ఆర్‌బీఐ కొత్త గవర్నర్ ఉర్జిత్ పటేల్
- ఉత్కంఠకు తెరదింపిన కేంద్రం
- డిప్యూటీ గవర్నర్ నుంచి పదోన్నతి
- సెప్టెంబర్ 4న బాధ్యతలకు అవకాశం
న్యూఢిల్లీ : ఎట్టకేలకు ఒక ఉత్కంఠకు కేంద్రం శనివారం తెరదింపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) కొత్త గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ పేరును ఖరారు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ద్రవ్య విధానం, ద్రవ్యోల్బణం విభాగాలకు ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్నారు. ద్రవ్యోల్బణంపై పోరు సాగించడంలో ‘రాజన్ ఇన్‌ఫ్లేషన్ వారియర్’గా పటేల్‌కు పేరుంది. సెప్టెంబర్4వ తేదీతో ప్రస్తుత గవర్నర్ రఘురామ్ రాజన్ పదవీకాలం పూర్తవుతుంది. అదే రోజు ఆర్‌బీఐ 24వ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఆర్‌బీఐ గవర్నర్ పదవీకాలం మూడేళ్లు. డిప్యూటీ గవర్నర్‌గా ఉంటూ... గవర్నర్ బాధ్యతలు చేపడుతున్న ఏడవ వ్యక్తి పటేల్. ఆర్‌బీఐ కొత్త గవర్నర్ నియామకంపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేక సమావేశం జరిపిన 48 గంటల లోపే తాజా వార్త వెలువడ్డం గమనార్హం.
అపార అనుభవం...
52 సంవత్సరాల పటేల్, 1963 అక్టోబర్ 28న జన్మించారు. యేల్ యూనివర్సిటీ నుంచి 1990లో ఆర్థికరంగంలో డాక్టరేట్ తీసుకున్నారు. అంతక్రితం 1986లో ఆక్స్‌ఫర్డ్‌లో ఎంఫిల్ చేశారు. 1990-1995 మధ్య అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)లో పనిచేసిన ఆయన, అమెరికా, భారత్, బహమాస్, మయన్మార్ ఆర్థిక అంశాలను పర్యవేక్షించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో కూడా గతంలో పనిచేశారు. డిప్యూటీ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌కు సంబంధించి ఎనర్జీ, ఇన్‌ఫ్రా సలహాదారుగా ఉన్నారు. 1998-2001 మధ్య భారత్ ఆర్థిక వ్యవహారాల శాఖలో కన్సల్టెంట్‌గా బాధ్యతలు నిర్వహించారు. మూడేళ్ల పదవీ కాలానికి సంబంధించి 2013 జనవరి 11న ఆయన డిప్యూటీ గవర్నర్‌గా నియమితులయ్యారు.
ఈ ఏడాది జనవరిలో ఆయన పదవీ కాలాన్ని కేంద్రం పొడిగించింది. రిజర్వ్ బ్యాంక్‌లో ప్రస్తుత సంస్కరణలకు ప్రాతిపదికగా ఉన్న పరపతి విధాన నివేదిక రూపకల్పన బృందానికి కూడా ఆయన నేతృత్వం వహించారు. ద్రవ్యోల్బణం లక్ష్యాల సాధన, రెపో రేటుసహా కీలక రేట్లను ఒక్క గవర్నర్ కాకుండా ఏకాభిప్రాయ ప్రాతిపదికన నిర్ణయం తీసుకునే ఆరుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు వంటి కీలక సంస్కరణలకు ఈ నివేదికే ప్రాతిపదిక. అలాగే ద్రవ్యోల్బణం లక్ష్యం 4 శాతం మేర(2 శాతం ప్లస్ లేదా మైనస్) వుండాలనేది పటేల్ కమిటీ తీసుకున్న నిర్ణయమే. ఈ నిర్ణయాన్నే ఇటీవల కేంద్రం ఆమోదించింది కూడా.
రాజన్‌కు వారసుడే....
రఘురామ్ రాజన్ తరహాలోనే ద్రవ్యోల్బణంపై కఠిన వైఖరిని పటేల్ అవలంబిస్తారు. ఈ వైఖరి కారణంగానే భారత్ కరెన్సీ మార్కెట్‌కు స్థిరత్వం వుందని విశ్వసించే విదేశీ ఇన్వెస్టర్లకు ఉర్జిత్ పటేల్ నియామకం ఊరటనిస్తుంద న్నది విశ్లేషకుల అంచనా. తాజా నియామకంతో రేట్ల కోతపై ఆర్‌బీఐ సరళంగా వుండదన్న అభిప్రాయాన్ని స్టాక్ మార్కెట్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. భవిష్యత్తులో వడ్డీ రేట్ల నిర్ణయం ఆర్‌బీఐ కమిటీ మెజారిటీ సభ్యులదే అయినప్పటికీ, సభ్యుల ఓట్లు సరిసమానంగా వుంటే ఆర్‌బీఐ గవర్నర్ ఓటు కీలకమవుతుంది. ఈ సందర్భంలో ఉర్జిత్ పటేల్ రేట్ల కోతకు మొగ్గుచూపరన్నది మార్కెట్ వర్గాల భావన.
పటేల్ ముందున్న సవాళ్లు
కొత్త గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్న ఉర్జిత్ పటేల్‌కు తక్షణ సవాళ్లు పొంచివున్నాయి. 20-25 బిలియన్ డాలర్ల విలువైన విదేశీ కరెన్సీ బాండ్లకు రానున్న నెలల్లో భారత్ చెల్లింపులు జరపాల్సివుంది. రూపాయి విలువ అస్థిరతకు లోనుకాకుండా ఇంత పెద్ద మొత్తంలో డాలరు చెల్లింపులు చేయడం ప్రస్తుతం ఆర్‌బీఐ ముందున్న తక్షణ కర్తవ్యం. 2013లో రూపాయి విలువ నిలువునా పతనమవుతున్న సమయంలో విదేశీ కరెన్సీ బాండ్ల ద్వారా ఈ మొత్తాన్ని సేకరించాలన్న నిర్ణయాన్ని అప్పట్లో ఆర్‌బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తీసుకున్నారు. మూడేళ్ల కాలపరిమితిగల ఆ బాండ్ల పునర్‌చెల్లింపు ఈ సెప్టెంబర్ నుంచి మొదలుకానుంది. ఇక బ్యాంకింగ్ వ్యవస్థలో పేరుకుపోతున్న మొండి బకాయిల సమస్యపై పటేల్ పోరాడాల్సివుంది. బ్యాంకుల బ్యాలెన్స్ షీట్స్ శుద్దిచేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ప్రస్తుత గవర్నర్ రఘరామరాజన్ 2017 మార్చికల్లా దీనిని పూర్తిచేయాలన్న డెడ్‌లైన్ బ్యాంకులకు విధించారు. ఇది పరిపూర్తి చేయాల్సిన సవాలు పటేల్ ముందు వుంది.