సంఘ్ పరివార్ ఆశీస్సులున్నవారికే కీలక పదవులు ఖాయమవుతున్నాయని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్ ఎంపిక కూడా అందుకు భిన్నంగా ఉండకపోవచ్చునని వెలువడిన అంచనాలు తారుమారయ్యాయి. వచ్చే నెలలో పదవినుంచి నిష్క్రమించబోతున్న ప్రస్తుత గవర్నర్ రఘురాం రాజన్ స్థానంలో ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఎంపికయ్యారు. ఆర్‌బీఐ గవర్నర్‌పై ఈసారి జరిగినంత చర్చ, హడావుడి ఇంతకుముందెన్నడూ లేదు. ఆ పదవిలో ఉన్నవారు ప్రభుత్వంతో విభేదించడం కొత్తేమీ కాదు. కానీ రాజన్ తీరుతెన్నులే వేరు. వడ్డీ రేట్ల కోత మొదలుకొని పలు అంశాల్లో ఆయన పాలకుల ఆశలకు అనుగుణంగా వ్యవహ రించలేకపోవడమే కాదు... అన్వయానికొచ్చేసరికి అంతరార్ధమే మారిపోవచ్చునన్న భయం కూడా లేకుండా మాట్లాడారు.
ఒక్కోసారి అసలు కంటే ఈ విసురులే అధికార పక్షాన్ని బాధించాయి. దేన్నయినా ఒక ఎజెండాగా మార్చి వెంటపడటంలో సిద్ధహస్తుడైన బీజేపీ నేత, ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తన బాణాలు రాజన్‌పై ఎక్కు పెట్టినప్పుడు దాని వెనక ప్రభుత్వంలోనివారే ఉండొచ్చునని చాలామంది భావించ డానికి కారణం అదే. ప్రధాని నరేంద్ర మోదీ ఆలస్యంగానైనా జోక్యం చేసుకుని ఆయనను అదుపు చేయడం, ఈలోగా రెండో దఫా ఈ పదవిని చేపట్టబోనని రాజన్ ప్రకటించడంతో ఆ అంకం సద్దుమణిగింది. అయితే రాజన్ ప్రకటన వాణిజ్య, పారిశ్రామిక వర్గాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో ఎవరూ మరిచిపోలేదు. ఆయన విధానాలను విమర్శించినవారు సైతం రాజన్‌నే కొనసాగించడం దేశ ఆర్థిక వ్యవస్థకు అన్నివిధాలా శ్రేయస్కరమని అప్పటినుంచీ సందర్భం దొరికినప్పుడల్లా చెబుతూ వస్తున్నారు. ఈ విషయంలో నిర్దిష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించని కేంద్రం చివరకు ఉర్జిత్‌ను ఎంపిక చేయడం ద్వారా విధానపరమైన అంశాల్లో యధా తథ స్థితి కొనసాగుతుందన్న సంకేతాలు ఇచ్చినట్టు కనబడుతోంది.
రిజర్వ్ బ్యాంకు అన్నది మౌలికంగా ప్రభుత్వానికి చెందిన కీలక అంగం. దానికి సారధ్యంవహించేవారు ద్రవ్యపరమైన అంశాల్లో, ఇతర నియంత్రణల్లో ప్రభు త్వంతో కలిసి పనిచేయక తప్పదు. వారు సర్వ స్వతంత్రంగా వ్యవహరించలేరు. అలాగని ప్రభుత్వానికి డూడూ బసవన్నల్లా మెలిగి చెప్పిందల్లా చేయడమే తమ విధి అన్నట్టు ప్రవర్తిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థమవుతుంది. ఈ విషయంలో ఆర్‌బీఐ గవర్నర్లుగా గతంలో పనిచేసినవారు తగినంత అప్రమత్తతతోనే ఉన్నారు. వడ్డీ రేట్ల కోత విషయంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో అప్పటి కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం తీవ్రమైన ఒత్తిళ్లు తీసుకొచ్చినా ఆ సమయంలో ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉన్న దువ్వూరి సుబ్బారావు లొంగలేదు. బహిరంగంగా చిదంబరం విరుచుకుపడినా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. అంతగాకపోయినా అలాంటి స్థితే రాజన్‌కూ ఏర్పడింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ప్రభుత్వ పరంగా చేయాల్సిందంతా చేస్తున్నా...ఆర్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గించని కారణంగా బండి ముందుకు కదలడం లేదని సుబ్రహ్మణ్యస్వామి నేరుగా అని ఉండొచ్చుగానీ అలాంటి అభిప్రాయమే కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీలో కూడా ఉంది.
వృద్ధి రేటు బాగున్నది గనుక ఆర్‌బీఐ చేయాల్సింది చేస్తుందన్న విశ్వాసాన్ని ఆయన చాలాసార్లు వ్యక్తం చేశారు. ఆ ‘చేయాల్సింది’ వడ్డీ రేట్ల కోతేనని వేరే చెప్పనవసరం లేదు. కానీ రాజన్ మాత్రం దృఢంగా ఉన్నారు. జీడీపీ గణాంకాలు ఎంతగా మెరిసి పోతున్నా ఆయన నిగ్రహం చెక్కుచెదరలేదు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే గొప్పగా ఉన్నదని ఐఎంఎఫ్ లాంటి సంస్థ సర్టిఫికెట్ ఇచ్చినా మనం ఇంకా సంతృప్తికర స్థాయికి చేరుకోలేదని నిర్మొహమాటంగా చెప్పారు. దేశ పురోగతికి ఆర్థిక వృద్ధి కొలమానం కావొచ్చుగానీ అదే పూర్తిస్థాయిలో వాస్తవ స్థితిని ప్రతిబిం బించలేదని అన్నారు. ఇలా అనడం, అందుకు తగినట్టుగా విధానాలు నిర్ణయించి అమలు చేయడం ఏటికి ఎదురీదడం. మొదటినుంచీ ఆయన దృష్టంతా వృద్ధి రేటుపై కాక ద్రవ్యోల్బణంపై ఉంది. దానికి కళ్లెం వేసి ధరల స్థిరత్వాన్ని సాధిం చాలని ఆయన భావించారు. అటు కేంద్రం సైతం వచ్చే అయిదేళ్లలో ద్రవ్యో ల్బణాన్ని 4 శాతం దాటనివ్వరాదన్న లక్ష్యంతో ఉంది. మరి వైరుధ్యం ఎక్కడొ చ్చింది? వడ్డీ రేట్ల కోతతో మార్కెట్‌లోకి భారీగా పెట్టుబడులొస్తాయని, పర్యవసా నంగా కార్యకలాపాలు పుంజుకొని ఉపాధి, వినిమయం వంటివి పెరిగి జీడీపీ పరుగులు పెడుతుందని ప్రభుత్వ అంచనా. ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయకపోతే వడ్డీ రేట్ల కోతతో మార్కెట్‌లోకి ప్రవేశించే పెట్టుబడులన్నీ ధరల ఉప్పెనలో కొట్టుకుపోతాయని రాజన్ ఆందోళన.
ఇప్పుడు రాజన్ స్థానంలో రాబోతున్న ఉర్జిత్ పటేల్ ఇలా స్వతంత్రంగా వ్యవ హరించగలరా? ఆయన ముందు చాలా సవాళ్లున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగాన్ని పీడిస్తున్న మొండి బకాయిల విషయంలో రాజన్ ప్రారంభించిన పోరాటాన్ని కొనసాగించాల్సి ఉంది. ఎగవేతదార్లనుంచి ముక్కుపిండి వసూలు చేయాల్సి ఉంది. రూపాయి విలువను కంటికి రెప్పలా కాపాడటం మరో ముఖ్యౖ మెన బాధ్యత. ఉర్జిత్ అప్పటి యూపీఏ పాలకులకైనా, ఇప్పటి ఎన్‌డీఏ పాల కులకైనా ఇష్టుడే. 2013లో ఆయన్ను రిజర్వ్‌బ్యాంక్ డిప్యూటీ గవర్నర్‌గా తీసుకు రాదల్చుకున్నప్పుడు అప్పటికి అమెరికా గ్రీన్‌కార్డు ఉన్న ఉర్జిత్‌కు భారతీయ పౌరసత్వమివ్వాలంటూ సిఫార్సు లేఖ రాసింది నాటి ప్రధాని మన్మోహన్ సింగే.
గుజరాత్ మూలాలున్నాయి గనుకా, ఆయన పనితీరు తెలుసు గనుకా నరేంద్ర మోదీకి సైతం ఆయన నచ్చినట్టున్నారు. వచ్చే అయిదేళ్లలో ద్రవ్యోల్బణం 4 శాతం మించకూడదన్న నిర్ణయం వెనక సూత్రధారి ఉర్జిత్ పటేలే. వడ్డీ రేట్లతోపాటు అన్ని కీలకాంశాలనూ నిర్ణయించడానికి ఇకపై ఆర్‌బీఐకి ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలన్న కేంద్ర నిర్ణయం ఆయన ఇచ్చిన నివేదిక పర్యవసానంగా రూపొందిందే. అయితే అలాంటి కమిటీ ఏర్పాటైతే కొత్త పదవిలో ఉర్జిత్ ఏమేరకు స్వతంత్రంగా వ్యవహరించగలరో, ఎంతవరకూ తన లక్ష్యాన్ని నెరవేర్చుకోగలరో చెప్పడం కష్టమే.