'ఆర్ 3' పై సుబ్రహ్మణ్య స్వామి మరోసారి దాడి
న్యూఢిల్లీ: ఆర్బీఐ గవర్నర్ రఘు రామ్ రాజన్ పై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి మరోసారి విమర్శలకు దిగారు. రాజన్ ను 'ఆర్ 3' అని పేర్కొన్న స్వామి దేశంలో రుణాత్మక ద్రవ్యోల్బణ పరిస్థితులకు ఆయనే కారణమంటూ నిందించారు. దీనికి ఐఎంఎఫ్ ప్రకటించిన తాజా పత్రాన్ని ఆయన కోట్ చేశారు. రాజన్ అనుసరించిన వడ్డీ రేట్ల విధానమే ద్రవ్యోల్బణానికి కారణమన్న సత్యాన్ని ఐఎంఎఫ్ పత్రం తేటతెల్లం చేసిందని ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. మరికొన్ని వారాల్లో రాజన్ పదవీ కాలం ముగియనుండగా స్వామి తన ఘాటు వ్యాఖ్యలకు మరింత పదును పెట్టడం విశేషం.
2013, సెప్టెంబర్ లో ఆర్ బీఐ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తరవాత, రాజన్ క్రమంగా స్వల్పకాలిక లెండింగ్ రేట్లను 7.25 శాతం నుంచి 8 శాతం పెంచారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి తీవ్ర ఒత్తిడి ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణ కారణాలను చూపుతూ 2014వరకు అదే రేట్లను కొనసాగించారు. అయితే జనవరి 2015 లో రేట్లు తగ్గించే ప్రక్రియ ప్రారంభమైంది. అప్పటి నుంచి 6.50 శాతంనుంచి 1.50శాతం మేర తగ్గించారు.
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వర్కింగ్ పేపర్ ను కోట్ చేసిన స్వామి రాజన్ పై తన విమర్శలను మరోసారి సమర్థించు కున్నారు. వడ్డీరేట్లను అత్యధిక స్థాయిలో ఉంచి దేశ ఆర్థిక వృద్ధి నాశనానికి కారణమవుతున్నాడని, ఆయన మన దేశానికి పనికిరాడంటూ రాజన్ పై గతంలో పలుసార్లు విరుచుకుపడిన సంగతి తెలిసిందే.
Now IMF has in effect debunked that interest rate raising madness of R3 had a role in inflation control. Personal? pic.twitter.com/Xa2qiFjP6P
— Subramanian Swamy (@Swamy39) August 19, 2016