
నిజం... నిష్టూరం
చూడబోతే కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికి వివాదాల్లో ఉన్న ఆసక్తి మరెందులోనూ ఉన్నట్టు లేదు.
చూడబోతే కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికి వివాదాల్లో ఉన్న ఆసక్తి మరెందులోనూ ఉన్నట్టు లేదు. లేకపోతే రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ మన ఆర్థిక వృద్ధి వేగం సాపేక్షిక స్వభావం గురించి చేసిన వ్యాఖ్యలపై ఇంత దుమారం రేగి ఉండేది కాదు. ఆర్థికంగా అత్యంత నిరాశామయమైన స్థితిలోని వర్తమాన ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ ‘దేదీప్యమానమైన ప్రాంతాలలో ఒకటి’ అని ఐఎమ్‌ఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఇటీవల తరచుగా అభివర్ణి స్తున్నాయి. భారత్ అలాంటి స్థానంలో ఉండటానికి కారణమైన రహస్య ఔషధం ఏమిటని గత వారం చివర్లో ఒక విదేశీ పత్రిక విలేకరి సంధించిన ప్రశ్నకు సమాధానంగా రాజన్.. భారత్ ఇంకా సంతృప్తికరమైనదిగా భావించగల స్థానానికి చేరలేదని, ‘అంధుల దేశానికి ఒంటి కన్ను ఉన్నవాడే రాజు’ అనే నానుడిలాంటిదే ఇది అని వ్యాఖ్యానించారు.
ఆయన చేసిన వ్యాఖ్యలో వివాదాస్పదమైనది, అభ్యం తరకరమైనది ఏమైనా ఉందంటే అది ఆ వ్యాఖ్య అంధులను చిన్నబుచ్చేదిగా ఉన్నదనేదే. అందుకు ఆయన ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఆయన వ్యాఖ్యలు ఆగ్రహం కలిగించాయనేది స్పష్టమే. ఆర్థిక మంత్రి సహా ముగ్గురు కేంద్ర మంత్రులు రాజన్ వ్యాఖ్యలపట్ల వెలిబుచ్చిన ఆగ్రహమే అందుకు నిదర్శనం. రాజన్ సరైన మాటలను ఎంచుకోవాల్సిందన్నారు వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్. కానీ, ఆర్‌బీఐ గవర్నర్‌పై కలిగిన ఆగ్రహానికి కారణం ఆయన ప్రయోగించిన పదాలు కాదు, వాటి అర్థాలు, అంతరార్థాలే.
దేశ పురోగతికి ఆర్థిక వృద్ధి ఎప్పుడూ సాపేక్షిక కొలమానమే తప్ప, అదే వాస్తవ స్థితిని తెలియజేయదని రాజన్ అన్నారు. వివాదాస్పదంగా మారిన ఆ ఇంటర్వ్యూలోనూ, ఆ తదుపరి ఇచ్చిన వివరణలోనూ కూడా ఆ విషయాన్నే స్పష్టం చేశారు. ఒక ఆర్థిక నిపుణుడిగా, కేంద్ర బ్యాంకు అధిపతిగా అది తప్పక గుర్తు చేయాల్సిన వాస్తవం కూడా. ప్రపంచ వృద్ధి, ప్రత్యేకించి చైనా వృద్ధి సైతం మందకొడిగా సాగుతున్న నేపథ్యంలోనే భారత్‌కు ‘అత్యంత వేగంగా వృద్ధి చెందు తున్న ఆర్థిక వ్యవస్థ’ ఖ్యాతి దక్కింది. 1960లలో మనకంటే వెనుకబడి ఉన్న చైనా, మన దేశం కంటే పది రెట్లు అభివృద్ధిని సాధించిందని, మనం దానికంటే ఒక దశాబ్ది వెనుకబడి ఉన్నామనేది తిరుగులేని వాస్తవం. వస్తు తయారీ రంగంలో దాదాపు 50 శాతం ఉత్పత్తి సామర్థ్యం నిరుపయోగంగా ఉన్న దుస్థితి మనది.
ఇలాంటి పరిస్థితిలో 7.5 శాతం వృద్ధిని మరే దేశం సాధించగలదని? ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిలదీయడం రాజకీయం అవుతుందే గానీ, ఆర్థిక నీతి కాజాలాదు. రాజన్ అన్నట్టే వృద్ధి రేట్ల కంటే తలసరి స్థూల జాతీయోత్పత్తి దేశ వాస్తవ ఆర్థిక స్థితిని కొంత మేరకు సరిగ్గా ప్రతిబింబిస్తుంది. భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద సంఖ్యలో పేదలున్న దేశంగానే మిగిలి ఉన్నదనే చేదు వాస్తవం దాచేస్తే దాగేది కాదు. పైగా ప్రభుత్వాలు, విధాన కర్తలు ఆ వాస్తవాన్ని విస్మరించడం ప్రమాద కరం. భారత్ ‘దేదీప్యమానమైన ప్రాంతం’, ‘అతి వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ’ అంటూ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు చేస్తున్న వర్ణనలు మనల్ని సరిగ్గా ఆ ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది. కాబట్టే వృద్ధి రేట్ల వంటి సాపేక్షిక ప్రమాణాల వెనుక ఉన్న వాస్తవాలను ఎన్నడూ విస్మరించడానికి వీల్లేదు. ఆ మాటే రాజన్ చెప్పారు.
వివాదాస్పాదంగా మారిన ఆ వ్యాఖ్యలతో పాటూ రాజన్, మోదీ ప్రభుత్వం సహా వివిధ ప్రభుత్వాలు ఆర్థిక రంగంలో సాధించిన విజయాలను, భారత ఆర్థిక వ్యవస్థలోని బలమైన అంశాలను, వృద్ధికి ఉన్న అవకాశాలను కూడా ఆ ఇంట ర్వ్యూలో ఏకరువు పెట్టారు. అయినా కేంద్ర మంత్రులకు అవేవీగాక భారత వృద్ధిపై ఆయన చేసిన వ్యాఖ్యలే పట్టడంలో ఆశ్చర్యం లేదు. ముక్కుకు సూటిగా మాట్లాడే రాజన్ కు ఆర్థిక నీతే తప్ప రాజకీయ నీతి గురించి తెలిసినట్టు లేదు. లేకపోతే కీలకమైన ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల పోరులో బీజేపీ ప్రభుత్వం తలమునకలవుతున్న సమయంలో ఆర్‌బీఐ నోటి నుంచి ఇలాంటి చేదు నిజాలు ఓటరు చెవిన పడరాదనే రాజనీతి సూక్ష్మాన్ని ఆయన గ్రహించి ఉండేవారేమో.
రిజర్వు బ్యాంకు గవర్నర్, ఆర్థిక నిపుణులుగా ఆర్థిక వ్యవస్థ వాస్తవ స్థితిని దృష్టిలో ఉంచుకుని స్వతంత్రంగా ద్రవ్య విధానాన్ని నియంత్రిస్తారు. ఈ స్వయం ప్రతి పత్తికి ఎసరు పెట్టాలని గత ప్రభుత్వాలే కాదు, నేటి ప్రభుత్వమూ తీవ్రంగా ప్రయ త్నిస్తూనే ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే గత ఏడాది కేంద్ర ఆర్థిక మంత్రి త్వశాఖ కింద పనిచేసే ఆర్థిక రంగ చట్ట సంస్కరణల కమిషన్ తయారు చేసిన దంటూ భారత ఫైనాన్స్ కోడ్ (ఐఎఫ్‌సీ) అనే వివాదాస్పద విధాన పత్రాన్ని విడు దల చేసింది. ఆ వివాదం పలు మలుపులు తిరిగాక చివరికి ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. అయినా ఆర్‌బీఐ చేతిలోని ద్రవ్య విధానాన్ని రాజకీయ అవసరాలకు వాడుకోవాలనే దుగ్ధ కేంద్రాన్ని వీడటం లేదు. అది నేటి ఎన్‌డీఏ ప్రభుత్వానికే పరిమితమైన కాంక్ష కాదు.
గత ప్రభుత్వ హయాంలో రెండంకెలు పైబడ్డ ద్రవ్యోల్బణం ఉండగా వడ్డీ రేట్ల తగ్గింపు కోసం ఆర్థిక మంత్రి చిదంబరంనాటి ఆర్‌బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావుపై తీవ్రమైన ఒత్తిడి తేవడమే కాదు, బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్‌బీఐ గవర్నర్‌కు, ప్రభుత్వానికి మధ్య ఈ ఘర్షణ సాగుతూనే ఉంది. రాజన్ బహిరంగ వ్యాఖ్యలు ఎన్‌డీఏ ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించడం ఇదే మొదటిసారి కాదు.
చైనా ఆర్థిక వృద్ధి మందగించిన సందర్భంగా ఆర్థిక మంత్రి జైట్లీ, ప్రపంచ వృద్ధికి చోదక శక్తిగా చైనా స్థానంలో భారత్ ప్రవేశిస్తుందని జోస్యం చెప్పారు. ఆ సందర్భంగా కూడా రాజన్ మనం చైనా కంటే వేగంగా వృద్ధి చెందినా, దాని ఆర్థిక వ్యవస్థలో నాలుగో వంతుగా ఉన్న మనకు, దానికి అంతరం చాలానే ఉంటుందనీ, దాన్ని అధిగమించడానికి చాలా కాలమే పడుతుందని ఉన్న వాస్తవాన్ని నిర్మొహమాటంగా చెప్పి జైట్లీని ఇరకాటంలో పెట్టారు. దాద్రీ హత్యాకాండ తదుపరి దేశంలో పెరుగుతున్న అసహనం నేపథ్యంలో ఆయన.. ప్రశ్నించడానికి, సవాలు చేయడానికి హక్కు ఉండటం వృద్ధి చెందడానికి ఆవశ్యకమని అన్నారు. ఎలాంటి లౌక్యం ప్రదర్శించకుండా నిర్మొహ మాటంగా మాట్లాడే ఆర్‌బీఐ గవర్నర్‌పై మండిపడి రభస చేయడం కంటే, మిన్నకుండటమే మేలని మోదీ ప్రభుత్వం గుర్తించేదెన్నడు?