న్యూఢిల్లీ: గత కొంతకాలంగా ఆసక్తికర చర్చకు దారితీసిన ఆర్బీఐ గవర్నర్ పదవిని అలంకరించే అభ్యర్థి ఎంపిక పై కేంద్ర ప్రభుత్వం నేడు (గురువారం) ఓ నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ సాయంత్రం సమావేశం కానున్నారు. దీంతో కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎంపికపై గురువారం ఒక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.
కాగా ప్రస్తుత గవర్నర్ రఘురామ్ రాజన్ పదవీ కాలం ఈ సెప్టెంబర్ 4 తో ముగియనుంది. రెండవసారి గవర్నర్ పదవిని చేపట్టబోననని రాజన్ స్పష్టం చేయడంతో ఈ పదవి ఎవర్ని వరించనుందనే అంశంపై పలు అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఆర్ బీఐ గవర్నర్ సుబీర్ గోకర్న్, డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్, ఎస్ బీఐ చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య తదితర పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.