
రాజన్ ‘వంటకాలు’ ట్రై చేస్తారా!
ఆర్‌బీఐ గవర్నర్‌గా మూడేళ్లపాటు పాలసీ విధానాన్ని వండి ‘వడ్డి’ంచి తనదైన ముద్రవేసిన రఘురామ్ రాజన్‌ను బెంగళూరుకు చెందిన ఫుడ్ చైన్ సంస్థ ‘జంగ్రీ’ వెరైటీ వంటకాలతో గౌరవిస్తోంది.
♦ ఆర్‌బీఐ గవర్నర్ సేవలకు గుర్తింపుగా 2 ప్రత్యేక వంటకాలు...
♦ బెంగళూరు ఫుడ్ చైన్ ‘జంగ్రీ’ వడ్డింపు...
బెంగళూరు: ఆర్‌బీఐ గవర్నర్‌గా మూడేళ్లపాటు పాలసీ విధానాన్ని వండి ‘వడ్డి’ంచి తనదైన ముద్రవేసిన రఘురామ్ రాజన్‌ను బెంగళూరుకు చెందిన ఫుడ్ చైన్ సంస్థ ‘జంగ్రీ’ వెరైటీ వంటకాలతో గౌరవిస్తోంది. ఆర్‌బీఐ చీఫ్‌గా రాజన్ విశిష్టసేవలకు గుర్తింపుగా రెండు ప్రత్యేక డిష్(ఒకటి స్వీట్, మరొకటి హాట్)లను వడ్డిస్తోంది. ఉలుందు కోజుకట్టాయ్, కోవా కోజుకట్టాయ్ పేర్లతో లిమిటెడ్ ఎడిషన్‌గా ఈ వంటకాలు అందుబాటులో ఉంటాయని జంగ్రీ తెలిపింది. ‘రాజన్‌తో అనుబంధం ఉన్న రెండు రాష్ట్రాలకు సంబంధించిన వంటకాలివి. ఉలుందు కోజు కట్టాయ్ రేటు రూ.100 కాగా, కోవా కోజు కట్టాయ్ రూ.150కి లభిస్తుంది.
నేటి(26) నుంచి సెప్టెంబర్ 2 వరకూ(రాజన్ పదవీకాలం ముగింపు రోజు) మాత్రమే ఈ వంటాకాలు అందుబాటులో ఉంటాయి’ అని జంగ్రీ పేర్కొంది. డాక్టర్ రఘురామ్ రాజన్ ఆర్‌బీఐ గవర్నర్‌గా అటు సామాన్య ప్రజలతో పాటు తమలాంటి ఎంట్రప్రెన్యూర్స్‌కు అనుకూలంగా కీలక నిర్ణయాలతో ఎంతగానో ప్రభావితం చేశారని.. దీనికి గౌరవసూచకంగా ఈ ప్రత్యేక వంటకాలను ప్రవేశపెట్టినట్లు జంగ్రీ సహ వ్యవస్థాపకుడు ఆశిష్ కాల్యా పేర్కొన్నారు.
ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా పాలసీ చర్యలను తీసుకోవడంతోపాటు బ్యాంకుల్లో పేరుకుపోతున్న మొండిబకాయిలకు అడ్డుకట్టవేయడం ఇతరత్రా అనేక కీలక సంస్కరణలను రాజన్ తన పదవీకాలంలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మరోపక్క, కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలతో కూడా ఆయన వార్తల్లో నిలిచారు. ‘రాక్‌స్టార్’ రాజన్‌గా పేరొందిన ఆయన స్థానంలో ప్రస్తుత డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను కేంద్రం ఆర్‌బీఐ చీఫ్‌గా ఎంపిక చేయడం తెలిసిందే.
ఇంతకీ ఈ వంటకాల సంగతేంటే...
ఉలుందు కోజుకట్టాయ్ అనేది రాజన్ పుట్టిన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక వంటకాన్ని నమూనాగా తీసుకొని జంగ్రీ రూపొందించింది. ఇక కోవా కోజుకట్టాయ్ అనేది రాజన్ పూర్వీకులతో సంబంధం ఉన్న తమిళనాడు తీపి వంటకం నుంచి రూపొందించారు.