ఆర్ బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఎగ్జిట్ పై జరిగిన తతంగమంతా అనవసర చర్చని మాజీ ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా వ్యాఖ్యానించారు. కేవలం ఒకే ఒక్క వ్యక్తిపై ఇంత పెద్ద దేశం ఆధారపడదని, రెగ్జిట్ ప్రకటన కొంత వివాదస్పదకు దారితీసిందని నొక్కి చెప్పారు. రాజన్ దేశానికి ప్రధాన మంత్రేమి కాదని, కనీసం ఆర్థిక మంత్రి కూడా కాదన్నారు. ఆర్థిక వ్యవస్థలో అతనికి కేటాయించిన బాధ్యతను అతను విజయవంతంగా నిర్వర్తించాడని సిన్హా పేర్కొన్నారు.
చాలామంది గవర్నర్లు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారని, ఎలాంటి సమస్యలు రాలేదని చెప్పారు. రఘురామ్ రాజన్ చుట్టూ జరిగిన వివాదాలు పూర్తిగా తోసిపుచ్చాల్సిన అంశాలని వ్యాఖ్యానించారు. కేవలం హైప్ క్రియేట్ చేయడానికి ఈ అనవసరం చర్చంతా జరిగిందని చెప్పారు. రెగ్జిట్ జరిగితే, భారత ఆర్థికవ్యవస్థ కుప్పకూలుతుందనే కామెంట్లను ఆయన కొట్టిపారేశారు. ఒక వ్యక్తి కంటే దేశం పెద్దదని రెగ్జిట్ ప్రభావం దేశ ఆర్థికవ్యవస్థపై ఉండదని పేర్కొన్నారు.
ఆహార ధరల ద్రవ్యోల్బణం టార్గెట్ కంటే టోకుఆధారిత ద్రవ్యోల్బణంపై పోరాడటం మంచి విధానమని, కఠిన ద్రవ్యవిధాన వైఖరి పెట్టుబడులు, ఆహార ధరలపై నెగిటివ్ ప్రభావం చూపిందన్నారు. నెగిటివ్ డబ్ల్యూపీఐ తో కఠిన ద్రవ్యవిధాన వైఖరి ఏమీ సాధించదని సిన్హా ఎకనామిక్ టైమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. వడ్డీరేట్ల పెంపు, పెట్టుబడులను తగ్గించదనే అభిప్రాయం వెల్లబుచ్చారు. కాని ఆహార కొనుగోలుల్లో ఎలాంటి ప్రభావం చూపలేదన్నారు.