదేళ్లలో భారత్‌లో సౌరశక్తి రంగంలో వివిధ ప్రాజెక్టుల అమలుకు వంద కోట్ల యూరోలు (రూ. 7,300 కోట్లు) వెచ్చించాలని జర్మనీ నిర్ణయించింది. ఆర్నెల్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీలో పర్యటించారు. ఆ సందర్భంగా భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని అక్కడి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. ‘మేకిన్ ఇండియా’ను విస్తృతంగా ప్రచారం చేశారు. ఇటీవల ఐక్యరాజ్య సమితి సమావేశాల సమయంలో మన దేశం చొరవతో న్యూయార్క్‌లో జరిగిన జీ-4 దేశాల సమావేశంలో మెర్కెల్ పాల్గొన్నారు. అయితే ఇరుదేశాలమధ్యా ఇటీవలికాలంలో ఏర్పడిన కొన్ని పొరపొచ్చాల ప్రభావమూ ఈ సమావేశాలపై ఉందని చెప్పాలి. కేంద్రీయ విద్యాలయాల్లో జర్మన్ భాషా బోధనను నిలిపేస్తూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిరుడు నవంబర్‌లో జారీచేసిన ఉత్తర్వు జర్మనీకి అసంతృప్తి కలిగించింది. ఇలా హఠాత్తుగా, ఏకపక్షంగా నిలిపేయడం తగదని పిల్లల తల్లిదండ్రులు కూడా నిరసన వ్యక్తం చేశారు. ఇది అనవసర వివాదం. సాంకేతిక రంగంలో అగ్రగామిగా ఉండటంతోపాటు ఆ రంగంలో అత్యుత్తమ శ్రేణి విద్యాబోధన చేస్తున్న జర్మనీ యూనివర్సిటీల్లో ఉన్నతస్థాయి చదువుల కోసం వెళ్లాలని ఇంజనీరింగ్ పట్టభద్రులు తహతహలాడతారు. వారు జర్మన్ భాష నే ర్చుకోవడం తప్పనిసరి. అలాంటపుడు విద్యాలయాల్లో ఆ భాషా బోధనను తొలగించడం సరైన నిర్ణయం కాదు. మెర్కెల్ వినతి మేరకు కేంద్రీయ విద్యాలయాల్లో జర్మన్ భాషా బోధనకు మన దేశం అంగీకరించింది. అదే సమయంలో తమ దేశంలో సంస్కృతంతోపాటు పలు భారతీయ భాషల బోధనకు జర్మనీ కూడా అంగీకరించింది. ఇక జీవీకే ఫార్మా సంస్థ ఔషధాల క్లినికల్ పరీక్షల ఫలితాలను తారుమారు చేసిందని ఆరోపిస్తూ మొన్న ఆగస్టులో 700 ఔషధాల అమ్మకాలపై ఈయూ నిషేధం విధించడం పర్యవసానంగా తలెత్తిన వివాదం మరొకటి. దీనికి నిరసనగా మన దేశం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) చర్చల నుంచి వైదొలగింది. మేథో హక్కులు, ఆటోమొబైల్ రంగంలో విధిస్తున్న టారిఫ్‌లు, ఈయూ ఎగుమతి చేసే వైన్, డైరీ ఉత్పత్తులకు పన్ను మినహాయింపులు వంటి అంశాల్లో ఏర్పడిన వివాదాలు సద్దుమణిగే దశలో ఈ ఔషధ అమ్మకాల నిషేధం సమస్య వచ్చిపడింది. ఈ విషయంలో చొరవ తీసుకుని ఈయూకు నచ్చజెప్పాలని, ఔషధ అమ్మకాలపై విధించిన నిషేధం తొలగింపజేయటంతోపాటు ఎఫ్‌టీఏ చర్చలు పునఃప్రారంభం కావడానికి చర్యలు తీసుకోవాలని మెర్కెల్‌ను మోదీ అభ్యర్థించారు. ఎఫ్‌టీఏపై అంగీకారం కుదిరితే అది భారత్, జర్మనీలకు మాత్రమే కాదు... ఈయూకి సైతం మేలు చేస్తుంది. ఎనిమిదేళ్లుగా నత్తనడకన సాగుతున్న ఎఫ్‌టీఏ చర్చలు ఏదో ఒక అంశంలో ఇబ్బందులు తలెత్తి నిలిచిపోతున్నాయి. ఈయూతో ఎఫ్‌టీఏపై అంగీకారం కుదిరితే ప్రధాన దేశమైన జర్మనీలో మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు విస్తృత అవకాశాలు ఏర్పడతాయి. అంతేకాకుండా జర్మనీ పెట్టుబడులు, ఆ దేశ ఉత్పత్తులు వెల్లువలా వస్తాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎఫ్‌టీఏ విషయంలో మెర్కెల్ ఏమేరకు తోడ్పడతారన్నది చూడాల్సి ఉంది. ఇక పరస్పర న్యాయ సహాయ ఒప్పందం(ఎంఎల్ఏటీ) కుదుర్చుకోవడం విషయంలో జర్మనీ ఆసక్తి ప్రదర్శించలేదని చెబుతున్నారు. భారత్‌లో ఉగ్రవాద నేరాలకు, ఇతర తీవ్రమైన నేరాలకు పాల్పడి జర్మనీలో తలదాచుకునే నేరస్తులను అప్పగించడానికి...అలాగే అక్కడ నేరాలు చేసి మన దేశంలో ఉంటున్నవారిని పంపించేందుకు ఈ ఒప్పందం అవకాశం ఇస్తుంది. అయితే మన దేశ చట్టాల్లో మరణశిక్షలు ఉండటంవల్ల దీన్ని కుదుర్చుకోవడం సాధ్యపడదని జర్మనీ తేల్చిచెప్పింది. జర్మనీ మరణశిక్షల్ని రద్దు చేయడమేకాక అలాంటి శిక్షలు అమలు చేసే దేశాలకు నేరస్తుల్ని అప్పగించడంలో సహకరించరాదన్న నియమం పెట్టుకుంది. ప్రస్తుతం ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ఉమ్మడిగా కృషి చేయాలని మోదీ, మెర్కెల్ నిర్ణయించారు. ఈ ఉమ్మడి ప్రకటన ఉక్రెయిన్ వివాదాన్ని ప్రస్తావించడం గమనార్హం. అక్కడి సంక్షోభాన్ని నివారించడానికి జరిగే దౌత్యపరమైన చర్యలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని రెండు దేశాలూ స్పష్టం చేశాయి. వాస్తవానికి ఉక్రెయిన్ విషయంలో రష్యా వ్యవహరిస్తున్న తీరును...ముఖ్యంగా క్రిమియాను అది విలీనం చేసుకోవడాన్ని జర్మనీ గట్టిగా వ్యతిరేకిస్తున్నది. రష్యాతో ఉన్న సాన్నిహిత్యంవల్ల మన దేశం మాత్రం ఆ అంశంలో అనిర్దిష్టంగానే ఉంది. అయినప్పటికీ ‘అన్ని దేశాల సార్వభౌమత్వానికీ, వాటి ప్రాదేశిక సమగ్రతకూ భారత్, జర్మనీలు గట్టిగా మద్దతిస్తున్నాయని’ ఉమ్మడి ప్రకటన స్పష్టంచేసింది. ఇప్పటికైతే రెండు దేశాలమధ్యా కుదిరిన ఒప్పందాలు మౌలికంగా ఆర్థికాంశాలకు సంబంధించినవే. ఇవి వ్యాపార, వాణిజ్య రంగాలకు విస్తరించాల్సి ఉంది. మిగిలిన యూరప్ దేశాలు ఆర్థికంగా అంతంతమాత్రంగానే ఉన్న ప్రస్తుత దశలో భారత్‌తో చెలిమి అత్యంత ముఖ్యమని జర్మనీ భావిస్తున్నది. కనుక భవిష్యత్తులో రెండు దేశాలమధ్యా బహుళ రంగాల్లో దృఢమైన బంధం ఏర్పడగలదని ఆశించవచ్చు.