
వ్యక్తికన్నా... వ్యవస్థ ముఖ్యం
రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్‌గా రఘురామ్ రాజన్ పదవీ విరమణ..
‘రెగ్జిట్’పై ఎస్‌బీఐ నివేదిక...
ముంబై: రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్‌గా రఘురామ్ రాజన్ పదవీ విరమణ.. సంస్థ కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం చూపబోదని ప్రభుత్వ రంగ బ్యాకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఎకనమిక్ రిసెర్చ్ వింగ్ తన తాజా పరిశీలనా పత్రంలో పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఒక అత్యున్నత స్థాయి సంస్థని పేర్కొన్న ఎస్‌బీఐ వ్యక్తికన్నా.. వ్యవస్థ ముఖ్యమని పేర్కొంది. రాజన్ పదవీ విరమణ ప్రకటన అనంతరం జరుగుతున్న చర్చ, ఊహాగానాలు అర్థం లేనివని సైతం పేర్కొంది.
ఒక సంస్థ విశ్వసనీయత, స్వతంత్రతకే ప్రాముఖ్యత తప్ప మరి దేనికీ కాదని నివేదిక విశ్లేషించింది. దూరదృష్టి, ఆచరణీయత, స్వతంత్రతతో పనిచేసిన చరిత్ర ఆర్‌బీఐ సొంతమనీ పేర్కొంది. ద్రవ్యోల్బణంపై ఆర్‌బీఐ పోరాటం రాజన్ నేతృత్వంలోనే ప్రారంభంకాలేదని, ఇది 1983 నుంచీ ఈ పోరాటం కొనసాగుతూనే ఉందని పేర్కొంది. ఆర్‌బీఐ దీర్ఘకాల ద్రవ్యోల్బణం లక్ష్యం 4 శాతం కాకుండా 5 శాతంగానే ఉండాలని సైతం ఎస్‌బీఐ డాక్యుమెంట్ సూచించింది.
47 శాతం పెరిగిన ఎస్‌బీఐ ఏటీఎం ఆదాయం
ఎస్‌బీఐ ఏటీఎం ఆదాయం 2015-16 ఆర్థిక సంవత్సరం 2014-15 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 47 శాతం పెరిగి రూ.310.44 కోట్లకు చేరింది.