
న్యూఢిల్లీ: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలు గానీ గెలిస్తే తాను ఆర్థిక మంత్రిగా ఎంపికయ్యే అవకాశాలున్నాయన్న వార్తలపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పందించారు. తన సేవలు ఉపయోగపడతాయని భావించిన పక్షంలో, అవకాశం ఉంటే భారత్ తిరిగి వచ్చేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. ‘ది థర్డ్ పిల్లర్’ పేరిట రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రాజన్ ఈ విషయాలు తెలిపారు. 2013 సెప్టెంబర్ నుంచి 2016 సెప్టెంబర్ దాకా రిజర్వ్ బ్యాంక్ 23వ గవర్నర్‌గా రాజన్ సేవలందించారు. రాజన్ పదవీకాలాన్ని పొడిగించడానికి ఎన్‌డీఏ ప్రభుత్వం నిరాకరించిన నేపథ్యంలో ఆయన ప్రస్తుతం అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయంలో భాగమైన బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా సేవలు అందిస్తున్నారు. విపక్షాల కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆర్థిక మంత్రిగా రాజన్‌నే ఎంపిక చేసే అవకాశం ఉందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కనీస ఆదాయ పథక రూపకల్పన విషయంలో సలహాలు, సూచనలు తీసుకున్న ప్రముఖ ఆర్థికవేత్తల్లో రాజన్ కూడా ఉన్నారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పడం కూడా ఈ వార్తలకు ఊతమిచ్చింది. ఈ నేపథ్యంలో రాజన్ తాజా వివరణనిచ్చారు. తాను ప్రస్తుతం నిర్వర్తిస్తున్న విధులతో సంతోషంగానే ఉన్నానని, అయితే కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సదా సిద్ధమని రాజన్ చెప్పారు.
స్వల్పకాలిక సమస్యల పరిష్కారంపై దృష్టి..
ఒకవేళ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు గానీ చేపట్టిన పక్షంలో ఏయే అంశాలకు ప్రాధాన్యం ఇస్తారన్న ప్రశ్నపై స్పందిస్తూ.. ముఖ్యంగా స్వల్పకాలిక సమస్యల పరిష్కారంపై దృష్టి పెడతానని రాజన్ చెప్పారు. ‘నాతో సహా చాలా మంది ఆర్థికవేత్తలు.. విధానాలపరంగా తీసుకోతగిన చర్యల గురించి రాశారు. అవి పుస్తకరూపంలో రాబోతున్నాయి. ఇక నా విషయానికొస్తే.. నిల్చిపోయిన చాలా ప్రాజెక్టులు మళ్లీ ప్రారంభమయ్యేందుకు ఉపయోగపడేలా స్వల్పకాలిక సమస్యల పరిష్కారంపై ప్రధానంగా దృష్టి పెడతాను’అని ఆయన పేర్కొన్నారు. అలాగే, బ్యాంకింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేయడం, సాధ్యమైనంత వేగంగా వాటిని మళ్లీ రుణ వృద్ధి బాట పట్టించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. అటు వృద్ధికి దోహదపడేలా 2–3 కీలక సంస్కరణలను కూడా ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తానన్నారు. ‘ఈ సంస్కరణల జాబితాలో వ్యవసాయ రంగంలో ఒత్తిడిని తగ్గించేందుకు అనుసరించతగిన విధానాలు కచ్చితంగా ఉంటాయి. ఇక రెండోది.. స్థల సమీకరణ సమస్య. రాష్ట్రాల స్థాయిలో అమలవుతున్న ఉత్తమ విధానాల గురించి తెలుసుకోవడం, ఆయా రాష్ట్రాలు తమకు అనువైన విధానాలను ఎంపిక చేసుకునేందుకు స్వేచ్ఛనివ్వడం ఇందుకు ఉపయోగపడగలదు. ఇలా స్థల సమీకరణ సమస్యల పరిష్కారం, బ్యాంకుల ప్రక్షాళన, వ్యవసాయాన్ని పునరుద్ధరించేందుకు కీలక విధానాల రూపకల్పనకు అత్యధిక ప్రాధాన్యమిస్తాను’ అని రాజన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment