రోజూ నాకు 200 మిస్డ్ కాల్స్ వస్తాయి!
పబ్లిసిటీ నన్నే వెంటాడుతోంది..
పబ్లిసిటీ మోజుతోనే బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ తోసిపుచ్చారు. కానీ సుబ్రహ్మణ్యస్వామి మాత్రం పబ్లిసిటీ కోసం తానేమీ చేయడం లేదని, పబ్లిసిటీనే తనను వెంటాడుతోందని చెప్తున్నారు.
తనను మోదీ ఏమన్నా.. ఆయనకు తాను అండగా ఉంటానని చెప్పుకొచ్చిన స్వామి.. పనిలోపనిగా మీడియాపై మండిపడ్డారు. మీడియా కావాలనే తప్పుడు కథనాలు రాసి.. తనను రెచ్చగొట్టాలని చూస్తోందని అన్నారు. ‘పబ్లిసిటీయే స్వయంగా ఓ రాజకీయ నాయకుడిని వెంటాడటం నిజంగా కొత్త సమస్యే. నా ఇంటి ముందు 30వరకు ఓబీ లైవ్ వ్యాన్లు ఉంటాయి. రోజూ చానెళ్లు, జర్నలిస్టుల నుంచి 200కుపైగా మిస్డ్ కాల్స్ నాకు వస్తాయి’ అని స్వామి ట్వీట్ చేశారు.
‘నన్ను రెచ్చగొట్టాలనే ఆశతో ప్రెస్టిట్యూట్లు రోజూ ఉద్దేశపూరితంగా తప్పుడు కథనాలు రాస్తున్నారు. హా వాళ్ల ఆశ చూడండి’ అని మరో ట్వీట్ పేర్కొన్నారు. నేను ఇంతకుముందు చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను. ఏదిఏమైనా ఎన్ని కష్టాలు వచ్చినా మోదీకి నేను అండగా ఉంటాను. ఆయన ధైర్యాన్ని నేను మెచ్చుకుంటాను. ఆయనను ఏ విదేశీ శక్తి అణచలేదు’ అని స్వామి అన్నారు. ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్, ఆర్థిక అధికారులపై స్వామి చేసిన ఆరోపణలను ప్రధాని మోదీ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.