గవర్నర్ హోదా పెంచండి - రాజన్ అల్విదా
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా రఘురామ్ రాజన్ వీడ్కోలు ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. కేంద్ర బ్యాంకు స్వతంత్రాన్ని కాపాడాలన్న వాదనను మరోసారి సమర్ధించుకున్న రాజన్.. ఆర్బీఐ గవర్నర్ హోదాను పెంచాలని కోరారు. గవర్నర్కు ప్రస్తుతం కేబినెట్ సెక్రటరీ హోదా ఉంది.
రిజర్వ్ బ్యాంకు స్వేచ్ఛను కాపాడాలని ఉద్ఘాటించిన రాజన్, భారతదేశంలో అసమానమైన ప్రాముఖ్యత ఉన్న స్థూల ఆర్ధిక స్థిరత్వానికి బలమైన, స్వతంత్ర రిజర్వ్ బ్యాంక్ అవసరం చాలా ఉందని పేర్కొన్నారు. బ్యాంక్ పాత్రను ప్రభుత్వం స్పష్టంగా పేర్కొనాల్సిన అవసరం ఉందని చెప్పారు. తద్వారా సంస్థ సామర్థ్యాన్ని కాపాడాలన్నారు. సంస్థలో తన మిగులునుంచి ప్రభుత్వానికి ప్రత్యేక డివిడెండ్ చెల్లిస్తోందని తెలిపారు. ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ కింద పని చేయాలి తప్ప, ఇతర అన్ని నిరోధకాలకు, ఆటంకాలకు అనువుగా ఉండకూదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
కాగా రేపటితో (సెప్టెంబర్ 4, ఆదివారం) రాజన్ పదవీ కాలం ముగియనుంది. నూతన గవర్నర్ గా ఊర్జిత్ పటేల్ మంగళవారం బాధ్యతలను స్వీకరించనున్న సంగతి తెలిసిందే.